కోడిగుడ్ల కోసం అప్పు చేశా: హీరోయిన్
పెద్ద నోట్లు రద్దు చేయడంతో సామాన్యుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కష్టాలంటే ఏంటో ఒక్కసారిగా తెలిసొచ్చాయి. సాధారణంగా పది రూపాయల నోట్లతో అవసరం కూడా పడని సినిమా హీరోయిన్లకు.. 500, 1000 రూపాయల నోట్లు చెల్లవు అనేసరికి ఏం చేయాలో కూడా తెలియలేదు. బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసుది కూడా ఇదే పరిస్థితి. ఆమె కోడిగుడ్లు వండుకోవాలని అనుకుంది. కానీ ఇంట్లో గుడ్లు లేవు. పోనీ తెప్పించుకుందాం అని చూస్తే.. తన దగ్గర వెయ్యి, 500 తప్ప వేరే నోట్లు ఏమీ లేవు. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులలో తాను అప్పు చేసినట్లు బిపాషా బసు ట్వీట్ చేసింది. స్టార్‌వరల్డ్ రాకీ వద్ద నుంచి తాను డబ్బులు అప్పు తీసుకున్నట్లు చెప్పింది. ఎలాంటి రోజు వచ్చింది దేవుడా అంటూ బాధపడింది.
మరోవైపు.. ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యం కారణంగా గత కొన్ని రోజులుగా తీవ్రమైన గొంతునొప్పితో బాధపడుతున్నట్లు కూడా ఆమె చెప్పింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి అత్తవారింటికి ఢిల్లీ వెళ్లడంతో.. అక్కడి కాలుష్యం బారిన పడి గొంతునొప్పి తెచ్చుకుంది. తిరిగి ముంబై చేరుకునేసరికి తనకు భరించలేని గొంతునొప్పి వచ్చిందని తెలిపింది. ఢిల్లీలో బయటి పరిస్థితి చాలా భయానకంగా ఉందని చెప్పిందీ భామ.