ఆ సన్నివేశాలు హద్దు దాటవు
మణిరత్నం చిత్రాల్లో ఆ సన్నివేశాలెప్పుడూ హద్దు దాటవు అంటున్నారు నటుడు కార్తీ. మణిరత్నం దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కాట్రువెలియిడై. ఇందులో కార్తీకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అతిథిరావు నటించారు. ఇందులో కార్తీ యుద్ధ విమాన పైలట్‌గా నటించారు. సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలు కట్టిన కాట్రు వెలియిడై చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని కార్తీ తెలుపుతూ దర్శకుడు మణిరత్నం చిత్ర కథను ఇచ్చి చదవమన్నారన్నారు.
ఇది యుద్ధ విమాన పైలట్ గురించిన కథ కావడంతో అస్సలు అర్థం కాలేదన్నారు. ఇదే విషయాన్ని మణిరత్నంకు చెప్పగా ఫైటర్ పైలట్‌గా పనిచేసేవారితో ఉండి వారి అనుభవాలను, విధి నిర్వహణలు తెలుసుకునేలా ఏర్పాటు చేశారని చెప్పారు. ఫైటర్ పైలట్స్ ఆసాధారణ విధులు తనను ఎంతగానే విస్మయ పరచాయన్నారు. కాట్రు వెలియిడై పాత్రలోని విషయం తనుకు అప్పుడు అర్థమైందని అన్నారు. ఇందులో మాలీవుడ్ నటి అతిథిరావు నాయకిగా నటించడంతో ఆమెతో రొమాన్స్ సన్నివేశాలు ఉన్నాయా? అని అడుగుతున్నారని, అలాంటి సన్నివేశాలున్నా మణిరత్నం చిత్రాల్లో హద్దులు మీరవని కార్తీ పేర్కొన్నారు.
ఇందులో కథానాయకిగా నటి సాయిపల్లవి నటించాల్సి ఉందని, ఆమె ఎందుకు నటించలేదో దర్శకుడినే అడగాలని అన్నారు. ఇకపోతే ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ మధురంగా ఉంటాయని కార్తీ పేర్కొన్నారు. ఆ చిత్రం చెలియా పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది.