సాక్షి, హైదరాబాద్: హాస్యనటుడు గుండు హనుమంతరావు మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల తెలుగు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గుండు హనుమంతరావుతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని బ్రహ్మానందం తెలిపారు. అహ నా పెళ్లంట చిత్రంతో తమ ఇద్దరికి మంచి గుర్తింపు వచ్చిందని, తనను బ్రహ్మానందం బావ అని ఆప్యాయంగా పిలిచేవాడని గుర్తుచేసుకున్నారు.
‘ఇటీవలే ఆయన తన ఇంటికి వచ్చాడని, హనుమంతు లేడంటే నమ్మలేకపోతున్నాను. ఆప్యాయతలో ఎలాంటి కల్మషం లేని వ్యక్తి హనుమంతరావు. నాకున్న అతితక్కువ మంది మిత్రుల్లో ఆయన ఒకరు. హనుమంతరావు ధన్యజీవి. హాస్యప్రదర్శనలతో ఎంతోమందిని అలరించాడు. జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నార’ని బ్రహ్మానందం అన్నారు.
తీరని లోటు: బాలకృష్ణ
ఆరోగ్యకరమైన హాస్యాన్ని యావత్ తెలుగు ప్రేక్షకులకు పంచిన గుండు హనుమంతరావు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ‘చిత్ర పరిశ్రమ మంచి నటుడ్ని కోల్పోయింది. గుండు హనుమంతరావుతో కొన్ని సినిమాల్లో కలిసి నటించాను. మృదుస్వభావి. ఆయన ఆత్మకు శాంతి చేకూరి, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాను’ అని నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment