బసంతి కళాశాలలో...
బసంతి కళాశాలలో...
Published Fri, Oct 25 2013 1:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
కళాశాలలో అడ్మిషన్ తీసుకోగానే ప్రతి విద్యార్థికీ ఓ గుర్తింపు వస్తుంది. అలాగే... కళాశాల.. విద్యార్థి బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికీ ప్రత్యేకం. ఆ రోజులనాటి మాధుర్యాన్ని గుర్తు చేసే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘బసంతి’. ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్, అలీషాబేగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ‘బాణం’ఫేం దంతలూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దంతలూరి చైతన్య మాట్లాడుతూ -‘బాణం’ కథ కంటే ముందే సిద్ధం చేసుకున్న కథ ఇది.
బసంతి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో చదివే విద్యార్థుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేశాం. సాంకేతికంగా కూడా సినిమా బాగుంటుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. నవంబర్‌లో పాటల్ని, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రణధీర్ గట్ల, నవీనా జాక్సన్, తనికెళ్ళ భరణి, సమాజీ షిండే, ఆనంద్, ధన్‌రాజ్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్ నాయుడు విస్సా, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: అనిల్ బండారి, పి.కె.వర్మ, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వివేక్ కూచిభొట్ల.
Advertisement