ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది.. ట్వీట్ల దుమారం! | Break-up for Deepika and Ranveer before Padmavati release | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 4 2017 6:54 PM | Last Updated on Sat, Nov 4 2017 6:54 PM

Break-up for Deepika and Ranveer before Padmavati release - Sakshi

సంజయ్‌లీలా భన్సాలీ తాజా దృశ్యకావ్యం 'పద్మావతి' సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రేమజంట రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకోన్‌ మధ్య ఏదో విభేదాలు పొడసూపాయన్న వార్తలు బాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌గా ముద్రపడిన రణ్‌వీర్‌-దీపిక మధ్య అంత సవ్యంగా లేదట. తన లవ్‌లేడీ దీపిక తీరుతో రణ్‌వీర్‌ తీవ్రంగా నోచ్చుకున్నాడని తెలుస్తోంది.

2013లో ఈ జంట భన్సాలీ 'గోలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలా' సినిమాతో అలరించారు. అప్పటినుంచి వీరు డేటింగ్‌ చేస్తున్నట్టు కథనాలు గుప్పుమన్నాయి. తాము ప్రేమలో ఉన్నామని ఈ జంట ఏనాడూ మీడియాముఖంగా చెప్పిందీ లేదు. కానీ, జంటగా కనిపిస్తూ.. సినీ వేడుకలకు హాజరవుతూ.. సన్నిహితంగా పార్టీలకు వెళుతూ.. తమ ప్రేమను అనేకసార్లు వీరు చాటుకున్నారు. వీరి మధ్య ఉన్న ఈ కెమిస్ట్రీయే భన్సాలీ తీసిన 'బాజీరావు మస్తానీ' సినిమాలోనూ వ్యక్తమైంది.

ప్రేమలో మునిగిపోతున్నట్టు భావిస్తున్న ఈ జంట మధ్య తాజాగా విభేదాలు రావడానికి కారణం.. 'పద్మావతి' త్రీడీ ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుక. రెండురోజుల కిందట జరిగిన ఈ వేడుకకు దీపిక కళ్లుచెదిరేరీతిలో జిగేల్‌ మనేలా హాజరైంది. ఆమె హాజరు ఈ వేడుకకు వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. కారణం ఈ వేడుక అతిథుల జాబితాలో ఆమె పేరు లేకపోవడమే. అయినా అనూహ్యంగా ఆమె రావడం.. అదే సమయంలో ఈ చిత్రంలో ఇతర ప్రధాన నటులైన రణ్‌వీర్‌, షాహిద్‌ కపూర్‌ రాకపోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది.

3డీ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు దీపిక ఒంటరిగా హాజరుకావడం.. ఆమె సహ నటులు రణ్‌వీర్‌, షాహిద్‌లకు కోపం తెప్పించినట్టు తెలుస్తోంది. తాము తీరికతోనే ఉన్నా.. తమకు సమాచారం ఇవ్వకుండా దీపిక ఒంటరిగా వెళ్లడంతో వారికి పుండు మీద కారం చల్లినట్టు అయిందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా 'పద్మావతి' ట్రైలర్‌ విడుదలైన నాటినుంచి అల్లావుద్దీన్‌ ఖిల్జీగా నటించిన రణ్‌వీర్‌కు విశేషమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఇది కూడా దీపికలో అభద్రతాభావాన్ని నింపిందని, అందుకే ఆమె సహ నటులకు మాటమాత్రమైన చెప్పకుండా ఒంటరిగా 3డీలాంచ్‌ వేడుకకు వెళ్లి హల్‌చల్‌ చేసిందని ఆ వర్గాలు అంటున్నాయి. 'పద్మావతి'లో దీపిక టైటిల్‌ రోల్‌ పోషించినా.. రణ్‌వీర్‌, షాహిద్‌లకు వచ్చినంత పేరుప్రఖ్యాతలు, ప్రశంసలు దీపికకు రాలేదని అంటున్నారు. ఈ క్రమంలో బాయ్‌ఫ్రెండ్‌ అయిన తనకే టోకరా ఇచ్చి దీపిక ఒంటరిగా వెళ్లడం రణ్‌వీర్‌కు షాక్‌కు గురిచేసిందట. దీంతో కోపోద్రిక్తుడైన రణ్‌వీర్‌.. తన పర్సనల్‌ టీమ్‌ను తీసిపారేయడమేకాకుండా.. అప్పటినుంచి దీపికతో మాట్లాడటం లేదని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

ఈ వేడుక తర్వాత రణ్‌వీర్‌ పెట్టిన నిగూఢమైన ట్వీట్స్‌ సైతం ఇదే విషయాన్ని చాటుతుండటం గమనార్హం. మొదటి ట్వీట్‌లో పద్మావతి 3డీ ట్రైలర్‌ తనకు బాగా నచ్చిందని, 3డీలో తనను తాను చూసుకోవడం అద్భుతంగా ఉందని పేర్కొన్న రణ్‌వీర్‌.. అనంతరం తొలిసారి తనను ఒక తేనేటీగ కుట్టిందని, ఆ ఫొటో పెడితే.. ఆ తేనేటీగ ఫేమస్‌ అవుతుందని పెట్టడం లేదని ట్వీట్‌ చేశాడు. ఇక మిగిలిన తన జీవితంలో ఇదే తొలిరోజు అని, ఇప్పటివరకు జరిగినదానితో విసిగిపోయానని రణ్‌వీర్‌ పేర్కొన్నాడు. దీపికపై కోపంతోనే.. ఆమెను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఈ ట్వీట్లు చేశాడని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement