
బ్రెట్ లీ ముద్దు సీన్ పై వివాదం
మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రెట్ లీ, బాల్ పక్కన పెట్టి చాలా కాలం అవుతోంది. అయితే తాజాగా ముఖానికి మేకప్ వేసుకొని హీరో వేషాలు వేస్తున్నాడు ఈ స్టార్ బౌలర్. అన్ ఇండియన్ అనే పేరుతో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి.
బ్రెట్ లీ ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చే ఓ సన్నివేశంలో హీరోయిన్ తనీషా ఛటర్జీకి ముద్దు పెట్టే సీన్ ఉంది. ఈ సీన్ దాదాపు ఒక నిమిషం ఎనిమిది సెకన్లపాటు ఉంటుందట. ఇంత నిడివి కలిగిన ముద్దు సీన్కు అంగీకరించమన్న సెన్సార్ బోర్డ్ ఆ సన్నివేశాన్ని 26 సెకన్లకు తగ్గిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామంటూ తేల్చేసింది. అదే సమయంలో బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తున్న ఓం శ్రీం అనే ఛాంటింగ్ను కూడా తొలగించాలని సూచించింది.
దర్శకుడు అనుపమ్ శర్మ మాత్రం ఇందుకు అంగీకరించటం లేదు. తాజాగా ఉడ్తా పంజాబ్ సినిమా విషయంలో.. సెన్సార్ బోర్డు కేవలం సర్టిఫికేట్ ఇవ్వాలే గాని సెన్సార్ చేయకుడదన్న కోర్టు వ్యాఖ్యలను సెన్సార్ బోర్డ్ పాటించటం లేదని ఆరోపిస్తున్నాడు. ఆగస్టు 19న సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్న చిత్రయూనిట్ ఈ లోగా వివాదానికి ఎలా స్వస్తి పలుకుతుందో చూడాలి.