సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆలస్యంగా బౌలింగ్‌కు రావటాన్ని విమర్శించాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అయిన కమిన్స్.. సహచరులకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఇలాంటి పనులు చేయడం బాగానే ఉన్నప్పటికీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా సరికాదని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ సారథిగా అడుగుపెట్టిన కమిన్స్ మంచి ఫలితాలు రాబడుతున్నాడు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో వరుస ఓటముల కారణంగా అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైతో చెపాక్ మ్యాచ్‌లో కమిన్స్ కొత్త బంతితో బౌలింగ్ చేయకపోవడాన్ని బ్రెట్ లీ తప్పుబట్టాడు.
కాగా సన్‌రైజర్స్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో బౌలింగ్ అటాక్ ఆరంభించిన కమిన్స్.. తదుపరి ఓవర్లో బంతిని ఆల్‌రౌండర్ నితీశ్‌రెడ్డికి చేతికిచ్చాడు. అనంతరం షాబాజ్ అహ్మద్, నటారాజన్, జయదేవ్ ఉనాద్కట్‌తో బౌలింగ్ చేయించాడు. తాను మాత్రం తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు దిగాడు.
మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో 212 పరుగులు చేసిన చెన్నై.. లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన సన్‌రైజర్స్‌ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
ఈ నేపథ్యంలో బ్రెట్ లీ మాట్లాడుతూ.. ‘‘ప్యాట్ కమిన్స్ చాలా ఆలస్యంగా బరిలోకి వచ్చాడు. నాలుగు ఓవర్లు బౌల్ చేసి 49 పరుగులు ఇచ్చాడు. తను ధారాళంగా పరుగులు ఇచ్చిన మాట వాస్తవమే.
నిజానికి తను కొత్త బంతితో అద్భుతంగా రాణించగలడు. కానీ వేరే వాళ్లకు అవకాశం ఇచ్చాడు. కొన్నిసార్లు మరీ మంచి కెప్టెన్‌గా మారిపోతాడు. బౌలింగ్ కెప్టెన్‌గా.. ఇతర బౌలర్లకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదే.
కానీ వరల్డ్ బెస్ట్ బౌలర్ బౌలింగ్ అటాక్ ఆరంభించకపోవడం సరికాదు. స్వార్థంగా ఉండమని నేను చెప్పటం లేదు. ప్యాట్ కమిన్స్.. ప్యాట్ కమిన్సే. కనీసం రెండో ఓవర్లోనైనా అతడు బౌలింగ్‌లోకి దిగాల్సింది’’ అని జియో సినిమా షోలో వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment