స్కూల్లో బన్నీ నా జూనియర్
సోమాజిగూడ: ప్రముఖ నటుడు కార్తీ బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌లో శుక్రవారం సందడి చేశారు. ప్రముఖ కాఫీ బ్రాండ్ ‘బ్రూ రోస్ట్ అండ్ గ్రౌండ్’ సరికొత్త ప్యాక్‌ను ఆవిష్కరించారు. తనకు అత్యంత ప్రియమైన బ్రూ కాఫీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నటుడు నాగార్జున సోదరుడిలాంటి వాడన్నారు. తనూ తమన్నా, కాజల్ మంచి ఫ్రెండ్స్, అందరం దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. 'సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్(బన్నీ) నాకు మంచి మిత్రుడు. అయితే నేను చదువుకున్న స్కూల్లోనే బన్నీ చదివాడు. బన్నీ నా జూనియర్ అని తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను' అని కార్తీ అన్నారు. తమ సొంత బ్యానర్లో బన్నీతో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. కుటుంబంతో కలిసి నటించే ఉద్దేశం అయితే లేదు కానీ, అన్నయ్య సూర్యతో మాత్రం కలిసి నటిస్తానని తెలిపారు.
లింగుస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ పతాకంపై అల్లు అర్జున్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న చిత్రం గురువారం చెన్నైలో ప్రారంభమైన విషయం తెలిసిందే.