భాగ్యనగరంలో బిజీ బిజీగా... | Busy in Bhagyanagaram | Sakshi
Sakshi News home page

భాగ్యనగరంలో బిజీ బిజీగా...

Published Tue, Apr 8 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM

భాగ్యనగరంలో బిజీ బిజీగా...

భాగ్యనగరంలో బిజీ బిజీగా...

క్లాసు, మాసు తేడా లేకుండా, చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరూ మెచ్చిన సినిమా ‘దూకుడు'. ఆ సినిమాతో మహేశ్-శ్రీను వైట్ల కాంబినేషన్‌కి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు ‘ఆగడు' పై అంచనాలకు కారణం అదే. పైగా మహేశ్‌తో తమన్నా జతకట్టడం ఇందులో మరో విశేషం. ప్రస్తుతం ‘ఆగడు' షూటింగ్ ఎక్కడా ఆగకుండా... శరవేగంతో జరుగుతోంది. ఈ సినిమాలో మహేశ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. పోకిరి, దూకుడు... మహేశ్ పోలీస్‌గా నటించిన సినిమాలు. ఆయన్ను సూపర్‌స్టార్‌ని చేసిన సినిమాలు కూడా అవే. దాన్ని ‘ఆగడు' కూడా కొనసాగిస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ మార్చి 28 నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది.
 
 మహేశ్, తమన్నా,  రాజేంద్రప్రసాద్, సోనూసూద్ తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు శ్రీనువైట్ల. ఈ నెల 10 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుందని యూనిట్ వర్గాల సమాచారం. తర్వాత బళ్లారిలో 5 రోజులు, గుజరాత్‌లో 10 రోజులు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపనున్నట్లు తెలిసింది. అలాగే జమ్మూ-కాశ్మీర్‌లో పాటలను చిత్రీకరించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు వినికిడి. కృష్ణ పుట్టినరోజైన మే 31న ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల
చేయనున్నారు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను జూన్‌లో విడుదల చేసి, జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. నెపోలియన్, సాయికుమార్, బ్రహ్మానందం, నదియా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.వి.గుహన్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, నిర్మాణం: 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement