సి. కల్యాణ్
‘‘నా సినిమాలు సూపర్ హిట్ సాధించకపోవచ్చు. నా కెరీర్‌లో సూపర్ ఫ్లాప్ సినిమా లేదు. బ్యాడ్ లేదా వల్గర్ సినిమాలను కల్యాణ్ తీశాడని అనిపించుకోలేదు. సెట్ అయ్యే ప్రాజెక్ట్ కోసమే తపన పడతాను. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీయాలని ఎగబడలేదు. రామానాయుడిగారిని స్ఫూర్తిగా ఫీలయ్యి కెరీర్‌లో ముందుకు సాగుతున్నాను. ఈ జర్నీ ఎక్కడ ఆగుతుందో తెలీదు. నిర్మాతగా వంద చిత్రాలను కంప్లీట్ చేయాలన్నది నా ప్రయత్నం’’ అన్నారు నిర్మాత సి. కల్యాణ్. సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సి. కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ విలేకరులతో చెప్పిన విశేషాలు.
► ఈ ఏడాది ‘జై సింహా’ చిత్రంతో నిర్మాతగా నాకు శుభారంభం జరిగింది. చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత వీవీ వినాయక్‌గారు దర్శకత్వం వహించిన ‘ఇంటిలిజెంట్’అందరి అంచనాలను మించేలా ఉంటుందన్న నమ్మకం ఉంది. తేజూ కెరీర్ గ్రాఫ్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధిస్తుంది. తేజూ డ్యాన్స్ ఇరగదీశాడు. చాలా కష్టపడ్డాడు. ‘ఇంటిలిజెంట్’ చూసిన తర్వాత, వీళ్లు చాలా ఇంటెలిజెంట్‌గా తీశారని ప్రేక్షకులు అనుకుంటారు. తమన్ మంచి సంగీతం ఇచ్చారు. వినాయక్ సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ఆడుతూ పాడుతూ సినిమాను కంప్లీట్ చేశాం.
► ఒకే టైమ్‌లో మోహన్‌బాబుగారి ‘గాయత్రి’, ‘ఇంటిలిజెంట్’.. ఇంకా వేరే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ నెక్ట్స్ డే ‘తొలి ప్రేమ’ రిలీజ్ అవుతుంది. మోహన్‌బాబుగారి ఇంటి నుంచే నా సినీ ప్రయాణం మొదలైంది. నాగబాబు, వరుణ్‌తేజ్‌లతో మంచి ఎటాచ్‌మెంట్ ఉంది. మా సినిమాతో పాటు రిలీజ్ కానున్న అన్ని సినిమాలూ ఆడాలి.
► న్యూమరాలజీ మీద నాకు నమ్మకం ఉంది. అందుకే ‘ఇంటిలిజెంట్’ అని పెట్టాం. స్పెల్లింగ్ మిస్టేక్ కాదు. సుమన్ హీరోగా ‘నేటి న్యాయం’ చిత్రంతో నేను డైరెక్టర్‌గా పరిచయం కావాల్సింది కానీ కుదర్లేదు. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. నిర్మాతగా 70వ సినిమా ‘ఇంటిలిజెంట్’. కథలో ఇన్‌వాల్వ్ అవుతాను. కాకపోతే నా ఆలోచనలను సూచనలుగా పరిశీలించమని డైరెక్టర్‌కు చెబుతాను.
► ఓ చిన్న డైరెక్టర్‌తో ‘భారతి’ అనే సినిమాను తీయబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను. శివ దర్శకత్వంలో రానా హీరోగా చేస్తున్న ‘1945’ చిత్రం ఫైనల్ స్టేజ్‌లో ఉంది. వినాయక్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment