C/o Kancharapalem Review, in Telugu | ‘C/o కంచరపాలెం’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Sun, Sep 2 2018 11:46 AM | Last Updated on Fri, Sep 7 2018 1:06 PM

Care Of Kancharapalem Telugu Movie Review - Sakshi

టైటిల్ : C/o కంచరపాలెం
జానర్ : డ్రామా
తారాగణం : సుబ్బారావు, రాధ బెస్సీ, కేశవ కర్రీ, నిత్య శ్రీ, కార్తీక్‌ రత్నం, విజయ ప్రవీణ, మోహన్‌ భగత్‌, ప్రణీత పట్నాయక్‌
సంగీతం : స్వీకర్‌ అగస్తీ
దర్శకత్వం : వెంకటేష్‌ మహా
నిర్మాత : విజయ ప్రవీణ పరుచూరి
సమర్పణ : రానా దగ్గుబాటి

కొంత కాలంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. రొటీన్‌ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి రియలిస్టిక్‌గా తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అనవసరమైన బిల్డప్‌లు, హీరోయిజం, యాక్షన్‌ లాంటివి లేకుండా సమాజంలో కనిపించే వ్యక్తిత్వాలనే కథగా తెరకెక్కించే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో రియలిస్టిక్‌ మూవీ ‘C/o కంచరపాలెం’. వెంకటేష్ మహా దర్శకుడిగా విజయ ప్రవీణా పరుచూరి నిర్మాతగా తెరకెక్కించిన సినిమా C/o కంచెరపాలెం. కంచెరపాలెం అనే గ్రామంలో అక్కడి ప్రజలతోనే తెరకెక్కించిన ఈ సినిమాను యంగ్ హీరో రానా దగ్గుబాటి తన సమర్పణలో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో C/o కంచరపాలెం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇప్పటికే సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..?

కథ :
ఇది వయసు పరంగా నాలుగు కేటగిరిలో ఉన్న నాలుగు జంటల ప్రేమకథ. సుందరం (కేశవ కర్రి) స్కూల్ పిల్లాడు. తన క్లాస్‌మెట్‌ సునీత (నిత్య శ్రీ) అంటే సుందరానికి చాలా ఇష్టం. స్నేహితుడి సాయంతో ఎలాగైన సునీతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. జోసెఫ్‌ (కార్తీక్‌ రత్నం) టీనేజ్‌ కుర్రాడు. ఓ జిమ్‌లో పనిచేస్తూ గొడవలు, సెటిల్‌మెంట్స్‌ చేసే జోసెఫ్‌ ఓ గొడవ వల్ల పరిచయం అయిన భువనేశ్వరి (ప్రణీతా పట్నాయక్‌) అనే బ్రాహ్మణుల అమ్మాయిని ప్రేమిస్తాడు. గడ్డం (మోహన్ భగత్‌) వైన్‌ షాపులో పనిచేసే కుర్రాడు. తమ షాప్‌లో రోజు మందుకొనే ఓ వేశ్య సలీమా( విజయ ప్రవీణా పరుచూరి)ను కళ్లు చూసి ప్రేమిస్తాడు.

రాజు (సుబ్బారావు) ఓ గవర్నమెంట్‌ ఆఫీసులో అటెండర్‌. 49 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాకపోవటంతో ఊళ్లో అంతా రాజు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. అదే సమయంలో  ఒరిస్సా నుంచి ట్రాన్సఫర్‌ మీద తమ ఆఫీసుకు వచ్చిన ఆఫీసర్‌ రాధ( రాధ బెస్సీ) తో ప్రేమలో పడతాడు. భర్త చనిపోయి చాలాకాలంగా ఒంటరిగా ఉంటున్న రాధ, రాజును పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇలా కంచరపాలెంలో మొదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాలలో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి.? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి..? చివరకు వారి కథలు ఎలా ముగిసాయి..? అన్నదే కేరాఫ్ కంచరపాలెం కథ.



విశ్లేషణ :
ఓ గ్రామంలోని వ్యక్తులు వారి జీవితాలే కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు వెంకటేష్‌ మహా.. ఎక్కడా సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు. సినిమాను పూర్తిగా సహజంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎలా మాట్లాడతాయో అలాగే తెర మీద ఆవిష్కరించాడు. అదే సమయంలో సమాజంలో ఉన్న అంతరాలు, కులమత భేదాలు వాటి పర్యవసానాలను మనసును తాకేలా చూపించాడు. కమర్షియల్‌ లెక్కల కోసం హాస్య సన్నివేశాలను ఇరికించకుండా.. లీడ్‌ క్యారెక్టర్స్‌ ప్రవర్తన నుంచే కామెడీ పండించి ఆకట్టుకున్నాడు. అందుకే సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కంచరపాలెంలో అక్కడి ప్రజలతో కాసేపు గడిపిన భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్లో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు నెమ్మదిగా కథ నడిపించాడు. నాలుగు కథలను ప్యారలల్‌గా నడిపించిన దర్శకుడు క్లైమాక్స్‌ ట్విస్ట్‌తో ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చాడు.

నిర్మాణ పరంగాను సినిమాకు మంచి మార్కులు పడతాయి. తమకున్న లిమిటేషన్స్ మధ్య అద్భుతమైన అవుట్‌ పుట్‌ ఇవ్వటంలో నిర్మాత కృషి ప్రతీఫ్రేమ్‌లో కనిపిస్తుంది. లైవ్‌ రికార్డింగ్‌ అయినా ఎక్కడ ఆడియో డిస్ట్రబెన్స్‌ లేకుండా క్వాలిటీ సౌండ్‌ను అందించారు. సినిమాకు మరో ఎసెట్‌ వరుణ్‌, ఆదిత్యల సినిమాటోగ్రఫి. కంచరపాలెం వాతావరణాన్ని వ‍్యక్తిత్వాలను అందంగా ఫ్రేముల్లో బందించారు. స్వీకర్‌ అగస్థి సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమా అంతా ఆఫ్‌బీట్‌ తరహాలో సాగటంతో కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇక నటీనటుల విషయానికి వస్తే దాదాపు 52 మంది కొత్త తారలు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. మేకప్‌, కలర్‌ ఫుల్‌ కాస్ట్యూమ్స్‌ లాంటివి లేకుండా తెర మీద సహజంగా కనిపించారు. అయితే అంతా కొత్త వారు కావటంతో అక్కడక్కడ వారి నటనలో కాస్త నాటకీయత కనిపించినా.. ఒకసారి కథలో లీనమైతే అవేవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. రొటీన్ కమర్షియల్ మూసకు భిన్నంగా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ‘C/o కంచరపాలెం’ సినిమాకు ఇప్పటికే సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.

- సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement