Care of Kancharapalem
-
కోలీవుడ్‌లో కేరాఫ్ కంచరపాలెం రీమేక్
సినిమా: తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం కేరాఫ్ కంచరపాలెం. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో పునర్ నిర్మాణం కానుంది. శ్రీ షిరిడీ సాయి మూవీస్ పతాకంపై ఎం.రాజశేఖర్‌రెడ్డి, జీవన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేమంబర్ జాస్తీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ తెలుగులో మంచి విజయాన్ని సాధించిన కేరాఫ్ కంచరపాలెం చిత్రాన్ని తమిళ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసి చేయనున్నామని చెప్పారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాల్సి ఉంటుందన్నారు. కారణం ఇది నిజజీవితంలో జరి గే సంఘటనల ఆధారంగా తయారు చేసిన కథ అని తెలిపారు. ఇందులోని సంఘటనలు, నిజ జీవితంలో నిత్యం మనకు తారసపడేవేనని అన్నా రు. చిత్రం చూసిన ప్రేక్షకులు అందులోని పాత్రల్లో తమను ఊహించుకుంటారన్నారు. కాగా చిత్రం ఆధ్యంతం జనరంజకంగా ఉంటుందని చెప్పారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను నిర్వహించన ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని, త్వరలోనే చిత్రీకరణను ప్రారంభింనున్నట్లు తెలిపారు. దీనికి స్వీకర్ అగస్తీ సంగీతాన్ని అందిస్తుండగా, గుణశేఖరన్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. మహా వెంకటేశ్ కథా సహకారాన్ని, నీలన్ సంభాషణలను, కపిలన్ పాటలను రాస్తున్నట్లు చెప్పారు. కాగా తెడియపల్లి మదన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
తమిళ్, మలయాళంలో ‘C/o కంచరపాలెం’ రీమేక్
గతేడాది విడుదలైన చిన్న బడ్జెట్ చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. ఇప్పుడీ సినిమా తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ కానుంది. దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన ‘శైవం’తో పాటు తెలుగులో ‘కలర్స్’ స్వాతి, నవీన్ చంద్ర ముఖ్య తారలుగా ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో ‘త్రిపుర’ చిత్రాన్ని నిర్మించిన యమ్. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. రేపు (బుధవారం) తన పుట్టిన రోజు సందర్భంగా రాజశేఖర్ రెడ్డి తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా షిరీడీ సాయి మూవీస్ పతాకంపై తాను నిర్మించనున్న చిత్రాల గురించి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ‘స్ట్రయిట్ చిత్రాలు నిర్మించడంతో పాటు గతంలో విజయ్ ఆంటోనీని తెలుగు తెరకు పరిచయం చేసిన ‘నకిలీ’, అలాగే ‘ప్రేమలో పడితే’, తమిళ చిత్రాలను తెలుగులోకి డబ్బింగ్ చేశాను. అలాగే తెలుగులో సిద్ధార్థ్, శ్రుతీహాసన్, హన్సిక కాంబినేషన్లో రూపొందిన ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రాన్ని తమిళంలో ‘శ్రీధర్’ పేరుతో అనువదించి, విడుదల చేశాను. గతంలో నేను హోటల్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగాలలో అనేక బిజినెస్‌లు చేశాను. ఎన్ని బిజినెస్‌లు చేసినా నాకు తృప్తినిచ్చేది సినిమా మాత్రమే. అందుకే మంచి సినిమాలు తీయాలనే నిర్ణయంతో నా పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఈ మధ్య నేను చూసిన బెస్ట్ సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. ఆ సినిమాలోని చాలా సన్నివేశాలకు నేను కనెక్ట్ అయ్యాను. సినిమా చూడగానే డైరెక్ట్‌గా సురేశ్‌బాబు దగ్గరికెళ్లి ఫ్యాన్సీ రేట్ చెల్లించి ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రం తమిళ, మలయాళ రైట్స్‌ను సొంతం చేసుకున్నాను. సినిమా రైట్స్ సొంతం చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశాం. తమిళంలో పేరు పొందిన నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. మలయాళ వెర్షన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తాం. జూన్ నెల చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇది కాకుండా తెలుగులో మంచి పేరున్న నటీనటులతో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తాను’ అని చెప్పారు. -
తెరపై పాత్రలు కనుల ముందు..
గోపాలపట్నం(విశాఖ పశ్చిమం): ఆదివారం ఉదయం.. గోపాలపట్నంలో నరసింహ థియేటర్.. కేరాఫ్ కంచరపాలెం సినిమా మార్నింగ్ షో ప్రదర్శితమవుతోంది. ఉదయం 9.45 గంటలకు యథావిధిగా షో మొదలైంది. ప్రేక్షకులంతా సినిమాలో లీనమయ్యారు. ఇంట ర్వెల్ సమయమయ్యే సరికి ప్రేక్షకులు బయటకు వెళ్లేందుకు లేస్తుండగా.. వారి మధ్యనుంచి వెళ్లిన కొందరు తెర ఎదుట కనిపించారు.వారిని గుర్తిం చిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అందరూ కేరాఫ్ కంచరపాలెం చిత్రంలోని నటీనటులే. గప్‌చుప్‌గా ప్రేక్షకులతో పాటే ఇంటర్వెల్ వరకు వీక్షించిన వీరంతా విరామ సమయంలో సర్ప్రై జ్ ఇచ్చారు. అప్పటివరకు సినిమాలో చూసిన నటీనటులు ఒక్కసారిగా కనులముందు కనిపిం చేసరికి థియేటర్ అంతా ఈలలు, కేకలతో దద్దరిల్లింది. వారిలో పాత్రధారి రాజు ప్రేక్షకుల కోరికపై ఒక సన్నివేశాన్ని నటించి అలరించారు. రాజు పాత్రధారి(డి. సుబ్బారావు), హీరోయిన్ రాధ, అమ్మోరు పాత్రధారి ఉమామహేశ్వరరా వు, ఇతర నటీనటులు కిశోర్, సూరిశెట్టి మధు, అప్పారావు, రమణ, శైలజ , సురేష్, రోష్ని, మానుషి, బాలనటులు కేశవ, నిత్య, లిఖిత, జశ్వంత్‌లను ఇక్కడి వేడుకలో ప్రభుత్వ విప్ గణ బాబు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ స్థానికులే నటీనటులుగా రూపొందిన ఈ చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉండడంతో పాటు సందేశాత్మకంగా ఉందన్నారు. కంచరపాలెం లో భాష, కట్టుబాట్లు, జీవనవిధానం ఈ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించాయన్నారు. ఈ చిత్రంలో నటీనటులకు మరిన్ని సినిమా అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. థియేటర్ నిర్వాహకుడు కేవీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
హీరో లేడు.. విలన్ లేడు..
హీరో లేడు.. విలన్ లేడు.. ఫైట్స్ లేవు.. కమర్షియల్ ఎలిమెంట్స్ అస్సలే లేవు. కానీ కథే బలం.. పాత్రలే హీరోలు. ఇప్పుడు పరిశ్రమలో మొత్తం ఈ చిత్రం గురించే చర్చ. మోడ్రన్ క్లాసిక్ అంటూ కితాబిస్తున్నారు కూడా. తెలుగు నేటివిటీతో సినిమాలు అరుదుగా వస్తున్న నేపథ్యంలో స్వచ్ఛమైన కథతో, సహజమైన అనుభూతితో, మనచుట్టూ తిరిగే పాత్రలతో తెరకెక్కిన చిత్రం కేరాఫ్ కంచరపాలెం. మహా వెంకటేష్ దర్శకత్వంలో హీరో రానా సమర్పణలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది. ఎందరో సినీ ప్రముఖుల ప్రశంసలు పొందింది. ఇందులో నటించిన వారిలో ఒకరిద్దరు తప్ప అందరూ కొత్తవాళ్లే.. అందులోనూ వైజాగ్ ప్రాంతానికి చెందినవారే. స్థానికులనే ఎంపిక చేసిన దర్శకుడు వారితో అద్భుతంగా నటింపజేశారు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలైన ఎనిమిది మంది ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ... కమల్‌హాసన్ అంటే ఇష్టం... నాది వైజాగ్‌లోని రామ్మూర్తి పంచలపేట. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. కేరాఫ్ కంచరపాలెంలో అనుకోకుండా అవకాశం వచ్చింది. చిత్రంలో రామ్మూర్తి పాత్ర చేసిన కిషోర్ మా వీధిలోనే ఉండేవాడు. కిషోర్ దర్శకుడు మహా వెంకటేష్‌కి స్నేహితుడు. ఆయన ద్వారా సినిమాలో పాత్రకి నన్ను రికమండ్ చేశారు. చిత్రంలో 49 ఏళ్లైనా పెళ్లికాని రాజు క్యారెక్టర్ నాది. నాకు ముగ్గురు మగ పిల్లలు. చిన్న చిన్న నాటకాలు కూడా వేశాను. కమల్‌హాసన్ అంటే ఇష్టం. చిత్రంలో నా పాత్రను చాలామంది అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా దర్శకుడికే దక్కుతుంది. నా స్వభావానికి, బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.– సుబ్బారావు హ్యాపీగా ఉంది... మా పూర్వీకులది అసోం. కానీ వైజాగ్‌లో స్థిరపడ్డాం. అంతకుముందు ప్రైవేట్ ఉద్యోగం చేసేదాన్ని. ప్రస్తుతానికి హాస్పిటల్లో ఆయాగా చేస్తున్నాను. ఈ చిత్రంలో అనుకోకుండా అవకాశం దక్కింది. సలీమ పాత్ర ఎంపిక కోసం దర్శకుడు మా ఇంటికి వచ్చారు. నన్ను చూసిన ఆయన రాధా పాత్రకు మీరు సరిపోతారని, నటిస్తారా? అని అడిగారు. నేను ఆడిషన్ ఇస్తానని చెప్పాను. నిర్మాత పరుచూరి విజయ ప్రవీణకు నా నటన నచ్చడంతో ఓకే చేశారు. నా జీవితంలో కూడా సినిమా కష్టాలున్నాయి. చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రామ్మూర్తి భార్యగా నా కుమార్తె రూప నటించింది. మీరు చాలా సహజంగా నటించారంటూ కితాబిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. – రాధా బెస్సీ కదిలించింది... మాది తాడేపల్లిగూడెం దగ్గర పత్తిపాడు శివారు కాగులంపాడు గ్రామం. నేను తెలుగు యూనివర్సిటీలో ఎంఏ థియేటర్ ఆర్టిస్ట్ చేశాను. అనంతరం నటనలో హెస్సీయూలో పీజీ చేశాను. థియేటర్ ఆర్టిస్ట్‌గా నాటకాలు వేశాను. వివిధ చిత్రాలు, సీరియల్స్, వెబ్‌సీరిస్‌లలో నటించాను. అపర్ణ మల్లాడి ద్వారా మహా వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. సినిమాలో నా పాత్రకు ‘గెడ్డం’ అని పేరు. వైన్‌షాప్‌లో పనిచేస్తూ ఓ అమ్మాయి కళ్లను మాత్రమే చూసి ప్రేమిస్తాను. ఆ అమ్మాయి వేశ్య. ఈ క్యారెక్టర్ నన్నెంతో కదిలించింది. చిత్రంలో మంచి పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది. ఇదంతా దర్శకుడు మహాకే దక్కుతుంది. ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రియలిస్టిక్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. – మోహన్‌భగత్ ఇదే నిదర్శనం.. నేను తెలుగమ్మాయి అయినా అమెరికాలో పుట్టి పెరిగిన ఎన్ఆర్ఐ డాక్టర్ని. కార్డియాలజీలో ఎండీ చేశాను. సినిమాలంటే ఆసక్తి ఉండేది. దర్శకుడు మహా వెంకటేష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, అది కూడా క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేస్తున్నారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. కథ నచ్చడంతో నిర్మాణానికి మందుకొచ్చాను. సినిమా చేస్తున్న సమయంలో సలీమ పాత్రకు ఎవరూ సరిపోకపోవడంతో దర్శకుడు మహా మీరు ఆడిషన్ ఇవ్వండని అడిగారు. అలా చిత్రంలో సలీమ అనే వేశ్య పాత్ర చేశాను. తనను అమితంగా ప్రేమించిన గెడ్డంతో బతకాలనుకున్న సలీమ చాలా రియలిస్టిక్‌గా అందరి హృదయాలను ఆకట్టుకుంది. చిత్రం తీశాక హీరో రానాకి చూపించాం. ఆయనకు నచ్చడంతో రానా సమర్పణలో విడుదల చేశాం. సినీ ప్రముఖులు, విమర్శకులు చిత్రాన్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఓ మంచి సినిమాకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు నిండుగా ఉంటాయనడానికి కేరాఫ్ కంచరపాలెం నిదర్శనం. – పరుచూరి విజయ ప్రవీణ (నిర్మాత, చిత్రంలో సలీమ) అసిస్టెంట్‌గా చేశాను... నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ సీతాఫల్మండి. సీఏ చదువుతున్నాను. థియేటర్ ఆర్టిస్ట్‌గా పాతిక నాటకాలు వేశాను. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నాను. అపర్ణ మల్లాడి, బాబీరావు కనపర్తి నా గురించి దర్శకుడు మహా వెంకటేష్‌కి చెప్పారు. అలా ఆయన జోసఫ్ పాత్రకు ఎంపిక చేశారు. పలు చిత్రాల్లో నటించినప్పటికీ కేరాఫ్ కంచరపాలెంలో ముఖ్యపాత్ర చేసినందుకు సంతోషంగా ఉంది. క్రిస్టియన్ అబ్బాయిగా ఓ బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమించిన పాత్ర నాది. సినిమా చూసి అభినందిస్తుంటే సంతోషంగా ఉంది. అన్నట్టు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేశాను. ఢిపరెంట్ రోల్స్ చేయాలని ఉంది. – కార్తీక్ రత్నం రియల్ లైఫ్‌లోనూ... మాది వైజాగ్‌లోని సీతమ్మధార. గీతం వర్సిటీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాను. నేను క్లాసికల్ డ్యాన్సర్, మోడల్ని. మిస్ వైజాగ్ ఫైనల్స్‌లో కంటెస్ట్ చేశాను. మిస్ బ్యూటిఫుల్ ఐస్‌గా అవార్డు అందుకున్నాను. మా గురువు పీవీ భరణి శంకర్ ద్వారా దర్శకుడు మహా వెంకటేష్‌గారు పరిచయమయ్యారు. చిత్రంలో బ్రాహ్మణ అమ్మాయిగా ఓ క్రిస్టియన్ అబ్బాయిని ప్రేమించిన భార్గవి పాత్రలో నటించాను. ధైర్యంతో పాటు ముక్కుసూటి అమ్మాయి క్యారెక్టర్. నిజంగా రియల్ లైఫ్‌లో కూడా అలానే ఉంటాను. కెమెరా ముందు నటించడానికి కొద్దిగా భయం వేసినా చిత్రంలోని పాత్ర నా స్వభావానికి దగ్గరగా ఉండటంతో ధైర్యంగా చేశాను. మంచి పాత్రలు చేయడానికి సిద్దంగా ఉన్నాను. – ప్రణీత పట్నాయక్ క్రెడిట్ ‘మహా’దే... మాది కంచరపాలెం దగ్గర గిరిజాల. పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఓ రోజు కంచరపాలెం గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న నన్ను చూసిన దర్శకుడు మహా అన్న... నన్ను నటించమని అడిగారు. అప్పటకి నేను పదోతరగతి చివర్లో ఉన్నాను. ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను. ఏమీ కాదు... నటించు అని ప్రోత్సహించారు. అలా సుందరం పాత్ర చేశాను. స్కూల్లో తోటి విద్యార్థిని సునీతను అమితంగా ఇష్టపడిన పాత్రలో నటించాను. చాలా సంతోషంగా ఉంది. వైజాగ్‌లో చాలా మంది చూసి ‘తమ్ముడూ.. బాగా చేశావు’ అంటుంటే ఆనందంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా మహా అన్నదే. నా క్యారెక్టర్‌కు సూటయ్యే పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.– కేశవ కర్రి అవకాశాలు వస్తున్నాయి.. మాది వైజాగ్. ఎనిమిదో తరగతి చదువుతున్నాను. షార్ట్‌ఫిల్మŠస్లో నటించాను. చిత్రంలో రామ్మూర్తి నత్తి పాత్ర చేసిన కిషోర్ అంకుల్ ద్వారా మహా వెంకటేష్ అంకుల్ నన్ను కలిశారు. కిషోర్, కుసుమ, కిషన్ అంకుల్ మా ఫ్యామిలీ ప్రెండ్స్. డ్యాన్సింగ్, సింగింగ్‌లో అనుభవం ఉంది. సినిమాలో సునీత పాత్ర చేశాను. అంతే కాకుండా మా అమ్మ శైలజ ఈ చిత్రంలో స్కూల్ ప్రిన్సిపాల్ పాత్ర చేసింది. ‘సునీత పాత్రలో నీ హావభావాలు చాలా బాగున్నాయి’ అంటుంటే ఆనందంగా ఉంది. డైరెక్టర్ మహా అంకుల్‌కి స్పెషల్ థ్యాంక్స్. సినిమాలు, సీరియల్స్‌లో అవకాశాలు వస్తున్నాయి. – నిత్యశ్రీ గోరు -
స్టేజ్ షో టు సినిమా
చిలకలగూడ: స్టేజ్ షోలతో ప్రస్థానం ప్రారంభించి.. షార్ట్ఫిల్మ్లలో కనిపించి.. వెండితెరపై మెరిపిస్తున్నాడు కార్తీక్‌రత్నం. రేపు విడుదల కానున్న ‘కేరాఫ్ కంచరపాలెం’ మూవీలో లీడ్ రోల్ చేసిన కార్తీక్‌ది సికింద్రాబాద్ చిలకలగూడలోని మైలార్‌గడ్డ. బాలనటుడిగా నంది అవార్డు అందుకున్న కార్తీక్.. ఇప్పటికే పలు సినిమాల్లో నటించినప్పటికీ పూర్తిస్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’లో చేశాడు. ప్రస్తుతం సీఏ చదువుతున్న ఆయన బుధవారం నామాలగుండు కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తల్లి నళినితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. మూడ్ క్యారీ కష్టమే... ‘తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడిన జోసెఫ్ పాత్రలో నేను నటించాను. ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం, కంచరపాలెంలోనే జరిగింది. డబ్బింగ్ లేకుండా నేచురల్‌గా మాట్లాడిన మాటలనే రికార్డు చేశారు. 2010లో ‘బొరుసు లేని బొమ్మ’ నాటికలో నటించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నాను. అప్పటి నుంచి తనికెళ్ల భరణి, రాళ్లపల్లి లాంటి మహామహుల సాన్నిహిత్యంతో నటనలో పరిపూర్ణత సాధించాను. రాళ్లపల్లి రచించిన ‘ముగింపు లేని కథ’, కోటశంకర్ దర్శకత్వంలో ‘రసరాజ్యం’ తదితర నాటకల్లో నటించి మన్ననలు పొందాను. షార్ట్‌ఫిల్మ్‌లో చూసి దర్శకుడు మహావెంకట్ కంచరపాలెంలో అవకాశమిచ్చారు. స్టేజ్ షో, సినిమా రెండు వేర్వేరు. స్టేజ్ షోలో కేవలం రెండు మూడు గంటలు మూడ్ క్యారీ చేస్తే సరిపోతుంది. అదే సినిమాలో అయితే షాట్ షాట్‌కు క్యారీ చేయాలి. మళ్లీ షాట్ గ్యాప్‌లో మూడ్ చెదిరిపోతుంటుంది. తిరిగి అదే మూడ్‌లోకి వచ్చి నటించడం కొంత కష్టమే. మా అమ్మానాన్న నళిని, పృథ్వీరాజ్ నన్నెంతో ప్రోత్సహించార’ని చెప్పారు కార్తీక్. -
‘C/o కంచరపాలెం’ మూవీ రివ్యూ
టైటిల్ : C/o కంచరపాలెం జానర్ : డ్రామా తారాగణం : సుబ్బారావు, రాధ బెస్సీ, కేశవ కర్రీ, నిత్య శ్రీ, కార్తీక్ రత్నం, విజయ ప్రవీణ, మోహన్ భగత్, ప్రణీత పట్నాయక్ సంగీతం : స్వీకర్ అగస్తీ దర్శకత్వం : వెంకటేష్ మహా నిర్మాత : విజయ ప్రవీణ పరుచూరి సమర్పణ : రానా దగ్గుబాటి కొంత కాలంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. రొటీన్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి రియలిస్టిక్‌గా తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అనవసరమైన బిల్డప్‌లు, హీరోయిజం, యాక్షన్ లాంటివి లేకుండా సమాజంలో కనిపించే వ్యక్తిత్వాలనే కథగా తెరకెక్కించే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో రియలిస్టిక్ మూవీ ‘C/o కంచరపాలెం’. వెంకటేష్ మహా దర్శకుడిగా విజయ ప్రవీణా పరుచూరి నిర్మాతగా తెరకెక్కించిన సినిమా C/o కంచెరపాలెం. కంచెరపాలెం అనే గ్రామంలో అక్కడి ప్రజలతోనే తెరకెక్కించిన ఈ సినిమాను యంగ్ హీరో రానా దగ్గుబాటి తన సమర్పణలో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో C/o కంచరపాలెం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? కథ : ఇది వయసు పరంగా నాలుగు కేటగిరిలో ఉన్న నాలుగు జంటల ప్రేమకథ. సుందరం (కేశవ కర్రి) స్కూల్ పిల్లాడు. తన క్లాస్‌మెట్ సునీత (నిత్య శ్రీ) అంటే సుందరానికి చాలా ఇష్టం. స్నేహితుడి సాయంతో ఎలాగైన సునీతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. జోసెఫ్ (కార్తీక్ రత్నం) టీనేజ్ కుర్రాడు. ఓ జిమ్‌లో పనిచేస్తూ గొడవలు, సెటిల్మెంట్స్ చేసే జోసెఫ్ ఓ గొడవ వల్ల పరిచయం అయిన భువనేశ్వరి (ప్రణీతా పట్నాయక్) అనే బ్రాహ్మణుల అమ్మాయిని ప్రేమిస్తాడు. గడ్డం (మోహన్ భగత్) వైన్ షాపులో పనిచేసే కుర్రాడు. తమ షాప్‌లో రోజు మందుకొనే ఓ వేశ్య సలీమా( విజయ ప్రవీణా పరుచూరి)ను కళ్లు చూసి ప్రేమిస్తాడు. రాజు (సుబ్బారావు) ఓ గవర్నమెంట్ ఆఫీసులో అటెండర్. 49 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాకపోవటంతో ఊళ్లో అంతా రాజు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. అదే సమయంలో ఒరిస్సా నుంచి ట్రాన్సఫర్ మీద తమ ఆఫీసుకు వచ్చిన ఆఫీసర్ రాధ( రాధ బెస్సీ) తో ప్రేమలో పడతాడు. భర్త చనిపోయి చాలాకాలంగా ఒంటరిగా ఉంటున్న రాధ, రాజును పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇలా కంచరపాలెంలో మొదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాలలో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి.? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి..? చివరకు వారి కథలు ఎలా ముగిసాయి..? అన్నదే కేరాఫ్ కంచరపాలెం కథ. విశ్లేషణ : ఓ గ్రామంలోని వ్యక్తులు వారి జీవితాలే కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు వెంకటేష్ మహా.. ఎక్కడా సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు. సినిమాను పూర్తిగా సహజంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎలా మాట్లాడతాయో అలాగే తెర మీద ఆవిష్కరించాడు. అదే సమయంలో సమాజంలో ఉన్న అంతరాలు, కులమత భేదాలు వాటి పర్యవసానాలను మనసును తాకేలా చూపించాడు. కమర్షియల్ లెక్కల కోసం హాస్య సన్నివేశాలను ఇరికించకుండా.. లీడ్ క్యారెక్టర్స్ ప్రవర్తన నుంచే కామెడీ పండించి ఆకట్టుకున్నాడు. అందుకే సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కంచరపాలెంలో అక్కడి ప్రజలతో కాసేపు గడిపిన భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు నెమ్మదిగా కథ నడిపించాడు. నాలుగు కథలను ప్యారలల్‌గా నడిపించిన దర్శకుడు క్లైమాక్స్ ట్విస్ట్‌తో ఆడియన్స్‌కు షాక్ ఇచ్చాడు. నిర్మాణ పరంగాను సినిమాకు మంచి మార్కులు పడతాయి. తమకున్న లిమిటేషన్స్ మధ్య అద్భుతమైన అవుట్ పుట్ ఇవ్వటంలో నిర్మాత కృషి ప్రతీఫ్రేమ్‌లో కనిపిస్తుంది. లైవ్ రికార్డింగ్ అయినా ఎక్కడ ఆడియో డిస్ట్రబెన్స్ లేకుండా క్వాలిటీ సౌండ్‌ను అందించారు. సినిమాకు మరో ఎసెట్ వరుణ్, ఆదిత్యల సినిమాటోగ్రఫి. కంచరపాలెం వాతావరణాన్ని వ్యక్తిత్వాలను అందంగా ఫ్రేముల్లో బందించారు. స్వీకర్ అగస్థి సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమా అంతా ఆఫ్‌బీట్ తరహాలో సాగటంతో కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే దాదాపు 52 మంది కొత్త తారలు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. మేకప్, కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ లాంటివి లేకుండా తెర మీద సహజంగా కనిపించారు. అయితే అంతా కొత్త వారు కావటంతో అక్కడక్కడ వారి నటనలో కాస్త నాటకీయత కనిపించినా.. ఒకసారి కథలో లీనమైతే అవేవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. రొటీన్ కమర్షియల్ మూసకు భిన్నంగా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ‘C/o కంచరపాలెం’ సినిమాకు ఇప్పటికే సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్