హీరో లేడు.. విలన్‌ లేడు.. | Care Of kancharapalem Movie Artists Chit Chat With Sakshi | Sakshi
Sakshi News home page

హీరో లేడు.. విలన్‌ లేడు..

Published Mon, Sep 10 2018 7:46 AM | Last Updated on Mon, Sep 10 2018 7:46 AM

Care Of kancharapalem Movie Artists Chit Chat With Sakshi

హీరో లేడు.. విలన్‌ లేడు.. ఫైట్స్‌ లేవు.. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అస్సలే లేవు. కానీ కథే బలం.. పాత్రలే హీరోలు. ఇప్పుడు పరిశ్రమలో మొత్తం ఈ చిత్రం గురించే చర్చ. మోడ్రన్‌ క్లాసిక్‌ అంటూ కితాబిస్తున్నారు కూడా. తెలుగు నేటివిటీతో సినిమాలు అరుదుగా వస్తున్న నేపథ్యంలో స్వచ్ఛమైన కథతో, సహజమైన అనుభూతితో, మనచుట్టూ తిరిగే పాత్రలతో తెరకెక్కిన చిత్రం కేరాఫ్‌ కంచరపాలెం. మహా వెంకటేష్‌ దర్శకత్వంలో హీరో రానా సమర్పణలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. ఎందరో సినీ ప్రముఖుల ప్రశంసలు పొందింది. ఇందులో నటించిన వారిలో ఒకరిద్దరు తప్ప అందరూ కొత్తవాళ్లే.. అందులోనూ వైజాగ్‌ ప్రాంతానికి చెందినవారే. స్థానికులనే ఎంపిక చేసిన దర్శకుడు వారితో అద్భుతంగా నటింపజేశారు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలైన ఎనిమిది మంది ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ...  

కమల్‌హాసన్‌ అంటే ఇష్టం...
నాది వైజాగ్‌లోని రామ్మూర్తి పంచలపేట. ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాను. కేరాఫ్‌ కంచరపాలెంలో అనుకోకుండా అవకాశం వచ్చింది. చిత్రంలో రామ్మూర్తి పాత్ర చేసిన కిషోర్‌ మా వీధిలోనే ఉండేవాడు. కిషోర్‌ దర్శకుడు మహా వెంకటేష్‌కి స్నేహితుడు. ఆయన ద్వారా సినిమాలో పాత్రకి నన్ను రికమండ్‌ చేశారు. చిత్రంలో 49 ఏళ్లైనా పెళ్లికాని రాజు క్యారెక్టర్‌ నాది. నాకు ముగ్గురు మగ పిల్లలు. చిన్న చిన్న నాటకాలు కూడా వేశాను. కమల్‌హాసన్‌ అంటే ఇష్టం. చిత్రంలో నా పాత్రను చాలామంది అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడికే దక్కుతుంది. నా స్వభావానికి, బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.– సుబ్బారావు  

హ్యాపీగా ఉంది...
మా పూర్వీకులది అసోం. కానీ వైజాగ్‌లో స్థిరపడ్డాం. అంతకుముందు ప్రైవేట్‌ ఉద్యోగం చేసేదాన్ని. ప్రస్తుతానికి హాస్పిటల్‌లో ఆయాగా చేస్తున్నాను. ఈ చిత్రంలో అనుకోకుండా అవకాశం దక్కింది. సలీమ పాత్ర ఎంపిక కోసం దర్శకుడు మా ఇంటికి వచ్చారు. నన్ను చూసిన ఆయన రాధా పాత్రకు మీరు సరిపోతారని, నటిస్తారా? అని అడిగారు. నేను ఆడిషన్‌ ఇస్తానని చెప్పాను. నిర్మాత పరుచూరి విజయ ప్రవీణకు నా నటన నచ్చడంతో ఓకే చేశారు. నా జీవితంలో కూడా సినిమా కష్టాలున్నాయి. చిత్రంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, రామ్మూర్తి భార్యగా నా కుమార్తె రూప నటించింది. మీరు చాలా సహజంగా నటించారంటూ కితాబిస్తుంటే చాలా సంతోషంగా ఉంది.      – రాధా బెస్సీ

కదిలించింది...  
మాది తాడేపల్లిగూడెం దగ్గర పత్తిపాడు శివారు కాగులంపాడు గ్రామం. నేను తెలుగు యూనివర్సిటీలో ఎంఏ థియేటర్‌ ఆర్టిస్ట్‌ చేశాను. అనంతరం నటనలో హెస్‌సీయూలో పీజీ చేశాను. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా నాటకాలు వేశాను. వివిధ చిత్రాలు, సీరియల్స్, వెబ్‌సీరిస్‌లలో నటించాను. అపర్ణ మల్లాడి ద్వారా మహా వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. సినిమాలో నా పాత్రకు ‘గెడ్డం’ అని పేరు. వైన్‌షాప్‌లో పనిచేస్తూ ఓ అమ్మాయి కళ్లను మాత్రమే చూసి ప్రేమిస్తాను. ఆ అమ్మాయి వేశ్య. ఈ క్యారెక్టర్‌ నన్నెంతో కదిలించింది. చిత్రంలో మంచి పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది. ఇదంతా దర్శకుడు మహాకే దక్కుతుంది. ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రియలిస్టిక్‌ క్యారెక్టర్స్‌ చేయాలని ఉంది.       –  మోహన్‌భగత్‌  

ఇదే నిదర్శనం..  
నేను తెలుగమ్మాయి అయినా అమెరికాలో పుట్టి పెరిగిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ని. కార్డియాలజీలో ఎండీ చేశాను. సినిమాలంటే ఆసక్తి ఉండేది. దర్శకుడు మహా వెంకటేష్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, అది కూడా క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా చేస్తున్నారని సోషల్‌ మీడియా ద్వారా తెలిసింది. కథ నచ్చడంతో నిర్మాణానికి మందుకొచ్చాను. సినిమా చేస్తున్న సమయంలో సలీమ పాత్రకు ఎవరూ సరిపోకపోవడంతో దర్శకుడు మహా మీరు ఆడిషన్‌ ఇవ్వండని అడిగారు. అలా చిత్రంలో సలీమ అనే వేశ్య పాత్ర చేశాను. తనను అమితంగా ప్రేమించిన గెడ్డంతో బతకాలనుకున్న సలీమ చాలా రియలిస్టిక్‌గా అందరి హృదయాలను ఆకట్టుకుంది. చిత్రం తీశాక హీరో రానాకి చూపించాం. ఆయనకు నచ్చడంతో రానా సమర్పణలో విడుదల చేశాం. సినీ ప్రముఖులు, విమర్శకులు చిత్రాన్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఓ మంచి సినిమాకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు నిండుగా ఉంటాయనడానికి కేరాఫ్‌ కంచరపాలెం నిదర్శనం.  – పరుచూరి విజయ ప్రవీణ (నిర్మాత, చిత్రంలో సలీమ)

అసిస్టెంట్‌గా చేశాను...   
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌ సీతాఫల్‌మండి. సీఏ చదువుతున్నాను. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పాతిక నాటకాలు వేశాను. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నాను. అపర్ణ మల్లాడి, బాబీరావు కనపర్తి నా గురించి  దర్శకుడు మహా వెంకటేష్‌కి చెప్పారు. అలా ఆయన జోసఫ్‌ పాత్రకు ఎంపిక చేశారు. పలు చిత్రాల్లో నటించినప్పటికీ కేరాఫ్‌ కంచరపాలెంలో ముఖ్యపాత్ర చేసినందుకు సంతోషంగా ఉంది. క్రిస్టియన్‌ అబ్బాయిగా ఓ బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమించిన పాత్ర నాది. సినిమా చూసి అభినందిస్తుంటే సంతోషంగా ఉంది. అన్నట్టు చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా చేశాను. ఢిపరెంట్‌ రోల్స్‌ చేయాలని ఉంది.     – కార్తీక్‌ రత్నం  

రియల్‌ లైఫ్‌లోనూ...  
మాది వైజాగ్‌లోని సీతమ్మధార. గీతం వర్సిటీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాను. నేను క్లాసికల్‌ డ్యాన్సర్, మోడల్‌ని. మిస్‌ వైజాగ్‌ ఫైనల్స్‌లో కంటెస్ట్‌ చేశాను. మిస్‌ బ్యూటిఫుల్‌ ఐస్‌గా అవార్డు అందుకున్నాను. మా గురువు పీవీ భరణి శంకర్‌ ద్వారా దర్శకుడు మహా వెంకటేష్‌గారు పరిచయమయ్యారు. చిత్రంలో బ్రాహ్మణ అమ్మాయిగా ఓ క్రిస్టియన్‌ అబ్బాయిని ప్రేమించిన భార్గవి పాత్రలో నటించాను. ధైర్యంతో పాటు ముక్కుసూటి అమ్మాయి క్యారెక్టర్‌. నిజంగా రియల్‌ లైఫ్‌లో కూడా అలానే ఉంటాను. కెమెరా ముందు నటించడానికి కొద్దిగా భయం వేసినా చిత్రంలోని పాత్ర నా స్వభావానికి దగ్గరగా ఉండటంతో ధైర్యంగా చేశాను. మంచి పాత్రలు చేయడానికి సిద్దంగా ఉన్నాను.     – ప్రణీత పట్నాయక్‌

క్రెడిట్‌ ‘మహా’దే...  
మాది కంచరపాలెం దగ్గర గిరిజాల. పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఓ రోజు కంచరపాలెం గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడుతున్న నన్ను చూసిన దర్శకుడు మహా అన్న... నన్ను నటించమని అడిగారు. అప్పటకి నేను పదోతరగతి చివర్లో ఉన్నాను. ఎగ్జామ్స్‌ ఉన్నాయని చెప్పాను. ఏమీ కాదు... నటించు అని ప్రోత్సహించారు. అలా సుందరం పాత్ర చేశాను. స్కూల్‌లో తోటి విద్యార్థిని సునీతను అమితంగా ఇష్టపడిన పాత్రలో నటించాను. చాలా సంతోషంగా ఉంది. వైజాగ్‌లో చాలా మంది చూసి ‘తమ్ముడూ.. బాగా చేశావు’ అంటుంటే ఆనందంగా ఉంది. ఈ క్రెడిట్‌ అంతా మహా అన్నదే. నా క్యారెక్టర్‌కు సూటయ్యే పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.– కేశవ కర్రి  

అవకాశాలు వస్తున్నాయి..  
మాది వైజాగ్‌. ఎనిమిదో తరగతి చదువుతున్నాను. షార్ట్‌ఫిల్మŠస్‌లో నటించాను. చిత్రంలో రామ్మూర్తి నత్తి పాత్ర చేసిన కిషోర్‌ అంకుల్‌ ద్వారా మహా వెంకటేష్‌ అంకుల్‌ నన్ను కలిశారు. కిషోర్, కుసుమ, కిషన్‌ అంకుల్‌ మా ఫ్యామిలీ ప్రెండ్స్‌. డ్యాన్సింగ్, సింగింగ్‌లో అనుభవం ఉంది. సినిమాలో సునీత పాత్ర చేశాను. అంతే కాకుండా మా అమ్మ శైలజ ఈ చిత్రంలో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పాత్ర చేసింది. ‘సునీత పాత్రలో నీ హావభావాలు చాలా బాగున్నాయి’ అంటుంటే ఆనందంగా ఉంది. డైరెక్టర్‌ మహా అంకుల్‌కి స్పెషల్‌ థ్యాంక్స్‌. సినిమాలు, సీరియల్స్‌లో అవకాశాలు వస్తున్నాయి. – నిత్యశ్రీ గోరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement