కార్తీక్‌రత్నం
చిలకలగూడ: స్టేజ్ షోలతో ప్రస్థానం ప్రారంభించి.. షార్ట్‌ఫిల్మ్‌లలో కనిపించి.. వెండితెరపై మెరిపిస్తున్నాడు కార్తీక్‌రత్నం. రేపు విడుదల కానున్న ‘కేరాఫ్ కంచరపాలెం’ మూవీలో లీడ్ రోల్ చేసిన కార్తీక్‌ది సికింద్రాబాద్ చిలకలగూడలోని మైలార్‌గడ్డ. బాలనటుడిగా నంది అవార్డు అందుకున్న కార్తీక్.. ఇప్పటికే పలు సినిమాల్లో నటించినప్పటికీ పూర్తిస్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’లో చేశాడు. ప్రస్తుతం సీఏ చదువుతున్న ఆయన బుధవారం నామాలగుండు కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తల్లి నళినితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు.
మూడ్ క్యారీ కష్టమే...
‘తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడిన జోసెఫ్ పాత్రలో నేను నటించాను. ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం, కంచరపాలెంలోనే జరిగింది. డబ్బింగ్ లేకుండా నేచురల్‌గా మాట్లాడిన మాటలనే రికార్డు చేశారు. 2010లో ‘బొరుసు లేని బొమ్మ’ నాటికలో నటించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నాను. అప్పటి నుంచి తనికెళ్ల భరణి, రాళ్లపల్లి లాంటి మహామహుల సాన్నిహిత్యంతో నటనలో పరిపూర్ణత సాధించాను. రాళ్లపల్లి రచించిన ‘ముగింపు లేని కథ’, కోటశంకర్ దర్శకత్వంలో ‘రసరాజ్యం’ తదితర నాటకల్లో నటించి మన్ననలు పొందాను. షార్ట్‌ఫిల్మ్‌లో చూసి దర్శకుడు మహావెంకట్ కంచరపాలెంలో అవకాశమిచ్చారు. స్టేజ్ షో, సినిమా రెండు వేర్వేరు. స్టేజ్ షోలో కేవలం రెండు మూడు గంటలు మూడ్ క్యారీ చేస్తే సరిపోతుంది. అదే సినిమాలో అయితే షాట్ షాట్‌కు క్యారీ చేయాలి. మళ్లీ షాట్ గ్యాప్‌లో మూడ్ చెదిరిపోతుంటుంది. తిరిగి అదే మూడ్‌లోకి వచ్చి నటించడం కొంత కష్టమే. మా అమ్మానాన్న నళిని, పృథ్వీరాజ్ నన్నెంతో ప్రోత్సహించార’ని చెప్పారు కార్తీక్.
Comments
Please login to add a commentAdd a comment