షారుక్, గౌరీ ఖాన్లపై కోర్టులో కేసు దాఖలు
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇటీవల అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందిన విషయం తెలుసు కదూ. అయితే, ఆ బిడ్డ ఆడా.. మగా అన్న విషయాన్ని తెలుసుకోడానికి ముందుగానే లింగనిర్ధారణ పరీక్షలు చేయించారంటూ షారుక్ఖాన్, ఆయన భార్య గౌరి, ఇతరులపై కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. వర్షా దేశ్పాండే అనే మహిళా న్యాయవాది ఈ కేసు దాఖలు చేశారు.
ఇటీవలే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో షారుక్ దంపతులు అద్దె గర్భం ద్వారా మూడో సంతానాన్ని పొందారు. కానీ వీళ్లు ముందుగానే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారంటూ దేశ్పాండే ఫిర్యాదు చేశారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో తాను ముందు బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. దీంతో కార్పొరేషన్ అధికారులు జూన్ 17న వాస్తవాలు తెలుసుకోడానికి షారుక్ ఇంటికి వెళ్లినా, ఆయన అవన్నీ పసలేని ఆరోపణలేనని ఖండించారని చెప్పారు.
కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారని అన్నారు. ఈ కేసును సెప్టెంబర్ 12న విచారణకు స్వీకరిస్తూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఉదయ్ పడ్వాడ్ ఆదేశాలు జారీ చేశారు. షారుక్ దంపతులతో పాటు కార్పొరేషన్ ఆరోగ్యశాఖాధికారులకు కూడా నోటీసులు జారీ చేశారు.