
సాక్షి, ముంబై: ఒకవైపు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ దేశమంతటా ‘కబీర్ సింగ్’ వేవ్ నడుస్తోందంటుంటే మరోవైపు ఇదేం సినిమారా బాబు అంటూ విమర్శకులు మొహం చాటేస్తున్నారు. సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ మధ్యే విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కలెక్షన్ల మాట ఎలా ఉన్నా సోషల్ మీడియాలో ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షాహిద్ నటనకు ప్రశంసలు కురుస్తున్నా.. ఈ సినిమా సమాజంపై చెడు ప్రభావం చూపుతుందని కొందరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) సభ్యురాలు వాణి త్రిపాఠి ‘కబీర్ సింగ్’ చిత్రంపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సినిమాని కడిగిపారేశారు. అర్జున్ రెడ్డి చిత్రమే దరిద్రంగా ఉందంటే దాన్ని ఇంకా హిందీలోకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ చిత్రంలో స్త్రీల పట్ల ద్వేషాన్ని చూపించారని, కబీర్‌సింగ్ హింసాత్మక చిత్రమంటూ ఆమె ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. సంప్రదాయాల దగ్గర మొదలైన భారతీయ సినిమా ప్రయాణం ప్రస్తుతం అందాల ఆరబోతకే ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు.
బడా స్టార్లు ఇలాంటి డార్క్‌షేడ్ ఉన్న నెగటివ్ పాత్రలను అంగీకరించరించడాన్ని ఆమె తప్పుపట్టారు. నటులు వారికి నచ్చిన పాత్ర తీసుకుంటే తప్పేంటని ఓ నెటిజన్ ప్రశ్నించగా..అది తప్పూ, ఒప్పూ అని కాదని, తెరపై కనిపించే పాత్రే నటుడి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుందని ఆమె బదులిచ్చారు. ఆ పాత్రలో నటుడు జీవించకపోతే ఆ పాత్ర కేవలంం కాగితానికే పరిమితమవుతుందని తెలిపారు. సందీప్ వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా అర్జున్ రెడ్డికి రీమేక్ కాగా ఒక గొప్ప సర్జన్ తను ప్రేమించిన అమ్మాయి దక్కకపోవటం వల్ల ఎంత పతనమయ్యాడన్నదే ఈ చిత్ర కథాంశం. శుక్రవారం విడుదలైన ‘కబీర్ సింగ్’ సోమవారం నాటికి రూ.87కోట్ల వసూళ్లు రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment