చెన్నైలో పండగ...
చెన్నైని చూస్తే రామ్ మనసు పులకించి పోతుందట. ఎందుకంటే రామ్ పుట్టిందీ, పెరిగిందీ అక్కడే. అందుకే అవకాశం దొరికితే చెన్నైలో వాలిపోతారు రామ్. ఇప్పుడు రామ్ అక్కడే ఉన్నారు. ఇవాళ రామ్ పుట్టిన రోజు. ఈ వేడుకను చెన్నైలోనే జరుపుకోనున్నారు. ‘పండగ చేస్కో’ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం అక్కడ సంగీత చర్చలు జరుగుతున్నాయి. చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్‌తో కలిసి రామ్ కూడా సరదాగా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ‘మసాలా’ విడుదలైన ఆరు నెలల విరామం తర్వాత రామ్ చేస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. ఈ నెల 17న చిత్రీకరణ మొదలు కానుంది. ‘సింహా’ తీసిన పరుచూరి ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమాతో పాటు రామ్ మరో రెండు కథలకు ఓకే చెప్పారు.
ఇకపై విరామం లేకుండా వరుసగా సినిమాలు చేసే యోచనలో ఉన్నారాయన. ఎనిమిదేళ్ల కెరీర్‌లో రామ్ పది సినిమాలు చేశారు. హైవోల్టేజ్ యాక్షన్ పాత్రలతో వినోదాన్ని కూడా బాగా పండిస్తారన్న ఇమేజ్ రామ్‌కి ఉంది. చాలా తక్కువ సమయంలోనే చిచ్చర పిడుగులా యూత్‌లోకి చొచ్చుకుపోయారు. యువతరంలోనూ, మాస్‌లోనూ తనకున్న ఇమేజ్‌ని నిలబెట్టుకుంటూనే కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దిశగా రామ్ ప్రయత్నాలు సాగుతున్నాయి. ‘పండగ చేస్కో’ ఆ నేపథ్యంలోనే ఉంటుందని సమాచారం. ఈ సినిమాపై రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా పండగ చేసుకునే స్థాయిలో ఉంటుందని రామ్ నమ్మకం.