'ఆయన మరణం చాలా బాధ కలిగించింది'
చెన్నై : నటుడు కళాభవన్ మణి మృతి కోలీవుడ్‌లోనూ విషాద ఛాయలను నింపింది. మలయాళం నుంచి వచ్చిన కళాభవన్ మణి బహుభాషా నటుడు. మాతృభాషలో కథానాయకుడిగా పలు చిత్రాలు చేసిన ఆయన తమిళం, తెలుగు తదితర భాషల్లో ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు పోషించారు. తమిళంలో కమలహాసన్, విక్రమ్, సూర్య వంటి ప్రముఖ కథానాయకులతో నటించి ప్రాచుర్యం పొందారు.
ఆయా చిత్రాల ద్వారా తమిళ ప్రేక్షకుల గుండెల్లోనూ సుస్థిర స్థానాన్ని పొందిన కళాభవన్ మణి మరణం తమిళ చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కోలీవుడ్‌లో కళాభవన్ మణి నట పయనం 1998లో మరుమలర్చి చిత్రం నుంచి ఇటీవల కమలహాసన్ నటించిన పాపనాశం వరకూ నిరాటంకంగా సాగింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా కమలహాసన్ సంతాపం వ్యక్తం చేస్తూ మిత్రుడు కళాభవన్ మణి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన మరణం చాలా బాధ కలిగిందన్నారు. కళాభవన్ మణి బాణీను ఆయన వల్ల స్ఫూర్తి పొందిన నటులు చిత్ర పరిశ్రమలో ఉన్నారని గుర్తు చేశారు. నటుడు సూర్య తన సంతాపం తెలియజేస్తూ కళాభవన్ మణి చాలా మంచి నటుడన్నారు. ఆయనతో స్నేహం నా గుండెల్లో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయనీ, కళాభవన్ మణి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని సూర్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.