పెద్దా చిన్నా తేడా లేకుండా అందర్ని ఒకే వయసు వారిగా చేసేస్తుంది పండగ. పేరున్నోళ్లా, సామాన్యులా అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరినీ మమేకం చేస్తుంది. అంబరాన్ని తాకే సంబరాలను మోసుకొచ్చే దివాళీ వేళ.. ఆకాశంలో తారలైనా అల్లరి పిల్లలైపోరూ... నింగిలోని జాబిలైనా నేలమీదికొచ్చి జాతర చేసేయదూ. మనతో ప్రముఖులు పంచుకున్న దీపావళి ముచ్చట్లు... పండగను ఆనందించమంటున్నాయి. అలాగే పర్యావరణ‘హితవూ’ చెబుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో
స్పెషల్.. ఫెస్టివల్
దీపావళి పండగ నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి క్రాకర్స్ కాలుస్తూ సెలబ్రేట్ చేసుకునేదాన్ని. అయితే ఇప్పుడు అంత బాగా కాల్చాలనిపించడం లేదు. గల్లీగల్లీకి అపార్ట్‌మెంట్స్ వచ్చేశాయి. ఓపెన్ స్పేస్ తగ్గిపోయింది. ఇక గ్రీన్ దీవాళీ, పొల్యూషన్ ఫ్రీ ప్రచారం బాగా పెరిగింది. దీంతో క్రాకర్స్ కాల్చడం తగ్గించేశాను. తక్కువ టపాసులు, చాలా దీపాలు పెట్టడం, మిత్రులు, బంధువులతో టైమ్‌పాస్ చేయడం.. ఇదే ఇప్పుడు దీపావళి. నిజానికి ఇది నాకు స్పెషల్ ఫెస్టివల్. బిగ్ బాస్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరవడం, ఇటీవల నేను రూపొందించిన ‘ఐయామ్ ఇన్ దిస్‌వే’ షార్ట్‌ఫిల్మ్ బాగా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీ. అందరూ సేఫ్ దివాళీ జరుపుకోండి. – అర్చన, సినీనటి
ఫ్యామిలీతో ప్రత్యేకం
క్రాకర్స్ కాల్చడంతో కాలుష్యం పెరిగి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. అందుకే నేను క్రాకర్స్‌ను కాల్చడం ఎప్పుడో మానేశాను. ప్రతి దీపావళి మా ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం. అందరం ఒకేచోట చేరి పూజలో పాల్గొని, పండగను ఆస్వాదిస్తాం. క్రాకర్స్ కాల్చొద్దు.. వాటికి పెట్టే డబ్బులతో పేదవారికి చేయూతనివ్వండి. – తమన్నా, సినీనటి
బెంగళూర్‌లో ఫ్రెండ్స్‌తో..
నేను బెంగళూర్‌లో ఉన్నాను. ఇక్కడే ఫ్రెండ్స్‌తో దీపావళి జరుపుకుంటాను. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అయితే అమ్మతో కలిసి పూజలో పాల్గొనేదాన్ని. క్రికెట్ ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలిచి, లిమిట్‌గా క్రాకర్స్ కాల్చి ఎంజాయ్ చేసేవాళ్లం. క్రాకర్స్‌తో తీవ్ర కాలుష్యం ఏర్పడి పర్యావరణం దెబ్బతింటోంది. అందుకే అందరూ చాలా తక్కువగా టపాసులు కాల్చండి.
– మిథాలీరాజ్, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్
కొవ్వొత్తి కాంతుల్లో..
ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తుండడంతో ఫ్యామిలీతో సరిగ్గా టైమ్ స్పెండ్ చేయడమే కుదరట్లేదు. ఈ ఏడాది ఇంట్లో తక్కువ రోజులు ఉన్నాను. అందుకే ఈ పండగకు ఇంటికి వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నాను. అందులోనూ ‘రాజుగారి గది–2’ సూపర్ సక్సెస్ దివాళీని స్పెషల్‌గా మార్చింది. ఉదయమంతా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాను. రాత్రికి కుటుంబసభ్యులతో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ దివాళీకి వెల్‌కమ్ చెప్తాను. – సీరత్‌కపూర్, సినీనటి
కాకర పువ్వొత్తులు కాలుస్తా..
ఇంట్లో శాస్త్రీయబద్ధంగా పండగ జరుపుతారు. చాలా వెరైటీ స్వీట్స్ తయారు చేస్తాం. చిన్నప్పటి నుంచి బాణసంచా కాల్చడం తక్కువే. అయితే కాకర పువ్వులు మాత్రం బాగా కాలుస్తాను. ఈ దీపావళి కుటంబంతో జరుపుకోవడం కష్టమే... రాహుల్‌తోనే దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాను. – చిన్మయి శ్రీపాద,సింగర్
నాడీ మార్చింది
దివాళీకి ఒకప్పుడు టపాసులు బాగా కాల్చేవాడిని. మా ఇంటికి నాడీ (పెంపుడు శునకం) వచ్చాక.. జరుపుకున్న తొలి దీపావళి రోజున ఆ శబ్దాలు, పొగకు అది ఉక్కిరిబిక్కిరైంది. దీంతో నాలో మార్పు వచ్చింది. మనం టపాసులకు వెచ్చించే డబ్బులతో ఒక కుటుంబం ఏడాదంతా కడుపు నింపుకోగలదు అనిపించింది. అప్పటి నుంచి టపాసులు కాల్చడం మానేశాను. దీపాలతో ఇళ్లంతా డెకరేట్ చేయడం.. స్వీట్స్ తయారీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ దగ్గరికి వెళ్లడం.. ఇదే ఇప్పుడు మా దీపావళి. టపాసులు కాల్చకండి.. ఆ డబ్బును నిరుపేదలకు ఇవ్వండి.. వారి కళ్లల్లో వెలుగులే నిజమైన దీపావళి. – ప్రిన్స్, సినీనటుడు
అనాథ పిల్లలతో ఆనంద దివాళీ
‘రంగుల లోకంలో విహరించడమే కాదు.. హంగులన్నీ పక్కనబెట్టి అనాథలు, పేదలతో వీలైనన్ని రోజులు గడపాలనేదే నా ఆశ’ అని చెప్పింది సినీ నటి పూనమ్‌కౌర్. సికింద్రాబాద్‌లోని ‘సర్వ్ నీడి’ అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి బుధవారం దీపావళి వేడుకలు జరుపుకుంది. టపాసులు తీసుకొచ్చి పిల్లలతో కలిసి కాల్చి, ఆనందంగా గడిపింది. మిస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment