రాజమౌళితో పాటు మాకు సవాలే! | Challenges along with Rajamouli | Sakshi
Sakshi News home page

రాజమౌళితో పాటు మాకు సవాలే!

Published Thu, Apr 20 2017 11:50 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

రాజమౌళితో పాటు మాకు సవాలే! - Sakshi

రాజమౌళితో పాటు మాకు సవాలే!

‘‘సన్నివేశాల్లోని భావోద్వేగాలను (ఎమోషన్స్‌) తెరపై ఆవిష్కరించడంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ (గ్రాఫిక్స్‌) సహాయపడతాయి. అంతే తప్ప... గ్రాఫిక్స్‌ ఎప్పుడూ భావోద్వేగాలను డామినేట్‌ చేయలేవు. సినిమాకు గ్రాఫిక్స్‌ మద్దతుగా నిలుస్తాయంతే’’ అన్నారు కమల్‌ కణ్ణన్‌. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ‘బాహుబలి–2’కి విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌గా పని చేశారీయన. వచ్చే శుక్రవారం విడుదలవుతోన్న ఈ సినిమా గురించి కమల్‌ కణ్ణన్‌ చెప్పిన సంగతులు...

‘సై’ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ చేయమని రాజమౌళి నుంచి తొలిసారి కబురొచ్చింది. అందులో గ్రాఫిక్స్‌ వర్క్‌ తక్కువే. తర్వాత ‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలకు ఆయనతో పనిచేశా. ‘యమదొంగ’కు నాకు నంది అవార్డు వచ్చింది.

ఏదైనా సీన్‌లో రాజమౌళి చెప్పినట్టు గ్రాఫిక్స్‌ చేయడం కుదరదంటే ఒప్పుకోరు. గూగుల్‌లో వెతుకుతారు. నేరుగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆర్టిస్టుతో మాట్లాడతారు. వర్క్‌ పరంగా రాజమౌళిని శాటిస్‌ఫై చేయడం చాలా కష్టం. ప్రతి అంశంపై ఆయనకు పట్టుంది.
     
అక్టోబర్‌ 16, 2015న నేను ‘బాహుబలి–2’ టీమ్‌లో చేరాను. అప్పటికే వర్క్‌ ప్రారంభమైంది. 2,555 షాట్స్‌లో గ్రాఫిక్స్‌ అవసరమని గుర్తించాను. లాస్‌ ఏంజెల్స్‌లోని జాన్‌ గ్రిఫిక్స్‌ అనే వ్యక్తి వార్‌ సీన్స్‌ కంప్లీట్‌ చేసేశాడు. ఈ 18 నెలల్లో 2200 షాట్స్‌లో గ్రాఫిక్స్‌ పూర్తి చేయడమంటే జోక్‌ కాదు. మన దేశంలోనూ, విదేశాల్లోనూ సుమారు 50 స్టూడియోలు ‘బాహుబలి–2’కి పని చేశాయి.
     
‘బాహుబలి’తో పోలిస్తే రెండో భాగంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువ. ఇందులో మాహిష్మతి రాజ్యాన్ని పూర్తిగా చూడొచ్చు. దేవసేనకు చెందిన కుంతల రాజ్యం కూడా ఈ పార్టులోనే ఉంటుంది. మాహిష్మతి, కుంతల రాజ్యాల మధ్య తేడాను చూపించడం దర్శకుడితో పాటు మాకు సవాల్‌గా నిలిచింది. సినిమాలో గ్రాఫిక్స్‌ ఎంత గొప్పగా ఉంటాయో... ఎమోషనల్, డ్రామా కూడా అంతే గొప్పగా ఉంటాయి.
     
ఏప్రిల్‌ 28న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించడంతో... గ్రాఫిక్స్‌ వర్క్‌ త్వరగా పూర్తి కావాలని నవంబర్‌ నుంచి తొందర పెట్టారు. ఫిబ్రవరిలో మా వర్క్‌ పూర్తి చేసి, తర్వాత కరెక్షన్స్‌ చూడడం ప్రారంభించాం. ఇంకా ఐదు కరెక్షన్స్‌ చేయాలి.
     
‘బాహుబలి–1’ విడుదలకు ముందు రెండో భాగంలో సుమారు 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. అందులో 10 నిమిషాలు లీకయిందని విన్నాను. అందువల్ల, మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
     
ఈ సినిమా గ్రాఫిక్‌ వర్క్‌కి ఎంత ఖర్చయిందనేది నాకు తెలీదు. దర్శకుడి ఊహలకు అనుగుణంగా వర్క్‌ జరుగుతుందా? లేదా? అనేది పర్యవేక్షించడం మాత్రమే నా బాధ్యత. బిల్లింగ్‌ అంతా ప్రొడక్షన్‌ టీమ్‌ చూసుకుంటుంది. ఒకవేళ ఏదైనా స్టూడియోలో ఖర్చు ఎక్కువని ప్రొడక్షన్‌ టీమ్‌ భావిస్తే... స్టూడియో వాళ్లతో నేను మాట్లాడేవాణ్ణి. అంతకుమించి నాకు తెలీదు కనుక... ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు గ్రాఫిక్స్‌కి ఇంత ఖర్చు అవుతుందని నిర్మాతలకు సలహాలు ఇవ్వలేను. ఇక వెయ్యికోట్లతో తీయబోతున్న ‘మహాభారతం’ చాలా పెద్ద ప్రాజెక్ట్‌. గ్రాఫిక్స్‌ కూడా చాలా కీలకం. దానికి ఎంత ఖర్చవుతుందో చెప్పలేం.
     
‘మగధీర’ తర్వాత గ్రాఫిక్స్‌కు నిర్మాతలు కొంత బడ్జెట్‌ కేటాయించడం మొదలైంది. ‘బాహుబలి’తో విజువల్‌ ఎఫెక్ట్స్‌ నేపథ్యంలో సినిమాలు తీసేందుకు మరింత ముందడుగు వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement