Kamal Kannan
-
రికార్డ్ బ్రేక్!
ప్రభాస్ ‘సాహో’ ఓ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇంకా సినిమానే రిలీజ్ కాలేదు అప్పుడే రికార్డ్ బ్రేకా అనుకుంటున్నారా? ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా చేస్తున్న కమల్ కణ్ణన్ అలానే అన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ ఏ సినిమాకీ చేయనటువంటి విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్‌ని ఈ సినిమాకి చేస్తున్నామని కమల్ పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు విడుదల కానుంది. ‘సాహో’ విజువల్ ఎఫెక్ట్స్ గురించి పేర్కొన్న కమల్ కన్నన్ ప్రభాస్ 20వ సినిమా గురించి కూడా ఓ హింట్ ఇచ్చారు. ‘‘ప్రభాస్ ‘జాన్’ క్లైమాక్స్ గురించి 2019 ఆరంభంలో చెప్పి తీరాల్సిందే’’ అన్నారు కమల్. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. అంటే.. ముందు క్లైమాక్స్ చిత్రీకరించి ఉంటారేమో. ఆ సంగతలా ఉంచితే.. ఇక్కడ కమల్ కన్నన్ ‘జాన్’ అన్నారు కాబట్టి ప్రభాస్ 20వ సినిమాకి ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారనుకోవచ్చా? కాలమే చెప్పాలి. ఈ చిత్రానికి కె. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
వర్మా.. ఇదేం ఖర్మ!
తూర్పుగోదావరి, గొల్లప్రోలు : మొదటి చిత్రంలో ఉత్త చేతులతో మురుగు కాలువలోని పూడిక తీస్తున్న మహిళ ఎవరో తెలుసా... శానిటరీ ఇన్స్పెక్టర్...ఆ పక్కన నిలబడి పెత్తనం చెలాయిస్తున్నది పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. పూడిక పేరుకుపోతే పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి ఆ పనులు చేపట్టించాలి గానీ ఇదేమి దౌర్జన్యం...అందరూ చూస్తుండగానే మురుగులో చేతులు పెట్టించి తీయించడం... అదీ ఓ మహిళా ఉద్యోగిపట్ల ఇంత అమానుషమా అని అక్కడున్నవారు ముక్కునవేలేసుకున్నారు. రెండో చిత్రం చూశారు కదా...మురుగు కాలువలో దిగి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పని చేస్తున్నది ఎవరో తెలుసా... ఆ ఇంకెవరు మున్సిపల్ కార్మికుడై ఉంటారనుకుంటే బురదలో కాలేసినట్టే...మన పక్క రాష్ట్రమైన పుదుచ్చేరి రాష్ట్ర విద్యాశాఖామంత్రి కమలకన్నన్. నిరసనగా ఇలా చేశారంటే కానేకాదు ... పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి ‘నేను సైతం’ అంటూ శ్రమదానంగా ఇలా పనిలోకి దిగారు. ఆ మంత్రి పనిలో పెత్తనం లేదు...అహంకారం అంతకన్నా లేదు...ఆత్మీయత కనిపిస్తోంది. మరి ఇక్కడ ఇంత అరాచకమేమిటని పంచాయతీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. గొల్లప్రోలు పట్టణం 9, 10 వార్డుల్లో టీడీపీ గ్రామదర్శిని కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటిస్తున్న సమయంలో పదో వార్డులో పాత పోలీస్ స్టేషన్ వీధిలోని మహిళలు పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందంటూ ఫిర్యాదు చేశారు. ఆ పక్కనే ఉన్న శానిటరీ ఇన్స్పెక్టరు శివలక్ష్మిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. సత్వరమే శుభ్ర పరచాలని ఆదేశించడంలోనూ తప్పులేదు. కానీ అక్కడున్న జనం మెప్పు కోసం మహిళా అధికారి అని కూడా చూడకుండా చేతులతో మురికిని తీయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె చేసేది లేక టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు చూస్తుండగా అవమాన భారంతో కాలువలో మురికిని చేతులతో తొలగించారు. ఎమ్మెల్యే వైఖరిపై పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డ్రీమ్ వారియర్ సంస్థలో సిబిరాజ్
తమిళ సినిమా : ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థగా రాణిస్తున్న డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ సంస్థలో యువ నటుడు సిబిరాజ్ నటించడానికి రెడీ అవుతున్నారు. కార్తీ హీరోగా కాష్మోరా, ధీరన్ అధికారం ఒండ్రు వంటి భారీ చిత్రాలతో పాటు జోకర్, అరివి వంటి సంచలన విజయాలను సాధించిన చిత్రాలను నిర్మించిన సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్. ఈ సంస్థ ప్రస్తుతం సూర్య హీరోగా ఎన్జీకే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సత్య వంటి సక్సెస్ఫుల్ చిత్రంలో నటించిన నటుడు సిబిరాజ్ ప్రస్తుతం రంగా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సిబిరాజ్‌కు జంటగా నిఖిలా విమల్ నటిస్తోంది. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇలా ఉండగా సిబిరాజ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు మధుభాన కడై చిత్రాన్ని తెరకెక్కించిన కమల్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధించిన మధుపాన కడై చిత్రం ఆయనకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఈ చిత్రం 2012లో విడుదలైంది. దాదాపు ఆరేళ్ల తరువాత కమల్‌కన్నన్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. సిబిరాజ్ హీరోగా నటించనున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఆర్ఎస్.ప్రకాశ్, ఆర్ఎస్.ప్రభు నిర్మించనున్నారు. చిత్ర షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
రాజమౌళితో పాటు మాకు సవాలే!
‘‘సన్నివేశాల్లోని భావోద్వేగాలను (ఎమోషన్స్) తెరపై ఆవిష్కరించడంలో విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్) సహాయపడతాయి. అంతే తప్ప... గ్రాఫిక్స్ ఎప్పుడూ భావోద్వేగాలను డామినేట్ చేయలేవు. సినిమాకు గ్రాఫిక్స్ మద్దతుగా నిలుస్తాయంతే’’ అన్నారు కమల్ కణ్ణన్. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి–2’కి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా పని చేశారీయన. వచ్చే శుక్రవారం విడుదలవుతోన్న ఈ సినిమా గురించి కమల్ కణ్ణన్ చెప్పిన సంగతులు... ►‘సై’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చేయమని రాజమౌళి నుంచి తొలిసారి కబురొచ్చింది. అందులో గ్రాఫిక్స్ వర్క్ తక్కువే. తర్వాత ‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలకు ఆయనతో పనిచేశా. ‘యమదొంగ’కు నాకు నంది అవార్డు వచ్చింది. ►ఏదైనా సీన్లో రాజమౌళి చెప్పినట్టు గ్రాఫిక్స్ చేయడం కుదరదంటే ఒప్పుకోరు. గూగుల్‌లో వెతుకుతారు. నేరుగా విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టుతో మాట్లాడతారు. వర్క్ పరంగా రాజమౌళిని శాటిస్ఫై చేయడం చాలా కష్టం. ప్రతి అంశంపై ఆయనకు పట్టుంది. ►అక్టోబర్ 16, 2015న నేను ‘బాహుబలి–2’ టీమ్‌లో చేరాను. అప్పటికే వర్క్ ప్రారంభమైంది. 2,555 షాట్స్‌లో గ్రాఫిక్స్ అవసరమని గుర్తించాను. లాస్ ఏంజెల్స్‌లోని జాన్ గ్రిఫిక్స్ అనే వ్యక్తి వార్ సీన్స్ కంప్లీట్ చేసేశాడు. ఈ 18 నెలల్లో 2200 షాట్స్‌లో గ్రాఫిక్స్ పూర్తి చేయడమంటే జోక్ కాదు. మన దేశంలోనూ, విదేశాల్లోనూ సుమారు 50 స్టూడియోలు ‘బాహుబలి–2’కి పని చేశాయి. ►‘బాహుబలి’తో పోలిస్తే రెండో భాగంలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఇందులో మాహిష్మతి రాజ్యాన్ని పూర్తిగా చూడొచ్చు. దేవసేనకు చెందిన కుంతల రాజ్యం కూడా ఈ పార్టులోనే ఉంటుంది. మాహిష్మతి, కుంతల రాజ్యాల మధ్య తేడాను చూపించడం దర్శకుడితో పాటు మాకు సవాల్‌గా నిలిచింది. సినిమాలో గ్రాఫిక్స్ ఎంత గొప్పగా ఉంటాయో... ఎమోషనల్, డ్రామా కూడా అంతే గొప్పగా ఉంటాయి. ►ఏప్రిల్ 28న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించడంతో... గ్రాఫిక్స్ వర్క్ త్వరగా పూర్తి కావాలని నవంబర్ నుంచి తొందర పెట్టారు. ఫిబ్రవరిలో మా వర్క్ పూర్తి చేసి, తర్వాత కరెక్షన్స్ చూడడం ప్రారంభించాం. ఇంకా ఐదు కరెక్షన్స్ చేయాలి. ►‘బాహుబలి–1’ విడుదలకు ముందు రెండో భాగంలో సుమారు 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. అందులో 10 నిమిషాలు లీకయిందని విన్నాను. అందువల్ల, మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ►ఈ సినిమా గ్రాఫిక్ వర్క్‌కి ఎంత ఖర్చయిందనేది నాకు తెలీదు. దర్శకుడి ఊహలకు అనుగుణంగా వర్క్ జరుగుతుందా? లేదా? అనేది పర్యవేక్షించడం మాత్రమే నా బాధ్యత. బిల్లింగ్ అంతా ప్రొడక్షన్ టీమ్ చూసుకుంటుంది. ఒకవేళ ఏదైనా స్టూడియోలో ఖర్చు ఎక్కువని ప్రొడక్షన్ టీమ్ భావిస్తే... స్టూడియో వాళ్లతో నేను మాట్లాడేవాణ్ణి. అంతకుమించి నాకు తెలీదు కనుక... ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు గ్రాఫిక్స్‌కి ఇంత ఖర్చు అవుతుందని నిర్మాతలకు సలహాలు ఇవ్వలేను. ఇక వెయ్యికోట్లతో తీయబోతున్న ‘మహాభారతం’ చాలా పెద్ద ప్రాజెక్ట్. గ్రాఫిక్స్ కూడా చాలా కీలకం. దానికి ఎంత ఖర్చవుతుందో చెప్పలేం. ►‘మగధీర’ తర్వాత గ్రాఫిక్స్‌కు నిర్మాతలు కొంత బడ్జెట్ కేటాయించడం మొదలైంది. ‘బాహుబలి’తో విజువల్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో సినిమాలు తీసేందుకు మరింత ముందడుగు వేస్తున్నారు. -
నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై రాజమౌళి కామెంట్
-
నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై రాజమౌళి కామెంట్
ప్రస్తుతం బాహుబలి 2 పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర కామెంట్ చేశాడు. బాహుబలి రెండో భాగం సెట్స్ మీద ఉండగానే రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరోసారి భారీ గ్రాఫిక్స్‌తో మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో సినిమా చేస్తాడని.. ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. రాజమౌళి మాత్రం అఫీషియల్‌గా ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై స్పందించలేదు. తాజాగా బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ సందర్భంగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర కామెంట్ చేశాడు రాజమౌళి. బాహుబలి పార్ట్ 2కు గ్రాఫిక్స్ సూపర్ వైజర్‌గా పనిచేసిన కమల్ కణ్నన్ను ఉద్దేశిస్తూ 'నా నెక్ట్స్ సినిమా ఇతని సాయం లేకుండా చేయాలనుంది. అందుకే నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు గ్రాఫిక్స్ అవసరం లేకుండా ప్లాన్ చేస్తా' అన్నాడు. బాహుబలి తొలి భాగానికి గ్రాఫిక్స్ సూపర్ వైజర్‌గా శ్రీనివాసమోహన్ పనిచేయగా.. రెండో భాగానికి కమల్ కణ్నన్ పనిచేశాడు. దీంతో రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ రెగ్యులర్ సోషల్ సినిమాను అయి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.