చంద్రముఖి-2గా తమన్న?
చంద్రముఖి తమిళ చిత్ర పరిశ్రమ చరిత్రను తిరగరాసిన చిత్రం. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం చంద్రముఖి. నగరంలోని శాంతి థియేటర్‌లో 804 రోజులు ప్రదర్శించబడిన ఏకైక చిత్రం చంద్రముఖి. నటి జ్యోతిక టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం మొదట మలయాళంలో మణిచిత్రతాళు పేరుతో తెరకెక్కి ఘన విజయం సాధించింది. అందులో మోహన్‌లాల్, శోభన నటించారు. ఆ తరువాత అది పి.వాసు దర్శకత్వంలో కన్నడంలో ఆప్తమిత్ర పేరుతో రూపొంది విజయం సాధించింది. అందులో నటి సౌందర్య చంద్రముఖి పాత్రను ధరించారు.
అదే చిత్రం రజనీకాంత్ హీరోగా చంద్రముఖి పేరుతో తమిళంలో తెరకెక్కింది. కన్నడంలో ఆప్తమిత్రకు సీక్వెల్‌గా ఆప్తరక్ష పేరుతో పి.వాసు దర్శకత్వంలో నిర్మితమై విజయం సాధించింది. దాన్ని చంద్రముఖి-2గా తమిళంలో రూపొందించాలని పి.వాసు భావించారు. అయితే రజనీకాంత్ అందులో నటించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. అదే చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో చేయడానికి దర్శకుడు పి.వాసు మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టార న్నది తాజా వార్త. అందులో చంద్రముఖి పాత్రకు నటి తమన్నను ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ విషయమై ఇప్పటికే తమన్నతో చర్చించినట్లు ఇందులో నటించే విషయమై పరిశీలిస్తున్నట్లు ఆమె వర్గం చెబుతోంది. దర్శకుడు పి.వాసు మరో సారి రజనీకాంత్‌ను చంద్రముఖి-2 లో నటింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రజనీకాంత్ ప్రస్తుతం కబాలీ, 2.ఓ చిత్రాలలో నటిస్తున్నారు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాతే చంద్రముఖి-2లో నటించే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.