Sivaji Productions
-
శివాజీ ప్రొడక్షన్స్‌లో ఇలయదళపతి
ప్రఖ్యాత దివంగత నటుడు శివాజీగణేశ న్, రజనీకాంత్, కమలహాసన్, అజిత్ వంటి ప్రముఖ నటులు నటించిన శివాజీ ప్రొడక్షన్స్ సంస్థలో ఇప్పుడు ఇలయదళపతి విజయ్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. విజయ్ నటించిన తాజా చిత్రం తెరి ఇటీవల విడుదలై విజయవిహారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్ల క్లబ్ దాటి 150 కోట్ల క్లబ్లో చేరిందంటున్నారు సినీ లెక్కల పండితులు. ప్రస్తుతం విజయ్ తన 60వ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రముఖ సంస్థ విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి.వెంకటరామిరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి భరతన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇలయదళపతి 61వ చిత్రం ఏమిటన్న వారికి శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే చిత్రం కానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. తెరి చిత్రంతో విజయ్‌కు అద్భుత విజయాన్ని అందించిన అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇక ఇందులో విజయ్‌కి జంటగా ఈ జనరేషన్‌కు చెందిన లక్కీ నటి నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెరి చిత్ర థ్యాంక్స్ మీట్లో దర్శకుడు అట్లీ తన తదుపరి చిత్రం గురించి త్వరలోనే వెల్లడిస్తామన్న విషయాన్ని పరిశీలిస్తే అది విజయ్‌తో శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న చిత్రమని భావించాల్సి ఉంటుంది. -
చంద్రముఖి-2గా తమన్న?
చంద్రముఖి తమిళ చిత్ర పరిశ్రమ చరిత్రను తిరగరాసిన చిత్రం. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం చంద్రముఖి. నగరంలోని శాంతి థియేటర్లో 804 రోజులు ప్రదర్శించబడిన ఏకైక చిత్రం చంద్రముఖి. నటి జ్యోతిక టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం మొదట మలయాళంలో మణిచిత్రతాళు పేరుతో తెరకెక్కి ఘన విజయం సాధించింది. అందులో మోహన్‌లాల్, శోభన నటించారు. ఆ తరువాత అది పి.వాసు దర్శకత్వంలో కన్నడంలో ఆప్తమిత్ర పేరుతో రూపొంది విజయం సాధించింది. అందులో నటి సౌందర్య చంద్రముఖి పాత్రను ధరించారు. అదే చిత్రం రజనీకాంత్ హీరోగా చంద్రముఖి పేరుతో తమిళంలో తెరకెక్కింది. కన్నడంలో ఆప్తమిత్రకు సీక్వెల్‌గా ఆప్తరక్ష పేరుతో పి.వాసు దర్శకత్వంలో నిర్మితమై విజయం సాధించింది. దాన్ని చంద్రముఖి-2గా తమిళంలో రూపొందించాలని పి.వాసు భావించారు. అయితే రజనీకాంత్ అందులో నటించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. అదే చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో చేయడానికి దర్శకుడు పి.వాసు మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టార న్నది తాజా వార్త. అందులో చంద్రముఖి పాత్రకు నటి తమన్నను ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే తమన్నతో చర్చించినట్లు ఇందులో నటించే విషయమై పరిశీలిస్తున్నట్లు ఆమె వర్గం చెబుతోంది. దర్శకుడు పి.వాసు మరో సారి రజనీకాంత్‌ను చంద్రముఖి-2 లో నటింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రజనీకాంత్ ప్రస్తుతం కబాలీ, 2.ఓ చిత్రాలలో నటిస్తున్నారు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాతే చంద్రముఖి-2లో నటించే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. -
ప్రభు చిత్రానికి రజనీకాంత్ ఆశీస్సులు
తమిళసినిమా: గతంలో కథానాయకుడిగా పలు చిత్రాలు చేసిన నటుడు ప్రభుకు అభిమానులు ఎక్కువేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నిర్మాతగానూ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై చంద్రముఖి లాంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.ప్రస్తుతం కథల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్న ప్రభు బహుభాషా నటుడిగా రాణిస్తున్నారు. తాజాగా తమిళంలో ఈయన ప్రధాన పాత్రలో మీన్ కుళంబుమ్ మణ్ పానైయుమ్ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని శివాజీగణేశన్ వారసుడు రామ్‌కుమార్ కొడుకు దుశ్యంత్ ఈశన్ ప్రొడక్షన్స్ అనే నూతన నిర్మాణ సంస్థలో రూపొందిస్తుండడం విశేషం. దీనికి అముదేశ్వర్ దర్శకత్వం వహించనున్నారు. ప్రభుతో పాటు కాళిదాస్, జయరామ్, ఆష్నాజవేరి, ఎంఎస్.భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీత బాణీలు అందించనున్నారు. చిత్ర షూటింగ్ అధిక భాగం మలేషియాలో జరపనుండటంతో చిత్ర దర్శక నిర్మాతలు ఇటీవల లోకేషన్స్ ఎంపిక చేయడానికి మలేషియా వెళ్లారు. అక్కడ కబాలీ చిత్ర షూటింగ్లో ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మీన్ కుళంబుమ్ మణ్ పానైయుమ్ చిత్ర వివరాలను ఆయనకు చెప్పారు. అప్పుడు రజనీకాంత్ పలు కళా ఖండాలను నిర్మించిన శివాజీ ప్రొడక్షన్స్ మాదిరిగానే ఈ ఈశన్ ప్రొడక్షన్స్ సంస్థ ఎదగాలని ఆకాంక్షించారు. చిత్రం టైటిల్ బాగుందని మీన్ కుళంబుమ్ మణ్ పానైయుమ్ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశీర్వదించినట్లు నిర్మాత దుశ్యంత్ వెల్లడించారు. ప్రతిభావంతులైన కొత్త నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించాలన్న ఆశయంతోనే ఈశన్ ప్రొడక్షన్ప్ సంస్థను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను 20వ తేదీ నుంచి చెన్నైలో నిర్వహించనున్నట్లు, రెండో షెడ్యూల్‌ను జనవరి రెండో తేదీ నుంచి మలేషియాలో జరపనున్నట్లు దుశ్యంత్ వెల్లడించారు.