ప్రభు చిత్రానికి రజనీకాంత్ ఆశీస్సులు
తమిళసినిమా: గతంలో కథానాయకుడిగా పలు చిత్రాలు చేసిన నటుడు ప్రభుకు అభిమానులు ఎక్కువేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నిర్మాతగానూ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై చంద్రముఖి లాంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.ప్రస్తుతం కథల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్న ప్రభు బహుభాషా నటుడిగా రాణిస్తున్నారు. తాజాగా తమిళంలో ఈయన ప్రధాన పాత్రలో మీన్ కుళంబుమ్ మణ్ పానైయుమ్ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని శివాజీగణేశన్ వారసుడు రామ్‌కుమార్ కొడుకు దుశ్యంత్ ఈశన్ ప్రొడక్షన్స్ అనే నూతన నిర్మాణ సంస్థలో రూపొందిస్తుండడం విశేషం.
దీనికి అముదేశ్వర్ దర్శకత్వం వహించనున్నారు. ప్రభుతో పాటు కాళిదాస్, జయరామ్, ఆష్నాజవేరి, ఎంఎస్.భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీత బాణీలు అందించనున్నారు. చిత్ర షూటింగ్ అధిక భాగం మలేషియాలో జరపనుండటంతో చిత్ర దర్శక నిర్మాతలు ఇటీవల లోకేషన్స్ ఎంపిక చేయడానికి మలేషియా వెళ్లారు. అక్కడ కబాలీ చిత్ర షూటింగ్‌లో ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మీన్ కుళంబుమ్ మణ్ పానైయుమ్ చిత్ర వివరాలను ఆయనకు చెప్పారు.
అప్పుడు రజనీకాంత్ పలు కళా ఖండాలను నిర్మించిన శివాజీ ప్రొడక్షన్స్ మాదిరిగానే ఈ ఈశన్ ప్రొడక్షన్స్ సంస్థ ఎదగాలని ఆకాంక్షించారు. చిత్రం టైటిల్ బాగుందని మీన్ కుళంబుమ్ మణ్ పానైయుమ్ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశీర్వదించినట్లు నిర్మాత దుశ్యంత్ వెల్లడించారు. ప్రతిభావంతులైన కొత్త నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించాలన్న ఆశయంతోనే ఈశన్ ప్రొడక్షన్ప్ సంస్థను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను 20వ తేదీ నుంచి చెన్నైలో నిర్వహించనున్నట్లు, రెండో షెడ్యూల్‌ను జనవరి రెండో తేదీ నుంచి మలేషియాలో జరపనున్నట్లు దుశ్యంత్ వెల్లడించారు.