27 ఏళ్లలో అరుదైన ఘనత సాధించిన రవిప్రభు
భూటాన్‌తో ప్రారంభించి వెనుజులాతో ముగించి..
ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించడమే అతడి లక్ష్యం.. ఆ దిశగా ఎంతో కష్టపడ్డారు. సుమారు 27 ఏళ్లు ఎంతో శ్రమకోర్చి అన్ని దేశాలను సందర్శించి అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం 195 దేశాల సందర్శన పూర్తి చేసుకుని తెలుగుగడ్డపై బుధవారం అడుగుపెట్టారు. ఈ అరుదైన ఘనత సాధించిన వ్యక్తి మన తెలుగువాడు కావడం విశేషం.
ప్రపంచాన్నే చుట్టేసిన 43 ఏళ్ల వయస్సు కలిగిన రవిప్రభు స్వస్థలం విశాఖపట్నం. ఆయన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో చదువుకున్నాడు. పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రుడైన రవిప్రభు విద్యార్థి దశలోనే 1996లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వివాహం చేసుకొని ఉద్యోగం చేసుకుంటూనే విదేశాలను సందర్శించడం ప్రారంభించారు. భూటాన్ దేశాన్ని సందర్శించడంతో ప్రారంభమైన ఆయన యాత్ర వెనుజులతో ముగిసింది. ప్రపంచంలోని దేశాలను సందర్శిస్తూనే 2020లో ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. మొత్తం సందర్శన విశేషాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ వచ్చారు.
అన్ని దేశాలను చుట్టేసి వచ్చిన ఆయన రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా అంతరిక్షంలోకి వెళ్లారు. 6,600 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోని 850 కోట్ల మందిలో 280 మంది మాత్రమే ప్రతి దేశాన్ని సందర్శించారని అన్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన 280 మందిలో తనకు స్థానం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 27 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రయాణాల కోసం రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment