అప్పుడు చిరంజీవే గుర్తొచ్చారు!
‘‘బంగారి మంచోడు. అయితే.. పెళ్లి చేయలేదని వాళ్ల నాన్న మీద అతనికి కోపం. అందుకే, నాన్నకు నచ్చని పనులు చేస్తుంటాడు. అతను చేసే పనులు నెగటివ్‌గా ఉంటాయి కానీ, అతను మాత్రం నెగటివ్ పర్సన్ కాదు’’ అని శ్రీకాంత్ అన్నారు. రామ్‌చరణ్ కథానాయకునిగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మించిన చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ అక్టోబర్ మొదటి వారంలో విడుదల కానుంది. ఈ సినిమాలో చరణ్‌కి బాబాయిగా శ్రీకాంత్ నటించిన విషయం తెలిసిందే. ఇందులో తన పాత్ర తీరు తెన్నుల గురించి, సినిమా విశేషాల గురించి మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు శ్రీకాంత్.
‘‘ఇందులో నా పాత్ర పేరు బంగారి. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో నేను రామ్‌చరణ్‌కి బాబాయినే అయినా, యంగ్‌గానే ఉంటాను. నా మరదలిగా కమలినీ ముఖర్జీ నటించారు. ప్రకాశ్‌రాజ్‌ది నా తండ్రి పాత్ర. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు వినోదభరితంగా ఉంటాయి. ఇంట్లో నాకంటే రామ్‌చరణ్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని కొంచెం కోపంగా ఉంటాను. ఓ సందర్భంలో చరణ్‌ని కొడతాను కూడా. కానీ... చరణ్ మాత్రం నన్ను కొట్టడు. ‘ఎందుకు కొట్టడు?’ అనేది ఆసక్తికరమైన విషయం’’ అని చెప్పారు శ్రీకాంత్. కృష్ణవంశీ గురించి మాట్లాడుతూ -‘‘కృష్ణవంశీ దర్శకత్వంలో ఖడ్గం, మహాత్మ చిత్రాల్లో నటించాను.
ఇది మూడో సినిమా. నిన్నేపెళ్లాడతా, మురారి, చందమామ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఆ మాటకొస్తే ఆ సినిమాలకంటే ఓ మెట్టు ఎత్తులో ఈ సినిమా ఉంటుంది. చిరంజీవిగారు కూడా మొన్ననే రషెస్ చూశారు. చాలా హ్యాపీగా ఉన్నారు. అన్నయ్య సూచన మేరకు నేను, చరణ్ నటించగా కొన్ని సీన్స్ తీసి జత చేశారు’’ అని తెలిపారు. తనకు వ్యక్తిగతంగా చరణ్ చాలా ఏళ్లుగా తెలుసని, సెట్‌లోకి అడుగుపెట్టాక తన ప్రవర్తన గమనిస్తే చిరంజీవిగారే గుర్తొచ్చారని శ్రీకాంత్ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి టాప్‌స్టార్స్‌తో కూడా నటించాలని ఉందనీ, ప్రస్తుతం సోలో హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నానని శ్రీకాంత్ తెలిపారు.