పబ్లిసిటీలో... తెలివైనోడు!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా శరవేగంతో షూటింగ్ జరుపుకొంటోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై తయారవుతున్న ఈ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ఇప్పటి దాకా ప్రకటించలేదు కానీ, టైటిల్ ‘సరైనోడు’ అని ఇప్పటికే మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయనున్నారు. విచిత్రం ఏమిటంటే, ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు కూడా ఒక టీజర్ లాగా ‘ప్రీ-లుక్’ పోస్టర్‌ను అల్లు అర్జున్ అధికారికంగా సోషల్ మీడియాలో పెట్టారు. రకుల్‌ప్రీత్ సింగ్, కేథరిన్ త్రెసా ఈ చిత్రంలో కథానాయికలు. మరో హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ సాంగ్‌లో నర్తిస్తున్నారు.
తమిళంలో హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగబ్బాయి ఆది పినిశెట్టి (ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు) ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర ధరిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. గతంలో బోయపాటి రూపొందించిన మాస్ మసాలా చిత్రాల లానే ఈ సినిమా కూడా మాస్ సైలిలో ఉంటుందని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ ప్రీ-లుక్ కూడా చేతిలో పెద్ద ఇనుప గుండు లాంటిది పట్టుకొని, అల్లు అర్జున్ కనిపించీ కనిపించకుండా ఉన్నారు.
మొత్తం లుక్, టైటిల్ లోగో చూడాలంటే రిపబ్లిక్ డే దాకా వేచి ఉండాల్సిందే. మొత్తానికి, సోషల్ మీడియా పుణ్యమా అని టైటిల్ లోగోలు, ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్ల లాంటివి పాపులరైతే, కొత్తగా ఈసారి ఫస్ట్‌లుక్‌కు టీజర్‌గా ‘ప్రీ-లుక్’ విడుదల చేయడం పబ్లిసిటీ వ్యూహంలో భాగమే. వెరసి, ఫ్రీ పబ్లిసిటీలో మనోళ్ళు ‘తెలివైనవాళ్ళే’.