sarainodu
-
విద్యుల్లేఖతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ
ఆమె రూపం ప్రత్యేకం...ఆమె గొంతు ప్రత్యేకం. మాట్లాడే భాష కూడా ప్రత్యేకమే. ఆమె తెరపై కన్పించగానే నవ్వులు విరబూయాల్సిందే. రూపం..గొంతు..భాషతో సినీతెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది క్యారెక్టర్ కమ్ కమెడియన్ ఆర్టిస్ట్ విద్యుల్లేఖా రామన్. సరైనోడు సినిమాలో ‘సాంబార్ వదిన’గా..రాజుగారి గది మూవీలో బుజ్జెమ్మగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విద్యుల్లేఖ చెన్నైలో పుట్టి పెరిగింది. తండ్రి మోహన్ రామన్ తమిళ నటుడు. మొదట థియేటర్ ఆర్టిస్టుగా రాణించి...ఆపై వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ అమ్మాయి తెలుగు భాషను తమిళ యాసతో వెరైటీగా మాట్లాడుతుంది. హైదరాబాద్ అంటే ఇష్టమని, పాతబస్తీలో షాపింగ్... పలావ్ లాగించడం మరీ ఇష్టమని చెబుతున్న విద్యుల్లేఖ తన సినీ ప్రయాణం..వ్యక్తిగత అభిరుచుల గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.. శ్రీనగర్‌కాలనీ: ఆమె తెరపై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు.. ఏ పాత్ర వేసినా అందులో ఆ పేరు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఆమె ఒరిజినల్ పేరు చాలా మందికి తెలియదు. తెలుగులో ‘బుజ్జెమ్మ, సాంబార్’ అని ముద్దుగా పిలిపించుకుంటూ ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఇంకా గుర్తుపట్టలేదా.. అదేనండీ.. ‘సరైనోడు’ చిత్రంలో అల్లు అర్జున్‌కు తమిళ సాంబార్ వదినగా, ‘రాజుగారి గది’లో బుజ్జెమ్మగా, ‘రన్ రాజా రన్’లో హీరోయిన్ ఫ్రెండ్‌గా పంచ్‌లు వేస్తూ కడుపుబ్బా నవ్వించిన నటి. బొద్దుగా చురుకుదనానికి కేరాఫ్‌గా కనిపించిందే ఆమె అసలు పేరు ‘విద్యులేఖా రామన్’. తెలుగు, తమిళ పరిశ్రమలో లేడీ స్టార్ కమెడియన్‌గా చాలా సుపరిచితురాలు. తెలుగు భాషను తమిళ వాసనలో మాట్లాడే ఈ పాప.. ‘సాక్షి’తో తన చిత్రసీమ ప్రయాణాన్ని పంచుకుంది. ఆ వివరాలు బుజ్జెమ్మ అలియాస్ విద్యుల్లేఖా రామన్ మాటల్లోనే.. నేను పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే. నాన్న మోహన్ రామన్ తమిళ నటుడు. రజనీకాంత్, కమలహాసన్ లాంటి స్టార్లతో పాటు పలు ప్రముఖ సీనియల్స్‌లో నటించారు. నేను విజువల్ ఎఫెక్టŠస్ అండ్ మీడియా కమ్యునికేషన్స్‌లో డిగ్రీ చేశాను. మా నాన్న ప్రభావం నాపై పడిందేమో.. నేనూ థియేటర్ ఆర్టిస్ట్ అయ్యాను. పదేళ్లు థియేటర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ ‘అను’ అనే ట్రూప్‌ను ప్రారంభించాను. దానిద్వారా ప్రదర్శనలు ఇచ్చి అవార్టులు సైతం అందుకున్నాను. థియేటర్ ఆర్టిస్ట్‌గా స్టేజ్ ఫియర్ పోయి సినిమాల్లో నటించడానికి చాలా దోహదపడింది. ఒకేసారి తెలుగు, తమిళంలో నటించా.. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమా తీస్తున్నారు. ఒక కొత్త అమ్మాయిని క్యారెక్టర్ కోసం వెతుకున్న సమయంలో థియేటర్ ఆర్టిస్ట్‌గా నా ప్రదర్శన చూసిన చిత్ర యూనిట్ ఆయనకు పరిచయం చేశారు. ఆడిషన్ తర్వాత చిత్రంలో క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమానే ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. ఆ తర్వాత రన్‌రాజారన్, సరైనోడు, రాజుగారి గది, తొలిప్రేమ, ఆనందోబ్రహ్మ, నిన్నుకోరి, భాగమతి, ధృవ, డీజే.. ఇలా తెలుగులో 35 చిత్రాలు చేశాను. తమిళంలో విజయ్, అజిత్ లాంటి స్టార్స్‌తో పాటు మొత్తం 26 సినిమాలు, కన్నడలో మూడు చిత్రాల్లోను నటించారు. సొంతంగా డబ్బింగ్.. మొదటి సినిమా చేసేనాటికి నాకు తమిళం తప్ప ఒక్క ముక్క తెలుగు రాదు. అయినా సరే కొత్త వాయిస్ ఉంటే బాగుంటుందని దర్శకుడు గౌతమ్ మీనన్ నాతో డబ్బింగ్ చెప్పించారు. ఆ తర్వాత అన్ని సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. కొత్త వాయిస్ కావడంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాను. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడతాను కూడా. రన్ రాజా రన్, రాజుగారి గది, సరైనోడు చిత్రాల్లోని పాత్రలు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ఎంతగా అంటే నా అసలు పేరు ఎవరూ గుర్తుంచుకోలేదు.. ఆ చిత్రల్లోని పాత్రల పేరుతోనే పిలుస్తున్నారు. తెలుగు ఫుడ్‌కి ఫిదా అయిపోయా.. నాకు జీవితాన్ని, గుర్తింపును ఇచ్చింది తెలుగు సినిమా.. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. పాతబస్తీ అంటే మరీ ఇష్టం. అక్కడి కట్టడాలు అపురూపంగా ఉంటాయి. ఇక్కడి సంస్కృతి చాలా గొప్పది. పాతబస్తీలో షాపింగ్ అంటే ఇష్టం.. హైదరాబాద్ బిర్యానీ కంటే పలావ్.. భీమవరం చేపల పులుసు, పీతలు, రొయ్యలు, స్పైసీ పుడ్ ఇష్టంగా తింటాను. నన్ను నేను మైమరపించేలా తెలుగు వంటకాలుంటాయి. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్, బేగంబజార్, ఔటర్‌రింగ్ రోడ్లో లాంగ్ డ్రైవ్ ఇష్టం. పవన్ కల్యాణ్‌తో సినిమా నా డ్రీమ్.. తెలుగులో పవర్‌స్టార్‌తో సినిమా చేయాలని నా కోరిక.. కానీ తీరేలా లేదు. అవకాశం ఉంటే తప్పక చేస్తాను. మెగాస్టార్ చిరంజీవి గారంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయాలని ఉంది. ఇది కుదురుతుంది అనుకుంటున్నాను. అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలని ఉంది. కామెడీ చేయడం చాలా కష్టం.. కానీ ఇష్టంతో చేయాలి. దానితో పాటు సీరియస్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అఖిల్, నితిన్, నిఖిల్, నాగచైతన్య సినిమాల్లో నటిస్తున్నాను. 500 చిత్రాలు చేయాలి తెలుగు, తమిళ భాషల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసిన మహానటుల్లా నా కెరీర్లో 500 చిత్రాలు చేయాలని ఉంది. దేవుడి కృప ఉంటే తప్పక చేస్తాను. సినిమాల్లో హెల్తీ కామెడీ రావాలి. సైజ్లు, కలర్‌ను పదేపదే అవహేళన చేసే విధంగా కాకుండా ఓ మోతాదులో హెల్తీ కామెడీ ఉంటే బాగుంటుంది. లేడీ కమెడియన్స్ పరిశ్రమలో లేరు. ప్రతిభ ఉన్న వారు తప్పక రావాలి. తమిళంలో కంటే తెలుగులో అధికంగా అవకాశాలు వస్తున్నాయి. నన్ను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను. అన్నట్టు నా అసలు పేరు విద్యుల్లేఖా రామన్.. అంటూ ముగించారు. -
ఇక మీదట హీరోగానే..!
‘ఒక విచిత్రం’ సినిమాతో హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో ఆది పినిశెట్టి కోలీవుడ్‌లో హీరోగా మంచి విజయాలు సాధించాడు. అయితే తెలుగులో మాత్రం హీరోగా కన్నా ఎక్కువగా ప్రతినాయక పాత్రల్లో, సహాయ పాత్రల్లోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. సరైనోడు, అజ్ఞాతవాసి సినిమాల్లో విలన్‌గా, ఆకట్టుకున్న ఆది ఇటీవల రంగస్థలం సినిమాలో హీరో అన్నగా నటించి మెప్పించాడు. అయితే ఇక మీద ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట ఈ యువ నటుడు. ఆది పినిశెట్టి ఇక మీద సోలో హీరోగానే సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యూటర్న్ రీమేక్ తో పాటు కోన వెంకట్ నిర్మిస్తున్న సినిమాలో లీడ్ రోల్లో కనిపించనున్నాడు ఆది. ఇప్పటికే కోలీవుడ్ లో హీరోగా ప్రూవ్ చేసుకున్న ఆది త్వరలోనే తెలుగులో కూడా సోలో హీరోగా సత్తా చాటే ఆలోచనలో ఉన్నాడు. -
ఆమెకు ఇంకా సరైనోడు దొరకలేదట!
క్యాథరిన్ ట్రెసా సరైనోడు ఇంకా కంటపడలేదు అంటోంది. క్యాథరిన్‌కు తమిళంలో సరైన హిట్ రాలేదనే చెప్పాలి. ఆమె గ్లామర్‌గా నటించడానికి ఏమాత్రం వెనుకాడని ధైర్యం ఉన్న నటి. అయినా స్టార్స్‌తో జత కట్టే అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఆ మధ్య విశాల్‌తో కథకళి చేసినా, అధర్వ కణిదన్తో విజయం అందుకున్నా, అవకాశాల్లో జోరు పెరగలేదు. అయితే టాలీవుడ్లో అల్లుఅర్జున్ లాంటి స్టార్స్‌తో నటించే అవకాశాలను రాబట్టుకుంటోంది. కోలీవుడ్‌లో ఆర్యతో జతకట్టిన కడంబన్ చిత్రం తరువాత క్యాథరిన్ ట్రెసాను చూడలేదు. అయితే ప్రస్తుతం కలగలప్పు-2, కథానాయగన్ చిత్రాలతో రానుంది. ముఖ్యంగా కలగలప్పు-2లో ఈ బ్యూటీ తన అందాలతో మోత మోగించనుందనే ప్రచారం జరుగుతోంది. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై వచ్చిన క్యాథరిన్‌ను ఎలాంటి ప్రాతలను ఇష్ట పడుతున్నారంటే చాలా మంది హీరోయన్ల మాదిరిగానే చాలెంజింగ్ అనిపించే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అని చెప్పింది. అయితే హీరోలకు అక్కగానో, చెల్లెలిగానో నటించమంటే మోహమాటం లేకుంటా సారీ అనేస్తానని అన్నది. కథ, పాత్ర బాగుంటే హీరోయిన్గా కాకపోయినా వారికి లవర్ లాంటి పాత్రల్లో గ్లామర్‌గా నటించడానికైనా రెడీ అని చెప్పింది. క్యారెక్టర్ పాత్రలు చేయడానికి సిద్ధమా? అంటే ఆ వయసుకు తానింకా రాలేదని చెప్పింది. సరే పెళ్లెప్పుడు? ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా అందుకు సరైనోడు ఇంకా తారస పడలేదని, నాకు నచ్చిన వాడు దొరికితే అప్పుడు పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానని క్యాథరిన్ ట్రెసా చెప్పుకొచ్చింది. -
మెగా అభిమానులకు నిరాశే..!
ప్రస్తుతం టాలీవుడ్లో ధృవ ఫీవర్ నడుస్తోంది. బడా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతుండటంతో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తన గత సినిమా బ్రూస్లీ నిరాశపరచటంతో చరణ్ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్లో మిలియన్ మార్క్‌ను అందుకోవటంతో పాటు ఓవరాల్‌గా వందకోట్ల క్లబ్లో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ధృవ విషయంలో మెగా అభిమానులకు నిరాశ తప్పదని తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోల సందడి మొదలవుతుంది. తమ అభిమాన నటుడి సినిమాను అందరికంటే ముందే చూసేందుకు ఫ్యాన్స్ ఎంత రేటు పెట్టైనా టికెట్ కొనేందుకు సిద్ధమవుతారు. అయితే ధృవ విషయంలో మాత్రం నిర్మాత అల్లు అరవింద్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ధృవ సినిమాకు ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవట. ఉదయం ఆరుగంటల తరువాతే తొలి షో వేసేలా ప్లాన్ చేస్తున్నారు. బెనిఫిట్ షోస్ కారణంగా ముందే టాక్ బయటికి వచ్చేయటంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో సరైనోడు రిలీజ్ సమయంలోనూ బెనిఫిట్ షోలకు నో చెప్పిన అల్లు అరవింద్. ప్రస్తుతం ధృవ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. -
బోయపాటి, బెల్లంకొండ సినిమా మొదలైంది..!
ఈ ఏడాది మొదట్లో సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బోయపాటి శ్రీను ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టలేదు. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్‌గా పేరున్న బోయపాటి, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగినా.. సెట్స్ మీదకు మాత్రం రాలేదు. అయితే శనివారం మరోసారి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారన్న టాక్ వినిస్తోంది. కొత్త ఆఫీస్‌లో పూజా కార్యక్రమాలతో సినిమా పనులను మొదలపెట్టారు. ఇప్పటికే కథా కథనాలు సిద్ధంగా ఉండటంతో త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఇన్నాళ్లు ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అనుమానల విషయంలో క్లారిటీ వచ్చినట్టే అని భావిస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ షెడ్యూల్స్కు సంబందించి అధికారిక ప్రకటన వెలువడనుంది. -
సరైనోడి ఊరమాస్ పార్టీ
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సరైనోడు. ఈ ఏడాది సమ్మర్ బరిలో బిగెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా.., అల్లు అర్జున్ కెరీర్లోనే హైయ్యస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ సృష్టించింది. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు సినిమాతో మరోసారి తన మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు బన్నీ. ఈ సినిమా ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో అల్లు అర్జున్ చిత్రయూనిట్‌కు భారీ పార్టీ ఇచ్చాడు. ఈ మధ్యే బిజినెస్‌లోకి అడుగుపెట్టిన ఈ మెగా హీరో, తన సొంతం పబ్‌లో సన్నిహితులు, యూనిట్ సభ్యులతో కలిసి సరదాగా గడిపాడు. అంతేకాదు బన్నీ, ఇచ్చిన ఈ పార్టీకి తన స్టైల్ లో మాస్ ఊర మాస్ పార్టీ అని పేరు పెట్టుకున్నాడు. మంగళ వారం రాత్రి జరిగిన ఈ పార్టీలో దర్శకుడు బోయపాటి శ్రీను, రచయిత రాజసింహ ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
బన్నీ, హరీష్‌కే ఫిక్స్ అయ్యాడు
సరైనోడు సక్సెస్ తరువాత చాలారోజులుగా ఖాళీగా ఉన్న అల్లు అర్జున్ ఎట్టకేలకు తన తదుపరి సినిమాను కన్ఫామ్ చేశాడు. ముందుగా మనం, 24 చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్‌తో ఎక్స్పరిమెంటల్ సినిమా చేయాలని భావించిన బన్నీ, తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. మరో తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో మాస్ మాసాలా ఎంటర్టైనర్ను ప్లాన్ చేసినా అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్‌గా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో మంచి ఫాంలో ఉన్న హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నాడు. దాదాపు ఏడేళ్ల విరామం తరువాత బన్నీ, దిల్ రాజు బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు బన్నీ లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
రికార్డులు తిరగరాస్తున్న 'సరైనోడు'
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను పూర్తిగా మాస్ గా చూపించిన చిత్రం సరైనోడు మరిన్ని రికార్డులు సృష్టిస్తోంది. యాక్షన్ మూవీల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు యాబై రోజుల మార్క్ ను చేరుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇప్పటికీ 115 థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. సమ్మర్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయినా ఈ సినిమా డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయినా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మూవీతో ఇటీవల వంద కోట్ల క్లబ్ లో చేరాడు బన్నీ. ఇప్పటివరకూ రూ.125 కోట్ల కలెక్షన్లు సాధించి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా సరైనోడు నిలిచింది. తెలుగు వెర్షన్లో రూ.119 కోట్లు, మలయాళంలో కూడా డబ్బింగ్ చేసిన ఈ మూవీ అక్కడ రూ.6 కోట్లు వసూలు చేసింది. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా అందాలు ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయ్యాయి. కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి నటన మూవీకి హైలెట్ గా నిలిచింది. ఏప్రిల్ 22న రిలీజ్ అయిన సరైనోడు అల్లు అర్జున్ రేంజ్‌ను భారీగా పెంచేసింది. బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సరైనోడు అని మూవీ విశ్లేషకుడు త్రినాథ్ పేర్కొన్నాడు. ఇటీవల కాస్త కామెడీ ట్రాక్ మూవీలు చేసిన అల్లు అర్జున్ ఈ మూవీలో ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
అనుష్కతో జత కట్టనున్న విలన్
వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తమిళ బాట పట్టిన ఈ యంగ్ హీరో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తున్న స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయాడు. అయితే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆది మంచి మార్కులు సాధించాడు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు ఆది మీద పడింది. డిఫరెంట్ జానర్లో తెరకెక్కే సినిమాల కోసం ఆదిని హీరోగా తీసుకోవాలని భావిస్తున్నారు. అదే బాటలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న లేడి ఓరియంటెడ్ సినిమా భాగమతిలో అనుష్కకు జంటగా ఆదిని ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడు అశోక్ చెప్పిన కథ విన్న ఆది వెంటనే ఒప్పేసుకున్నాడట. ఇప్పటికే మళయాల నటుడు జయరాంను విలన్ పాత్రకు ఎంపిక చేయగా, మరో కీలక పాత్ర కోసం టబుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల నటులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల మూడో వారంలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అప్పుడే సినిమాలో నటించే నటీనటుల విషయంలో మరింత క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. -
రికార్డులు సృష్టిస్తోన్న సరైనోడు
అల్లు అర్జున్ హీరోగా మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరైనోడు. సమ్మర్ బరిలో రిలీజ్ అయినా ఈ సినిమా డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయినా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. బన్నీ కెరీర్లో హైయస్ట్ గ్రాసర్‌గా నిలిచిన సరైనోడు ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. చాలా కాలం తరువాత అల్లు అర్జున్ ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 22న రిలీజ్ అయిన సరైనోడు అల్లు అర్జున్ రేంజ్‌ను భారీగా పెంచేసింది. ఇప్పటికే వరుసగా 50 కోట్ల సినిమాలతో సత్తా చాటిన బన్నీ. ఈ సినిమాతో వంద కోట్ల కలెక్షన్లతో ఫాం చూపించాడు. వరల్డ్ వైడ్ గా 74 కోట్ల షేర్ వసూళు చేసిన సరైనోడు, తెలుగు, హిందీ శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకొని 90 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా చెపుతున్నారు. ఇప్పటికీ మంచి వసూళ్లు వస్తుండటంతో సరైనోడి ఖాతాలో ముందు ముందు మరిన్ని రికార్డ్‌లు కాయం అంటున్నారు ఫ్యాన్స్. -
లిఫ్ట్‌లో ఇరుక్కున్న అల్లు అర్జున్, బోయపాటి
విశాఖ: దైవ దర్శనానికి వెళ్లిన సినీ హీరో అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. సింహాచలం వరాహ నరసింహస్వామి దర్శించుకునేందుకు వెళ్లిన వీరికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. దర్శన అనంతరం అల్లు అర్జున్, బోయపాటి లిఫ్ట్ ఎక్కగా, సాంకేతిక లోపంతో సగంలో నిలిచిపోయింది. వీరితో పాటు అభిమానులు కూడా పరిమితికి మించి ఎక్కేయడంతో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో ఆలయ అధికారులు లిఫ్ట్ డోరు పగులగొట్టి వారిని బయటకు తీశారు. మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకుని అభిమానులను నిలువరించారు. కాగా బన్నీ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు' చిత్రం విజయవంతమైన విషయం తెలిసిందే. దీంతో వారు అప్పన్నకు మొక్కు చెల్లించుకునేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. -
చిరుతో చిందేయనున్న ఎమ్మెల్యే
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గరనుంచి రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో సందడి చేస్తోంది. ఈ సినిమాకు పనిచేయబోయే సాంకేతిక నిపుణుల నుంచి నటీనటుల వరకు రకరకాల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికీ హీరోయిన్ల విషయంలో క్లారిటీ రాకపోయినా ఇద్దరు సీనియర్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరుసగా సీనియర్ హీరోలతో జతకడుతున్న నయనతార దాదాపు కన్ఫామ్ అని భావించారు. అయితే ఇప్పుడు కొత్తగా అనుష్క పేరు తెర మీదకు వచ్చింది. ఇంకా హీరోయిన్ పేరు ఫైనల్ కాకముందే స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడేందుకు ఓ కుర్ర హీరోయిన్ను ఫైనల్ చేశారట. ఈ మధ్యే సరైనోడు సినిమాలో మెగా హీరో అల్లు అర్జున్ సరసన గ్లామరస్ ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్ థెరిస్సా, మెగాస్టార్ 150వ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందట. అంతేకాదు కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా ఈ అమ్మడు కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్‌లో బిజీగానే ఉన్నా తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కేథరిన్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. -
కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్న ఆది
యువ నటుడు ఆది తాజా చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈరం తదితర చిత్రాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఆది. ఆయన తమిళంలో యాగవరాయన్ నాకాక్క చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. ఆ చిత్రం విడుదలై ఏడాది అవుతోంది. అయితే ఇటీవల తెలుగులో సరైనోడు చిత్రంలో అల్లుఅర్జున్‌కు విలన్‌గా నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చిన్న గ్యాప్ తరువాత ఆది తమిళంలో కథానాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జి.ఢిల్లీబాబు నిర్మించనున్నారు. ఇందులో ఆదికి జంటగా నటి శివదా నటించనున్నారు. ఏఆర్కే.శరవణ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి పీవీ.శంకర్ చాయాగ్రహణం, డిబు సంగీతాన్ని అందించనున్నారు. చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. -
సరైనోడి ఖాతాలో మరో రికార్డ్
సమ్మర్ సీజన్లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమా సరైనోడు. అల్లు అర్జున్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే వందకోట్ల వసూళ్లతో టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ సరసన స్థానం సంపాదించిన ఈ సినిమా, 60 కోట్ల షేర్‌తో బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. తాజాగా మరో అరుదైన రికార్డ్ సరైనోడి సొంతమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సీడెడ్‌లో 10 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలు చాలా తక్కువ. మగధీర, అత్తారింటికి దారేది, బాహుబలి లాంటి సినిమాలు మాత్రమే రాయలసీమలో పది కోట్ల షేర్ వసూళు చేశాయి. అలాంటిది తాజాగా సరైనోడు సినిమాతో అల్లు అర్జున్, ఈ ఫీట్‌ను సాధించాడు. అంతేకాదు ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డ్ దిశగా దూసుకుపోతున్నాడు. -
బెల్లంకొండ కోసం బోయపాటి ప్లాన్
సరైనోడు సినిమా సక్సెస్‌తో వంద కోట్ల వసూళ్లను సాధించిన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఇప్పుడు ఓ యంగ్ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో సినిమా తరువాత కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. సరైనోడు సక్సెస్ కన్నా ముందే కమిట్ అయిన సినిమా కావటంతో ఇంతటి భారీ విజయం తరువాత బెల్లంకొండ సినిమాను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే బోయపాటి సినిమా అంటే భారీ యాక్షన్ సీన్స్, అదే స్థాయిలో స్టార్ కాస్ట్ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. మరి సాయి లాంటి యంగ్ హీరో మీద అంత బడ్జెట్ వర్క్ అవుట్ కాదన్న ఆలోచనతో కొత్త ప్లాన్స్ వేస్తున్నాడు బోయపాటి. ఈ సినిమాలో ఓ లెంగ్తీ గెస్ట్ రోల్లో ఓ స్టార్ హీరోను నటింప చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సినిమాకే హైలెట్ కానున్న ఈ పాత్ర బిజినెస్ పరంగా కూడా సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా కోసం బోయపాటి శ్రీను చేస్తున్న ప్లాన్స్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. -
'నా పూర్తి సామర్థ్యాన్ని ఇంత వరకూ చూపించలేదు'
సరైనోడు సినిమా సక్సెస్‌తో ఆనందంగా ఉన్న అల్లు అర్జున్, తన భవిష్యత్ ప్రణాలికను మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న స్టైలిష్ స్టార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తెలియజేశాడు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు తనలోని పూర్తి స్థాయి నటనను ప్రదర్శించే అవకాశమే రాలేదంటూ కామెంట్ చేశాడు బన్నీ. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి మరెన్నో కొత్త తరహా పాత్రలు, కొత్త తరహా కథల్లో నటించాలని తెలిపాడు. అంతేకాదు సినిమా మార్కెట్ పరంగా మరింత అభివృద్ధి చెందాలంటే మల్టీ లింగ్యువల్ సినిమాలు తెరకెక్కాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపాడు. ప్రస్తుతం బన్నీ కూడా బైలింగ్యువల్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే మాలీవుడ్‌లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్, ప్రస్తుతం కోలీవుడ్ మీద దృష్టి పెట్టాడు. అందుకే తమిళ దర్శకులతో పనిచేయటంతో పాటు తన నెక్ట్స్ సినిమాలను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా మార్కెట్ చాలా పెరిగిందన్న అల్లు అర్జున్, సరైనోడు సినిమాతో తన కోరిక నేరవేరిందని ఆనందం వ్యక్తం చేశాడు. టాలీవుడ్ హైయ్యస్ట్ గ్రాసర్స్ లిస్ట్‌లో తన సినిమా తొలి ఐదు స్ధానాల్లో ఉండాలని కోరుకునే వాణ్ని, సరైనోడు వంద కోట్ల వసూళ్లు సాధించటంతో తన కోరిక నెరవేరిందన్నాడు. అంతేకాదు ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన వారికి కూడా తన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. రివ్యూ రాసే వారు చాలా తెలివైన వారు, వారికి నచ్చే సినిమా తీయటం చాలా కష్టం అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం బైలింగ్యువల్ సినిమాల మీద దృష్టి పెడుతున్న బన్నీ, తమిళ దర్శకుడు లింగుసామి డైరెక్షన్లోయాక్షన్ డ్రామా చేయడానికి ఓకె చెప్పాడు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. తాజాగా 24 సినిమాతో సంచలనం సృష్టించిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో మెడికల్ థ్రిల్లర్‌లో నటించనున్నట్లుగా తెలిపాడు. -
నెక్ట్స్ సినిమా అల్లుడు శీనుతో..?
సరైనోడు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన బోయపాటి శ్రీను, తన నెక్ట్స్ సినిమాను కన్ఫామ్ చేశాడు. అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. స్పీడున్నోడు సినిమా రిలీజ్‌కు ముందే బోయపాటి సినిమా పట్టాలెక్కాల్సి ఉన్నా, అది వర్క్ అవుట్ కాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా బోయపాటి రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా ఉంటుదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు మాస్ యాక్షన్ సినిమాలను మాత్రమే తెరకెక్కించిన బోయపాటి ఈ సినిమాను సాఫ్ట్ లవ్ స్టోరిగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట. బోయపాటి సినిమా అంటే భయానకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయన్న ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ నుంచి బయట పడటానికి సాయితో తెరకెక్కించే సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు. -
బెజవాడలో సరైనోడు..
విజయవాడ: ‘సరైనోడు’ చిత్ర టీమ్ విజయవాడలో సందడి చేసింది. మూవీ సక్సెస్ మీట్ బుధవారం రాత్రి సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో జరిగింది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్లు రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ థ్రెస్సా, నటుడు ఆది, దర్శకుడు బోయపాటి శ్రీను, అల్లు అరవింద్ స్టెప్పులేసి జనాలను ఆలరించారు. తారల సందడి, అభిమానుల ఆనందోత్సవాలతో ప్రాగంణం హోరెత్తింది. -
4రోజుల్లో రూ.50 కోట్లు రాబట్టిన సరైనోడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'సరైనోడు' సూపర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంది. నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సినిమాపై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అది వసూళ్లపై ప్రభావం చూపలేదు. బన్నీ పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటించిన ఈ సినిమా ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. దుమ్ము రేపుతూ దూసుకెళ్తున్న 'సరైనోడు' కలెక్షన్లతో బన్నీ రికార్డు సృష్టిస్తున్నాడు. బన్ని నటించిన రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు రూ.50 కోట్ల మార్కును దాటేశాయి. అయితే ఈ సారి బన్ని సినిమా నాలుగు రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్లు రాబట్టడం టాలీవుడ్లో విశేషం. కాగా తమిళంలో హీరోగా మంచి గుర్తింపు ఉన్న ఆది పినిశెట్టి తొలిసారి తెలుగులో విలన్‌గా కనిపించాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిసాలు ఈ సినిమాలో హీరోయిన్లుగా మెరిశారు. సోమవారం ఈ చిత్ర సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. -
బన్నీ ఈజ్ వెరీ సన్నీ
కొత్త సినిమా గురూ! చిత్రం: సరైనోడు తారాగణం: అల్లు అర్జున్, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ థెరిస్సా, ఆది పినిశెట్టి, సాయికుమార్ సంగీతం: ఎస్.ఎస్.తమన్ నిర్మాత: అల్లు అరవింద్ కథ-స్క్రీన్‌ప్లే -దర్శకత్వం: బోయపాటి శ్రీను హీరో బన్నీ తన కెరీర్లో చేసిన 16 సినిమాల్లో దాదాపు 8 సినిమాలు సమ్మర్‌కి సందడి చేసినవే. హీటెక్కిన తాజా సమ్మర్కొచ్చిన హాట్ హాట్ సూరీడు... ‘సరైనోడు’. కథేమిటంటే... గణ (అల్లు అర్జున్) మిలటరీలో కొన్నాళ్లు పనిచేసిన సైనికుడు. ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఉమాపతి కొడుకు. కోర్టులో కేసులు గెలవ డని ముద్ర పడిన శ్రీపతి (శ్రీకాంత్) అతని బాబాయ్. తన బాబాయ్ కోర్టులో న్యాయం చేయలేని కేసులన్నింటికీ బయట న్యాయం చేస్తుంటాడు గణ. కట్ చేస్తే, పర్ణశాల అనే గ్రామంలో ఆయిల్ రిఫైనరీలను స్థాపించాలని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి కొడుకు వైరమ్ ధనుష్(ఆది పినిశెట్టి) ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుం టాడు. ఈ క్రమంలో ఎన్నో దుర్మార్గాలకు ఒడిగడతాడు. భూములివ్వని రైతులను చంపేస్తాడు కూడా. అతనికి ఎదురొడ్డి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఐఏఎస్ జయప్రకాశ్ (సాయికుమార్) పోరాటం సాగిస్తూ ఉంటాడు. ఉమాపతి, జయ ప్రకాశ్ స్నేహితులు. కళ్లెదుట అన్యాయం జరిగితే ఊరుకోని గణ తన తండ్రి స్నేహితుడి కోసం, అతని కూతురు మహాలక్ష్మి (రకుల్ ప్రీత్‌సింగ్) కోసం ముఖ్యమంత్రి కొడుకుతో కయ్యానికి కాలు దువ్వు తాడు. ప్రభుత్వం అండదండలతో దేనికీ వెనుకాడని వైరమ్ ధనుష్‌పై తన తెలివితేటలతో ఎలా యుద్ధం చేశాడనేది మిగతా కథ. ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో కనిపించిన బన్నీ వేరు. ఇందులో కనిపించిన బన్నీ వేరు. స్టయిలిష్‌గా, ఊర మాస్‌గానూ చూపించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. బన్నీ కండలు తిరిగిన దేహం బాగుంది. తనదైన డ్యాన్సులతో, నటనతో బన్నీ ఆకట్టుకుంటారు. యాక్షన్ సన్ని వేశాల్లో కొన్ని చోట్ల ఇచ్చిన సీరి యస్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. తమిళనాట మంచి హీరోగా పేరొందిన ఆది పినిశెట్టి ఇటీవల ‘మలుపు’తో మంచి సక్సెస్ అందుకున్న ఆది విలన్‌గా కొత్త ప్రయత్నమే చేశారు. ఓ పాట, తర్వాత కామెడీ, ఆ తర్వాత ఓ ఫైట్- ఇలా పక్కా మాస్ సూత్రాలను ఫాలో అయ్యారు బోయపాటి. ప్రథమార్ధం ఫన్నీగా, లవ్ సీన్స్‌తో, రెండు ఫైట్స్‌తో గడిచిపోతే, అసలు కథ మాత్రం ద్వితీ యార్థంలో మొదలవుతుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు బోయపాటి గత చిత్రాలను కాస్త గుర్తు చేస్తాయి. అయితే, బిగువైన స్క్రీన్‌ప్లేతో మేనేజ్ చేసేశారు. తమన్ పాటల కన్నా నేపథ్య సంగీతం సినిమాను ఎలివేట్ చేసింది. ‘సరైనోడు’ అని టైటిల్ పెట్టారు కాబట్టి, హీరో ఎలివేషన్ మీద బాగా దృష్టి పెట్టిన వైనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. మొత్తానికి, ఇది బోయపాటి మార్క్ ‘సరైనోడు’ అని చెప్పొచ్చు. -
'సరైనోడు' రివ్యూ
జానర్ : యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు : అల్లు అర్జున్, ఆది పినిశెట్టి, శ్రీకాంత్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా తదితరులు కథ, దర్శకత్వం : బోయపాటి శ్రీను సంగీతం : ఎస్.ఎస్.థమన్ నిర్మాత : అల్లు అరవింద్ వేసవిలో స్కూళ్లకు సెలవులు, హాళ్లకు సినిమాలు విరివిగా దొరికేస్తాయి. అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాలు ఆడాయా లేదా అన్నదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. సినిమా సినిమాకి వైవిధ్యంగా కనిపించాలని తాపత్రయపడే యువ కధానాయకుల్లో అల్లు అర్జున్ ముందుంటాడు. ఈ సారి పూర్తిస్థాయి 'మాస్' క్యారెక్టర్లో 'సరైనోడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'లెజెండ్'లాంటి హిట్ సినిమా తర్వాత రెండేళ్లు విరామం తీసుకుని బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా 'సరైనోడు'. ఒకరు స్టైలిష్ స్టార్.. మరొకరు మాస్ మాస్టర్.. వీళ్లిద్దరి టార్గెట్.. బ్లాక్ బస్టర్. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.. కథేంటంటే.. గణ (అల్లు అర్జున్) ఆర్మీ ఆఫీసర్. కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే రకం కాదు. ఫలితంగా ఊర మాస్‌గా తయారవుతాడు. దివ్య (కేథరీన్) ముఖ్యమంత్రి కూతురు. తండ్రి హత్య అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. ఎమ్మెల్యే దివ్యను ప్రేమిస్తాడు గణ. ఆమె కూడా గణను ఇష్టపడుతుంది. పెళ్లికి ఇరు కుటుంబాల ఆమోదం లభిస్తుంది. అయితే ఈ పెళ్లి జరగాలంటే తనకో ప్రామిస్ చేయాలంటూ షరతు పెడుతుంది దివ్య. ఇక మీదట ఎలాంటి గొడవలకు వెళ్లనని ఒట్టేస్తే తప్ప పెళ్లికి ఒప్పుకునేది లేదంటుంది. ఆమెకు ప్రామిస్ చేస్తున్న సమయంలోనే మరో సమస్య మహాలక్ష్మి(రకుల్ ప్రీత్ సింగ్) రూపంలో అక్కడికి వస్తుంది. మహాలక్ష్మి ఓ పల్లెటూరికి చెందిన యువతి. ధనుష్(ఆది పినిశెట్టి) తండ్రిని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతూ చెడు పనులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాడు. అసలు మహాలక్ష్మికి, ధనుష్‌కి ఉన్న సంబంధం ఏమిటి? ధనుష్ మహాలక్ష్మిని ఎందుకు తరుముతుంటాడు? మహాలక్ష్మి గణకి ముందే తెలుసా? ఆమెను కాపాడే దశలో ధనుష్‌తో వైరానికి దిగిన గణ ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటాడనేదే మిగిలిన కథ. ఎవరెలా... అల్లు అర్జున్ ట్రైలర్లో చెప్పినట్టే ఊర మాస్‌గా కనిపించాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫిదానే. తెలుగు సినిమాలో తొలిసారి విలన్‌గా కనిపించిన ఆది పినిశెట్టి మంచి మార్కులు కొట్టేశాడు. బలమైన ప్రత్యర్థిగా హీరోకి గట్టి పోటీ ఇచ్చాడు. ఇక కేథరీన్, రకుల్‌లు ప్రేక్షకుల కళ్లకి అందమైన వినోదాన్ని వంద శాతం అందించారు. 'బ్లాక్ బస్టర్' పాటలో తళుక్కుమన్న అంజలి తన పరిధి మేరకు న్యాయం చేసింది. ఇక శ్రీకాంత్, సాయి కుమార్ తదితరులు అలవాటైన పాత్రల్లో ఒదిగిపోయారు. థమన్ సంగీతంలో కొన్ని పాటలకే ఓట్లు పడ్డాయి. కోరుకున్నంత కామెడీ కష్టమే. లొకేషన్లు, కొటేషన్లు (డైలాగులు) భారీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పక్కా బోయపాటి మార్క్ సినిమా. భారీ బిల్డప్, బీభత్సమైన యాక్షన్ సీన్లు, అల్లు అర్జున్ అల్లాడించిన డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటాయి. పాత కథే అయినా.. కొత్త హీరో.. క్రేజీ కాంబినేషన్. ఓవరాల్‌గా 'సరైనోడు' మాస్‌కి నచ్చేస్తాడు. -
‘సరైనోడు’ బ్లాక్ టికెట్లు: వ్యక్తి అరెస్ట్
కీసర(రంగారెడ్డి): స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పవర్ఫుల్ డెరైక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమా శుక్రవారం విడుదలైంది. మొదటి ఆట నుంచే సినిమా చూడాలని అభిమానులు ఎగబడుతుండటంతో.. టిక్కట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా భావించిన కొందరు బ్లాక్ టికెట్ల అమ్మకం మొదలు పెట్టారు. ఒక్కో టికెట్ రూ. 500కు అమ్ముతుండటంతో.. ప్రేక్షకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు బ్లాక్ టికెట్లు అమ్ముతున్న నాగరాజు అనే యువకుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కొంత నగదుతో పాటు 9 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలోని కృష్ణా థియేటర్లో శుక్రవారం చోటుచేసుకుంది. -
అతడే నాకు 'సరైనోడు'
హైదరాబాద్: అందాల తార రకుల్ ప్రీత్‌సింగ్ బుధవారం బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని రేడియో సిటీలో సందడి చేసింది. తాజాగా తాను నటించిన సరైనోడు చిత్ర విశేషాలను శ్రోతలతో పంచుకుంది. సినిమాలో తన పాత్ర, అర్జున్ అద్భుత నటన గురించి వివరించింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా సంభాషించింది. ఆ విశేషాలు రకుల్ మాటల్లోనే.. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. రంజాన్ టైమ్‌లో చార్మినార్ దగ్గర దొరికే హలీం అంటే ఇంకా ఇష్టం. నాకు హైదరాబాద్ లైఫ్‌నిచ్చింది. విదేశాల్లో షూటింగ్ చేసేటప్పుడు హైదరాబాద్‌ను మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. నా జీవితంలో ఇంత వరకు సరైనోడు తగల్లేదు. నేను నాలుగు ఇంచెస్ హీల్ వేసుకున్నా నాకన్నా అతడు హైట్ ఉండాలి. అంతేకాకుండా మంచి హ్యూమన్ బీయింగ్ ఉండాలి. అతడే నాకు సరైనోడు.. అని పేర్కొంది. తాను హైదరాబాద్‌లో ఇల్లు కొన్నానని, త్వరలోనే గృహ ప్రవేశం ఉంటుందని చెప్పింది. తన మొదటి చిత్రం నుంచి చివరి సినిమా వరకు ఏం నేర్చుకున్నానన్నదే తన అచీవ్‌మెంట్‌గా భావిస్తానంది. హిందీలో సరైనోడు సినిమా తీస్తే రణవీర్ సింగ్ హీరోగా ఉండి, తాను హీరోయిన్గా ఉండాలని కోరుకుంటానంది రకుల్ ప్రీత్‌సింగ్. -
‘సరైనోడు’మూవీ స్టిల్స్
-
నాకు ఏ హీరో ఇల్లు కొనివ్వలేదు..
‘బాధలు వస్తాయి. పోతాయి. మనసును మాత్రం ఒంటరిని చేయకండి’ అని రకుల్‌ప్రీత్ అన్నారు. ఆమె నటించిన ‘సరైనోడు’ ఈ శుక్రవారం రిలీజ్ కానున్నవేళ విలేకరుల ముందు ఆమె తన మనసు విప్పారు. రూమర్లు, ఆత్మ హత్యలు, అమ్మాయిల కష్టాలు - ఇలా ఎన్నిటి గురించో చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు తెలుగులో ఓ టాప్ హీరోయిన్. లేటెస్ట్గా హైదరాబాద్‌లో ఇల్లు కూడా కొనుకుని సెటిలైపోయారు. అయితే అక్కడే వచ్చిందో చిక్కు. ఇక గాసిప్ రాయుళ్లు కుదురుగా ఉంటారా! రకుల్ కు ఓ హీరో ఈ ఇల్లు కొనిచ్చారని వార్త పుట్టించేశారు. అది ఆ నోటా ఈ నోటా పడి రకుల్ వరకూ వెళ్లాయి. అయితే ఇదంతా పూర్తిగా అబద్ధమని ఆమె ఖండించారు. ‘‘నా సంపాదనతో హైదరాబాద్‌లో ఓ కారు కొనుకున్నా. ఆ తర్వాత నేను కొన్న గొప్ప వస్తువు ఇల్లే. రూపాయి రూపాయి కూడబెట్టుకుని నా కష్టార్జితంతో సంపాదించిన ఈ ఇంటిని వేరెవెరో హీరో నాకు ఇచ్చారంటే బాధ అనిపించింది. ఇదే విషయం నాన్నకు చెబితే ‘ఇంకా నయం. ఆ ఇల్లు కొనేటప్పుడు నేను కూడా ఉన్నా. ఇలాంటివి పట్టించుకోవద్దు’ అని ధైర్యం చెప్పారు. పైగా, ఆ ఇల్లు కొనడానికి మా నాన్న గారు బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నారు. ఈ విషయం గురించి మరింత వివరంగా మా నాన్న గారే చెప్పాలేమో’’ అని రకుల్ అన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి, ‘చిన్నారి పెళ్ళికూతురు’ ఫేమ్ ప్రత్యూషా బెనర్జీ గురించి ప్రస్తావిస్తూ - ‘‘సినీరంగంలోని వెలుగుజిలుగులకు చాలామంది అలవాటు పడిపోతారు. ఒక్కసారిగా అవకాశాలు రాకపోతే డిప్రెషన్‌కు లోనవుతారు. నేను గనక డిప్రెషన్‌కు లోనయ్యే పరిస్థితిలో ఉంటే, నా చుట్టూ ఫ్రెండ్స్ ఉండేలా చూసుకుంటాను. లేకపోతే హాయిగా బౌలింగ్ ఆడడానికి వెళ్ళిపోతాను. నిరాశా నిస్పృహలు ఎక్కువగా అనిపిస్తే, అలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీని మిస్ కాకండి’’ అని రకుల్ సలహా ఇచ్చారు. సాయిధరమ్‌తేజ్‌తో చేయబోయే తదుపరి చిత్రం విషయంలో వస్తున్న వార్తల గురించి స్పందిస్తూ ‘‘కేవలం మెగాఫ్యామిలీ హీరో అనే కారణంగా సాయిధరమ్ తేజ్ సరసన చేయనున్న చిత్రం కోసం పారితోషికం తగ్గించుకున్నానని రాశారు. అసలు ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇక ఇలాంటి వాటిని పట్టించుకోవడం అనవసరం’’ అని తనపై వస్తున్న వదంతులపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇక రానున్న ‘సరైనోడు’లోని తన పాత్ర గురించి మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. కెరీర్లో మొదటిసారిగా చేసిన డీ-గ్లామరైజ్డ్ రోల్ ఇది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు నా లైఫ్‌కు కాస్త దగ్గరగా ఉన్నవే. కానీ ఈ పాత్ర గురించి నేను ఎప్పుడూ వినలేదు. చూడలేదు. అందుకే డబ్బింగ్ కూడా చెప్పలేదు’’అని వివరించారు. -
ఆ సీక్వెల్లో నటిస్తా!
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టెప్స్‌కు, తమన్ రాకింగ్ మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో ‘రేసుగుర్రం’ చెప్పేసింది. మరోసారి వీళ్లిద్దరి కాంబినేషలో రానున్న చిత్రం ‘సరైనోడు’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిస్సా ముఖ్య తారలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా స్వరకర్త తమన్ మాట్లాడుతూ-‘‘ ‘భద్ర’ సమయం నుంచి బోయపాటి శ్రీనుగారితో పరిచయం ఉంది. ఆ సినిమాకు నేను కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా చేశాను. ‘సరైనోడు’కి అడిగినప్పుడు బోయపాటి శ్రీనుగారికి తగ్గట్టుగా ట్యూన్స్ ఇవ్వగలనా అని ఆలోచించా. కానీ సినిమా స్టార్ట్ అయిన కొన్నాళ్లకే మంచి స్నేహితులమైపోయాం. బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా కోసం పనిచేశాను. బన్నీని అందరూ స్టయిలిష్ స్టార్ అంటూ ఉంటారు. అందుకే క్లాస్‌తో పాటు మాస్ ట్యూన్స్ కూడా ఉండేలా కేర్ తీసుకున్నా. నేనిప్పటివరకు బాణీలు స్వర పరిచిన సినిమాలన్నీ కమర్షియల్ ఎంటర్టైనర్లే. నాకు లవ్‌స్టోరీలు చేయాలని ఉంది. అందుకే వీలున్న చోట మెలోడీ పాటలు ట్రై చేస్తుంటా’’ అన్నారు. గతంలో ‘బాయ్స్’లో నటించారు కదా.. మళ్లీ నటించే ఉద్దేశం ఉందా? అనే ప్రశ్నకు - ‘‘అవకాశాలు వస్తున్నాయి కానీ, ఒప్పుకోలేదు. త్వరలో ‘బాయ్స్-2’ చేద్దామనుకుంటున్నాం. స్క్రిప్ట్ చాలా బాగుంది’’ అని చెప్పారు. -
గంటాపై చంద్రబాబు గుర్రు
♦ చిరంజీవితో సన్నిహితంగా మెలగడంపై అసంతృప్తి ♦ ‘సరైనోడు’ ఆడియో ఫంక్షన్లో గంటా కీలకపాత్ర ♦ గంటా విదేశీ పర్యటనకూ చెక్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు , మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుల మధ్య రోజు రోజుకూ దూరం పెరుగుతోంది. ఈ మధ్యన గంటాపై చిర్రుబుర్రులాడుతున్న చంద్రబాబు, ఇటీవల ఆయన విదేశీ (అమెరికా) పర్యటనకు వెళ్లకుండా ఆర్థికశాఖ ద్వారా అడ్డుపడ్డారు. ఒకపక్క రాష్ట్ర మంత్రివర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న గంటా.. మరోపక్క కాంగ్రెస్ నేత కొణిదెల చిరంజీవికి సన్నిహితంగా మెలగటం వల్లే చంద్రబాబు, గంటాల మధ్య అంతరం పెరగడానికి కారణమని సమాచారం. గంటాకు ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల ఆయన మేనల్లుడు అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా గంటా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జన సమీకరణ వెనక గంటా ఉన్నారని సీఎంకు జిల్లా టీడీపీ నేతలు సమాచారం అందించారు. చిరుకు ఎందుకంత ప్రాధాన్యం: సీఎం చిరంజీవి దాదాపు రాజకీయంగా కనుమరుగవుతున్న తరుణంలో ఆయన కార్యక్రమానికి ఇంత భారీగా జనసమీరణ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలసి గంటా విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. దీనిపై ఆర్థిక శాఖ కొర్రీ వేసింది. సీఎం సూచనల మేరకు అలా జరిగిందనే చర్చ జరుగుతోంది. అంతకు ముందు మంత్రివర్గ సమావేశంలోనూ గంటాపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన సిఫారసు చేసే ఏ ఫైల్‌ను వెంటనే క్లియర్ చేయవద్దని తన కార్యాలయ అధికారులకు సీఎం చెప్పినట్లు సమాచారం. -
మాస్‌కి ఏప్రిల్.. క్లాస్‌కి మే
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్ సీజన్లో భారీ సినిమాలు వరుసగా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో స్టార్ హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే రిలీజ్ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టున్నారు మన దర్శక నిర్మాతలు. ఒక నెలలో పూర్తిగా మాస్ సినిమాలను రిలీజ్ చేసి తరువాత వరుసగా క్లాస్ సినిమాల రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్‌లో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్, టాక్ సంగతి ఎలా ఉన్నా.., ఈ సినిమా పూర్తిగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూనే తెరకెక్కించారు. ఇక మంచు వారబ్బాయి ఈడో రకం ఆడో రకం కూడా బోల్డ్ కాన్సెప్ట్‌తో యూత్, మాస్ ఆడియన్స్ కోసమే తెరకెక్కింది. రిలీజ్‌కు రెడీ అవుతున్న అల్లు అర్జున్ సరైనోడు ఊర మాస్ అంటూ ట్రైలర్లోనే కన్ఫామ్ చేసేశారు. ఇవేకాదు డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతున్న విజయ్ పోలీస్ కూడా మాస్ ఆడియన్స్‌కు కిక్ ఇచ్చే సినిమా అన్నటాక్ వినిపిస్తోంది. ఇలా ఏప్రిల్ నెలంతా మాస్ సినిమాలు మోత మొగిస్తున్నాయి. ఇక మే నెలల రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో పూర్తిగా క్లారిటీ లేకపోయినా అన్నీ క్లాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకు రానున్నాయి. డేట్ కన్ఫామ్ చేయకపోయినా మహేష్ బ్రహ్మోత్సవం మే లోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్లోనే ఓన్లీ ఫర్ క్లాస్ అని తేల్చేశారు. ఇక త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్లో వస్తున్న అ.. ఆ.. కూడా క్లాస్ ఎంటర్టైనర్లాగే కనిపిస్తోంది. డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతున్న సూర్య 24లో మాస్‌ను ఆకట్టుకునే యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా.. సైన్స్ ఫిక్షన్ సినిమా కావటంతో ఇది కూడా క్లాస్ ఆడియన్స్‌కే బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. -
విక్రమ్‌తో అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఓ ఇంట్రస్టింగ్ సినిమాకు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాను కంప్లీట్ చేసిన బన్నీ.. ఆ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రమోషన్‌ను కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమా ఏంటి అన్న విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంలో హ్యాట్రిక్ సాధించే దిశగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇష్క్, మనం సినిమాలతో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్, ప్రస్తుతం సూర్య హీరోగా 24 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తరువాత విక్రమ్, బన్నీ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలోఉన్నాడట. బన్నీ కూడా విక్రమ్‌తో సినిమాకు రెడీ గానే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. తన ప్రతీ సినిమా ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించే విక్రమ్ బన్నీతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. -
బన్నీకి పోటీ తప్పటం లేదు!
సరైనోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అల్లు అర్జున్‌కి రిలీజ్ విషయంలో మాత్రం టెన్షన్ తప్పేలా లేదు. ముందుగా ఈ సినిమా ఉగాది సందర్భంగా రిలీజ్ చేయాలని భావించినా, పవన్ కళ్యాణ్, సర్దార్ గబ్బర్‌సింగ్ ను అదే రోజు రిలీజ్ చేయాలని ఫిక్స్ అవ్వటంతో వెనక్కి తగ్గక తప్పలేదు. సర్దార్కి స్పేస్ ఇవ్వటం కోసం తన సినిమాను ఏకంగా రెండు వారాల పాటు వాయిదా వేశాడు బన్నీ. ఏప్రిల్ 22న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే తాజాగా మరో స్టార్ హీరోతో బన్నీకి పోటి తప్పేలా లేదు. సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్య హీరోగా 24 సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించినా అప్పటికి, సర్దార్ హవా ఇంకా కొనసాగుతుందనే ఆలోచనతో ఈ సినిమాను ఏప్రిల్ 22న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకు హిట్ టాక్ వస్తే రెండు వారాల తరువాత కూడా చాలా థియేటర్లలో కొనసాగే అవకాశం ఉంది. ఆ సమయంలో అల్లు అర్జున్, సూర్యల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్ల సమస్య వస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు కలెక్షన్ల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు విశ్లేషకులు. -
వైజాగ్‌లో వైభవంగా...
సెలైంట్ గా ‘సరైనోడు’ పాటలు మార్కెట్లోకి వచ్చేశాయ్. కానీ, అభిమానులే వేడుక చేసి ఉంటే బాగుండేదని అనుకున్నారు. ఆ కొరతను తీర్చేయనుంది ‘సరైనోడు’ చిత్రబృందం. ఈ నెల 10న అత్యంత భారీ ఎత్తున ఆడియో సెలబ్రేషన్స్ చేయనున్నారు. ఈ వేడుకను విశాఖపట్నంలో చేయడానికి సర్వ సన్నాహాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, క్యాథెరిన్ త్రెస్సా ముఖ్య తారలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఇక.. వైజాగ్‌లో జరగబోయే వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ వేడుక విశేషాలు తెలియజేయడానికి వైజాగ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ-‘‘కొత్త ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా షూటి ంగ్లు జరగాలని, ఇక్కడ కూడా పరిశ్రమ స్థిరపడాలని కోరకుంటున్నాను. ‘సరైనోడు’ ఫంక్షన్ ఘనంగా వైజాగ్‌లో చేస్తున్నందకు చిత్ర నిర్మాతకు ధన్యవాదాలు. సినిమా షూటింగ్స్‌కు ఇక్కడ సింగిల్ విండో పద్ధతిలో అనుమతి ఇస్తాం’’ అని అన్నారు. ‘‘బన్నీకి వైజాగ్‌తో మంచి అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అతి పెద్ద ఫంక్షన్ ఇది. బన్నీతో పాటు ముగ్గురు హీరోయిన్స్ హాజరు కానున్నారు. ఇంకా ఇతర యూనిట్ సభ్యులు పాల్గొంటారు. చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఈ షోలో పెర్ఫార్మ్ చేయనున్నాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. -
దమ్మున్నోడు!
అల్లు అర్జున్ మంచి మాస్ హీరో. క్యారెక్టర్లో కంటెంట్ ఉంటే నటుడిగా తన దమ్ము ఏంటో చూపిస్తారు. ఇక.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తీయడంలో తనకు తానే సాటి అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అంటే.. అల్లు అర్జున్‌లో కొత్త యాంగిల్ చూడనున్నామని ఫిక్స్ అయిపోవచ్చు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ, రకుల్‌ప్రీత్ సింగ్, క్యాథరిన్ కథానాయికలుగా బోయపాటి దర్శకత్వం వహించిన ‘సరైనోడు’ ఈ నెల 22న విడుదల కానుంది. ఎలాంటి హంగామా లేకుండా ఈ చిత్రం పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 10న విశాఖపట్నంలో అభిమానుల సమక్షంలో ప్రీ-రిలీజ్ వేడుకను అట్టహాసంగా జరపనున్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ- ‘‘ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌కు అనూహ్య స్పందన లభించింది. బన్నీని బోయపాటి సరికొత్తగా చూపించాడు. అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. బన్నీ, అంజలి మీద వచ్చే ప్రత్యేక గీతం హైలైట్‌గా నిలుస్తుంది. ఎస్.ఎస్. తమన్ మంచి పాటలు ఇచ్చాడు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: రిషి పంజాబీ, సహ నిర్మాత: శానం నాగ అశోక్ కుమార్. -
పాట కోసం 50 గంటల ప్రయాణం!
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ రకుల్ ప్రీత్‌సింగ్ కెరీర్‌కి మంచి మలుపు అయ్యింది. ఎక్స్‌ప్రెస్ వేగంతో ఆమె కెరీర్ దూసుకెళుతోంది. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ జాబితాలో ఉన్న ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో షూటింగ్స్ కోసం దేశ, విదేశాలు తిరుగుతున్నారు. దాంతో ప్రయాణాలు బాగా అలవాటై పోయాయి. కానీ, ఇప్పటివరకూ చేయనంత సుదీర్ఘ ప్రయాణం ఆమె చేశారు. అది ‘సరైనోడు’ సినిమా కోసం. అల్లు అర్జున్, రకుల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. ఆ పాటను సౌత్ అమెరికాలోని బొలీవియాలో గల ఉయుని నగరంలో చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉయుని చేరుకోవాలంటే దాదాపు 50 గంటలు పడుతుందట. ఆ విషయం గురించి రకుల్ ప్రస్తావిస్తూ - ‘‘50 గంటలైనా ఇంకా చేరుకోలేదు. ఈ సుదీర్ఘ ప్రయాణం మంచి అనుభూతినిస్తోంది. ఉయుని చాలా అందంగా ఉంటుంది. అంత అందమైన ప్రదేశం వెళ్లడం కోసం ఇన్ని గంటలు కష్టపడడం సబబే’’ అని మరికాసేపట్లో గమ్యం చేరుకుంటారనగా పేర్కొన్నారు. మొత్తానికి లాంగ్ జర్నీ చేసి, ఈ యూనిట్ ఆ తర్వాత ఉయుని చేరుకున్నారు. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా షూటింగ్ జరగని అద్భుత ప్రదేశమది. ఈ నెల 13 వరకూ పాట చిత్రీకరించి, చిత్రబృందం హైదరా బాద్‌కు తిరుగు ప్రయాణమవుతుంది. -
సరైనోడు టీజర్ వచ్చేస్తోంది!
సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ ఇప్పుడు చేస్తున్న సరైనోడు సినిమా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొన్నామధ్య ఈ సినిమా కోసం ఓ పాట పాడిన అల్లు అర్జున్.. ఇప్పుడు తాజాగా సినిమా టీజర్ తేదీని ప్రకటించాడు. ఈనెల 18వ తేదీ.. అంటే గురువారం నాడు 'సరైనోడు' టీజర్ వస్తుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సరైనోడు సినిమాను అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ స్వరాలు అందించాడు. SARRAINODU Teaser on 18th Feb ! pic.twitter.com/MWBnEMTAyK — Allu Arjun (@alluarjun) February 15, 2016 -
బన్నీ కూడా ఆ పని చేస్తున్నాడు
ఇటీవల కాలంలో మన హీరోలు కేవలం యాక్టింగ్‌తోనే సరిపెట్టేయంలేదు. తమ అభిమానులను అలరించడానికి అప్పుడప్పుడు గాయకులుగా కూడా మారిపోతున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్లు గళాలు సవరించుకోగా, తాజాగా ఆ లిస్ట్‌లో మరో యంగ్ హీరో చేరబోతున్నాడు. ఇప్పటి వరకు తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న బన్నీ, త్వరలో సింగర్‌గా కూడా మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బన్నీ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం అల్లు అర్జున్ గొంతు కలుపుతున్నాడట. బన్నీ కోసం సూపర్ ట్యూన్‌ను సిద్ధం చేసిన సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే ఆ పాటను రికార్డ్ కూడా చేశాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఆడియో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు నటుడిగా మెప్పించిన బన్నీ, గాయకుడిగా ఎన్ని మార్కులు సాధిస్తాడో చూడాలి. -
సౌత్‌లో ఆ ఘనత సాధించిన తొలి నటుడు
యంగ్ హీరో అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, మాలీవుడ్లలోనూ అభిమానులను సంపాదించుకున్న ఈ యంగ్ హీరో సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నాడు. ఫేస్బుక్లో రజనీ, కమల్ లాంటి నేషనల్ స్టార్స్‌కు కూడా అందని కోటి లైక్స్ సాధించి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు బన్నీ. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి వరుస సూపర్ హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న బన్నీ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సమ్మర్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న సరైనోడు బన్నీ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
సమ్మర్ సినిమాల బిజినెస్ జోరు
బాహుబలి సినిమా రిలీజ్ తరువాత టాలీవుడ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు 50 కోట్ల కలెక్షన్లు కూడా కష్టంగా కనిపించిన ఇండస్ట్రీలో ఇప్పుడు 100 కోట్లు కూడా సాధ్యమే అని ప్రూవ్ అయ్యింది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు వసూళ్ల సునామీ సృష్టిస్తుండటంతో రాబోయే సినిమాలకు కూడా భారీ బిజినెస్ జరుగుతోంది. ఈ వేసవిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న భారీ చిత్రాలకు ఇప్పటికే బిజినెస్ స్టార్ట్ అయిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ లిస్ట్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందే ఉన్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న పవన్, ఇప్పటికే 90 కోట్లకు పైగా బిజినెస్ చేసేశాడన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవానికి కూడా ఇదే స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. సన్నాఫ్ సత్యమూర్తి తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాతో వస్తున్న అల్లు అర్జున్ కూడా ఇప్పటికే 70 కోట్ల వరకు బిజినెస్‌ను పూర్తిచేశాడు. ఇక ఇంతవరకు షూటింగ్ కూడా మొదలుకాక ముందే ఎన్టీఆర్, కొరటాల శివల జనతా గ్యారేజ్‌కు కూడా బిజినెస్ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. ఈ జోరు చూస్తుంటే ఈ సమ్మర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు రెండు, మూడు వందల కోట్ల రూపాయల విలువైన సినిమాలు సందడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది. -
బన్నీ.. పెద్ద ప్లానే వేస్తున్నాడు
సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ ఇప్పడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ సినిమాతో తన మార్కెట్ రేంజ్‌ను కూడా భారీగా పెంచుకోవాలని స్కెచ్ వేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే కథా కథనాలతో పాటు దర్శకులను కూడా ఎంచుకుంటున్నాడు. సరైనోడు సినిమా తరువాత మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. విక్రమ్‌కు తెలుగుతో పాటు తమిళ్లో కూడా మంచి మార్కెట్ ఉండటం, ప్రస్తుతం సూర్య హీరోగా 24 సినిమాను రూపొందిస్తుండటంతో ఈ సినిమాను తమిళ్లో కూడా రిలీజ్ చేసి భారీగా కలెక్షన్లు సాధించవచ్చని భావిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా అదే ఫార్ములాను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. తెలుగులో కూడా మంచి విజయం సాధించిన పందెంకోడి, ఆవారా సినిమాల దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడు. ఈసినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి తెరకెక్కించి కోలీవుడ్‌లో కూడా పాగా వేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి బన్నీ ప్లాన్స్ ఎంత వరకు వర్కవుట్ అవుతాయో చూడాలి. -
మామ, అల్లుళ్ల సవాల్
సంక్రాంతికి బాబాయ్, అబ్బాయ్‌లు బరిలో దిగగా, సమ్మర్లో కూడా ఇలాంటి రసవత్తర పోటీకి రెడీ అవుతోంది తెలుగు వెండితెర. పండగ పూట బాలకృష్ణ, ఎన్టీఆర్‌లు ఢీ అంటే ఢీ అన్నారు. అదే జోరులో వేసవి సెలవులకు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లు తలపడటానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు దాదాపు పూర్తి కావచ్చాయి. దీంతో నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఒకే సమయంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలో నటిస్తున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత బన్నీ కూడా గ్యాప్ తీసుకొని బోయపాటి దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లు కావటంతో ఎవరిది పైచేయి అవుతుందో, అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
పబ్లిసిటీలో... తెలివైనోడు!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా శరవేగంతో షూటింగ్ జరుపుకొంటోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై తయారవుతున్న ఈ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ఇప్పటి దాకా ప్రకటించలేదు కానీ, టైటిల్ ‘సరైనోడు’ అని ఇప్పటికే మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయనున్నారు. విచిత్రం ఏమిటంటే, ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు కూడా ఒక టీజర్ లాగా ‘ప్రీ-లుక్’ పోస్టర్‌ను అల్లు అర్జున్ అధికారికంగా సోషల్ మీడియాలో పెట్టారు. రకుల్‌ప్రీత్ సింగ్, కేథరిన్ త్రెసా ఈ చిత్రంలో కథానాయికలు. మరో హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ సాంగ్‌లో నర్తిస్తున్నారు. తమిళంలో హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగబ్బాయి ఆది పినిశెట్టి (ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు) ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర ధరిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. గతంలో బోయపాటి రూపొందించిన మాస్ మసాలా చిత్రాల లానే ఈ సినిమా కూడా మాస్ సైలిలో ఉంటుందని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ ప్రీ-లుక్ కూడా చేతిలో పెద్ద ఇనుప గుండు లాంటిది పట్టుకొని, అల్లు అర్జున్ కనిపించీ కనిపించకుండా ఉన్నారు. మొత్తం లుక్, టైటిల్ లోగో చూడాలంటే రిపబ్లిక్ డే దాకా వేచి ఉండాల్సిందే. మొత్తానికి, సోషల్ మీడియా పుణ్యమా అని టైటిల్ లోగోలు, ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్ల లాంటివి పాపులరైతే, కొత్తగా ఈసారి ఫస్ట్‌లుక్‌కు టీజర్‌గా ‘ప్రీ-లుక్’ విడుదల చేయడం పబ్లిసిటీ వ్యూహంలో భాగమే. వెరసి, ఫ్రీ పబ్లిసిటీలో మనోళ్ళు ‘తెలివైనవాళ్ళే’. -
అల్లు అర్జున్ 'సరైనోడు' ప్రీ లుక్ పోస్టర్
ఇప్పటి వరకు ఆడియో రిలీజ్ పోస్టర్స్, సినిమా రిలీజ్ పోస్టర్స్ మాత్రమే వచ్చేవి.., కాని అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో మరో కొత్త సాంప్రదాయానికి తెర తీశాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఆ సినిమా ప్రీలుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత బన్నీ చేస్తున్న సరైనోడు సినిమా పై భారీ అంఛనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ మరింత ఆసక్తి రేకెత్తించేలా ప్రమోషన్‌ను ప్రారంభించింది. పోస్టర్లో ఫేస్ చూపించకపోయినా అది బన్నీ చెయ్యి అని అర్థమయ్యేలా ప్రీ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి దర్శకుడు బోయపాటి శ్రీను, ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. -
అల్లు అర్జున్ డేట్ ఫిక్స్ చేశాడు
సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజలవుతున్నా ఇప్పటి వరకు సినిమాకు సంబందించిన ఒక్క స్టిల్ కూడా బయటి రాలేదు. దీంతో అభిమానులు చాలా రోజులుగా సరైనోడు ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. బన్నీ ఫుల్ మాస్ క్యారెక్టర్ చేసి చాలా కాలం అవుతుండటంతో ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్‌ను కూడా అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు. దీంతో ఈ సంక్రాంతికి టైటిల్‌తో పాటు బన్నీ లుక్‌ను కూడా రిలీజ్ చేయాలని భావించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో వీలైనంత త్వరగా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. సంక్రాంతి సీజన్ మిస్ కావటంతో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఆది పినిశెట్టిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా కాలం తరువాత బన్నీ తన సొంతం నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్లో నటిస్తుండటం కూడా సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
అందుకే అంజలిని తీసుకున్నారట..!
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్, ఆ సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్ సెట్ చేస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిస్సాలతో గ్లామరస్‌గా కనిపిస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు మరో స్పెషల్ ఎట్రాక్షన్ యాడ్ అయ్యింది. చాలా రోజులుగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ విషయంలో టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. బన్నీ పక్కనే డ్యాన్స్ చేయడానికి, స్టార్ హీరోయిన్ కోసం వెదుకుతున్నారు చిత్రయూనిట్. అనుష్క, ఇళియానా లాంటి స్టార్ల పేర్లు వినిపించాయి. తరువాత లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిశ పటాని బన్ని సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందన్న టాక్ వినిపించింది. అయితే ఇవన్ని కాదని ఓ తెలుగింటి అమ్మాయిని స్పెషల్ సాంగ్‌కు ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు బోయపాటి. డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకుంటున్న అంజలి సరైనోడు సినిమాలో బన్నీతో కలిసి చిందేయడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది అంజలి. అంతేకాదు తననే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవటం వెనుక ఉన్న కారణం కూడా చెప్పింది. శంకరాభరణం సినిమాలో అంజలి చేసిన మాస్ క్యారెక్టర్, ఆ సినిమాలో ఆమె చేసిన 'ఘంటా..' పాటలో తన డ్యాన్స్ చూసిన బోయపాటి బన్ని సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సెలెక్ట్ చేసుకున్నాడని చెపుతోంది ఈ బ్యూటీ -
దిశాకి 'సరైనోడు' దొరికాడు
-
దిశాకి 'సరైనోడు' దొరికాడు
లోఫర్ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశాపటాని. తొలి సినిమాతో భారీ హిట్ సాధించలేకపోయినా తన గ్లామర్‌తో మంచి మార్కులే సాధించింది. దీంతో వరుస అవకాశాలతో బిజీ అయిపోతుందని భావించారు అంతా.. కానీ అనుకున్నట్టుగా అమ్మడికి అవకాశాలు తలుపు తట్టలేదు. లోఫర్ తరువాత ఇంతవరకు ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వని దిశా.. తాజాగా ఓ స్టార్ హీరోతో ఐటమ్ సాంగ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్.., బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలోనటిస్తున్నాడు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం దిశా పటానిని సంప్రదించారట. గతంలో ఈ పాటను అంజలి, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లతో చేయించాలని ప్లాన్ చేసినా, గ్లామర్ పాళ్లు మరింతగా ఉండాలనే ఉద్దేశంతో దిశాకే ఓటేశారు చిత్రయూనిట్. స్పెషల్ సాంగ్‌లో నటించడానికి దిశా కూడా ఓకె చెప్పేయటంతో త్వరలోనే ఈ పాట షూట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు సరైనోడు యూనిట్. -
అభిమానిని పరామర్శించిన అల్లు అర్జున్
-
అభిమానిని పరామర్శించిన అల్లు అర్జున్
యంగ్ హీరో అల్లు అర్జున్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇటీవల చెన్నై వరదల నేపథ్యంలో భారీ విరాళం అందించిన బన్నీ.. ఇప్పుడు క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమానిని పరామర్శించాడు. విజయవాడ సింగ్‌నగర్‌లో ఉంటున్న మస్తాన్ బీ 50 ఏళ్లుగా అల్లు రామలింగయ్య అభిమాని. తరువాత అదే కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్ను అభిమానిస్తోంది. ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధపడుతున్న మస్తాన్ బీ ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి తన అభిమాన నటుణ్ని ఒక్కసారి ప్రత్యక్షంగా కలవాలని ప్రయత్నిస్తోంది. విషయం తెలుసుకున్న బన్నీ మంగళవారం ఉదయం విజయవాడ వెళ్లి మస్తాన్ బీని కలిసి పరామర్శించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలోనటిస్తున్న బన్నీ, షూటింగ్ కు కాస్త గ్యాప్ రావటంతో స్వయంగా విజయవాడ వెళ్లి మస్తాన్ బీని కలిసి పరామర్శించటంతో పాటు ఆమె కుటుంబసభ్యులతో కొద్ది సేపు గడిపారు. గతంలో కూడా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇలా అనారోగ్యంతో ఉన్న అభిమానులను కలిసి వారికి మనోధైర్యం ఇచ్చారు. -
బన్నీతో స్వీటీ
అనుష్క లీడ్ రోల్లో నటించిన రుద్రమదేవి సినిమా సక్సెస్‌లో అల్లు అర్జున్ నటించిన గోన గన్నారెడ్డి పాత్ర కీ రోల్ ప్లే చేసింది. సినిమా ప్రమోషన్‌తో పాటు మాస్ ఆడియన్స్‌కు సినిమాను చేరువ చేయటంలో బన్నీదే కీలక పాత్ర. అందుకే అల్లు అర్జున్ చేసిన సాయానికి బదులుగా అనుష్క కూడా బన్నీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన చిత్రయూనిట్ అనుష్కతో ఆ సాంగ్ చేయించాలని భావిస్తున్నారట. ఇప్పటికే వేదం, రుద్రమదేవి సినిమాల్లో కలిసి నటించిన బన్నీ, అనుష్క ఒక్క సాంగ్ లో కూడా కలిసి ఆడిపాడలేదు. యోగా బ్యూటీ బన్నీతో కలిసి డ్యాన్స్ చేస్తే సినిమాకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. గీతా ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్, ఆది ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను 2016 సమ్మర్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు