నాకు ఏ హీరో ఇల్లు కొనివ్వలేదు..
‘బాధలు వస్తాయి. పోతాయి. మనసును మాత్రం ఒంటరిని చేయకండి’ అని రకుల్‌ప్రీత్ అన్నారు. ఆమె నటించిన ‘సరైనోడు’ ఈ శుక్రవారం రిలీజ్ కానున్నవేళ విలేకరుల ముందు ఆమె తన మనసు విప్పారు. రూమర్లు, ఆత్మ హత్యలు, అమ్మాయిల కష్టాలు - ఇలా ఎన్నిటి గురించో చెప్పారు.
రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు తెలుగులో ఓ టాప్ హీరోయిన్. లేటెస్ట్‌గా హైదరాబాద్‌లో ఇల్లు కూడా కొనుకుని సెటిలైపోయారు. అయితే అక్కడే వచ్చిందో చిక్కు. ఇక గాసిప్ రాయుళ్లు కుదురుగా ఉంటారా! రకుల్ కు ఓ హీరో ఈ ఇల్లు కొనిచ్చారని వార్త పుట్టించేశారు. అది ఆ నోటా ఈ నోటా పడి రకుల్ వరకూ వెళ్లాయి.
అయితే ఇదంతా పూర్తిగా అబద్ధమని ఆమె ఖండించారు. ‘‘నా సంపాదనతో హైదరాబాద్‌లో ఓ కారు కొనుకున్నా. ఆ తర్వాత నేను కొన్న గొప్ప వస్తువు ఇల్లే. రూపాయి రూపాయి కూడబెట్టుకుని నా కష్టార్జితంతో సంపాదించిన ఈ ఇంటిని వేరెవెరో హీరో నాకు ఇచ్చారంటే బాధ అనిపించింది. ఇదే విషయం నాన్నకు చెబితే ‘ఇంకా నయం. ఆ ఇల్లు కొనేటప్పుడు నేను కూడా ఉన్నా. ఇలాంటివి పట్టించుకోవద్దు’ అని ధైర్యం చెప్పారు. పైగా, ఆ ఇల్లు కొనడానికి మా నాన్న గారు బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నారు. ఈ విషయం గురించి మరింత వివరంగా మా నాన్న గారే చెప్పాలేమో’’ అని రకుల్ అన్నారు.
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి, ‘చిన్నారి పెళ్ళికూతురు’ ఫేమ్ ప్రత్యూషా బెనర్జీ గురించి ప్రస్తావిస్తూ - ‘‘సినీరంగంలోని వెలుగుజిలుగులకు చాలామంది అలవాటు పడిపోతారు. ఒక్కసారిగా అవకాశాలు రాకపోతే డిప్రెషన్‌కు లోనవుతారు. నేను గనక డిప్రెషన్‌కు లోనయ్యే పరిస్థితిలో ఉంటే, నా చుట్టూ ఫ్రెండ్స్ ఉండేలా చూసుకుంటాను. లేకపోతే హాయిగా బౌలింగ్ ఆడడానికి వెళ్ళిపోతాను. నిరాశా నిస్పృహలు ఎక్కువగా అనిపిస్తే, అలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీని మిస్ కాకండి’’ అని రకుల్ సలహా ఇచ్చారు.
సాయిధరమ్‌తేజ్‌తో చేయబోయే తదుపరి చిత్రం విషయంలో వస్తున్న వార్తల గురించి స్పందిస్తూ ‘‘కేవలం మెగాఫ్యామిలీ హీరో అనే కారణంగా సాయిధరమ్ తేజ్ సరసన చేయనున్న చిత్రం కోసం పారితోషికం తగ్గించుకున్నానని రాశారు. అసలు ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇక ఇలాంటి వాటిని పట్టించుకోవడం అనవసరం’’ అని తనపై వస్తున్న వదంతులపై ఓ క్లారిటీ ఇచ్చేశారు.
ఇక రానున్న ‘సరైనోడు’లోని తన పాత్ర గురించి మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. కెరీర్‌లో మొదటిసారిగా చేసిన డీ-గ్లామరైజ్‌డ్ రోల్ ఇది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు నా లైఫ్‌కు కాస్త దగ్గరగా ఉన్నవే. కానీ ఈ పాత్ర గురించి నేను ఎప్పుడూ వినలేదు. చూడలేదు. అందుకే డబ్బింగ్ కూడా చెప్పలేదు’’అని వివరించారు.