బన్నీ ఈజ్ వెరీ సన్నీ
కొత్త సినిమా గురూ!
చిత్రం: సరైనోడు
తారాగణం: అల్లు అర్జున్, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ థెరిస్సా, ఆది పినిశెట్టి, సాయికుమార్
సంగీతం: ఎస్.ఎస్.తమన్
నిర్మాత: అల్లు అరవింద్
కథ-స్క్రీన్‌ప్లే -దర్శకత్వం: బోయపాటి శ్రీను
హీరో బన్నీ తన కెరీర్‌లో చేసిన 16 సినిమాల్లో దాదాపు 8 సినిమాలు సమ్మర్‌కి సందడి చేసినవే. హీటెక్కిన తాజా సమ్మర్‌కొచ్చిన హాట్ హాట్ సూరీడు... ‘సరైనోడు’.
కథేమిటంటే... గణ (అల్లు అర్జున్) మిలటరీలో కొన్నాళ్లు పనిచేసిన సైనికుడు. ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఉమాపతి కొడుకు. కోర్టులో కేసులు గెలవ డని ముద్ర పడిన శ్రీపతి (శ్రీకాంత్) అతని బాబాయ్. తన బాబాయ్ కోర్టులో న్యాయం చేయలేని కేసులన్నింటికీ బయట న్యాయం చేస్తుంటాడు గణ. కట్ చేస్తే, పర్ణశాల అనే గ్రామంలో ఆయిల్ రిఫైనరీలను స్థాపించాలని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి కొడుకు వైరమ్ ధనుష్(ఆది పినిశెట్టి) ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుం టాడు.
ఈ క్రమంలో ఎన్నో దుర్మార్గాలకు ఒడిగడతాడు. భూములివ్వని రైతులను చంపేస్తాడు కూడా. అతనికి ఎదురొడ్డి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న ఐఏఎస్ జయప్రకాశ్ (సాయికుమార్) పోరాటం సాగిస్తూ ఉంటాడు. ఉమాపతి, జయ ప్రకాశ్ స్నేహితులు. కళ్లెదుట అన్యాయం జరిగితే ఊరుకోని గణ తన తండ్రి స్నేహితుడి కోసం, అతని కూతురు మహాలక్ష్మి (రకుల్ ప్రీత్‌సింగ్) కోసం ముఖ్యమంత్రి కొడుకుతో కయ్యానికి కాలు దువ్వు తాడు. ప్రభుత్వం అండదండలతో దేనికీ వెనుకాడని వైరమ్ ధనుష్‌పై తన తెలివితేటలతో ఎలా యుద్ధం చేశాడనేది మిగతా కథ.
ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో కనిపించిన బన్నీ వేరు. ఇందులో కనిపించిన బన్నీ వేరు. స్టయిలిష్‌గా, ఊర మాస్‌గానూ చూపించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. బన్నీ కండలు తిరిగిన దేహం బాగుంది. తనదైన డ్యాన్సులతో, నటనతో బన్నీ ఆకట్టుకుంటారు. యాక్షన్ సన్ని వేశాల్లో కొన్ని చోట్ల ఇచ్చిన సీరి యస్ ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. తమిళనాట మంచి హీరోగా పేరొందిన ఆది పినిశెట్టి ఇటీవల ‘మలుపు’తో మంచి సక్సెస్ అందుకున్న ఆది విలన్‌గా కొత్త ప్రయత్నమే చేశారు. ఓ పాట, తర్వాత కామెడీ, ఆ తర్వాత ఓ ఫైట్- ఇలా పక్కా మాస్ సూత్రాలను ఫాలో అయ్యారు బోయపాటి.
ప్రథమార్ధం ఫన్నీగా, లవ్ సీన్స్‌తో, రెండు ఫైట్స్‌తో గడిచిపోతే, అసలు కథ మాత్రం ద్వితీ యార్థంలో మొదలవుతుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు బోయపాటి గత చిత్రాలను కాస్త గుర్తు చేస్తాయి. అయితే, బిగువైన స్క్రీన్‌ప్లేతో మేనేజ్ చేసేశారు. తమన్ పాటల కన్నా నేపథ్య సంగీతం సినిమాను ఎలివేట్ చేసింది. ‘సరైనోడు’ అని టైటిల్ పెట్టారు కాబట్టి, హీరో ఎలివేషన్ మీద బాగా దృష్టి పెట్టిన వైనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. మొత్తానికి, ఇది బోయపాటి మార్క్ ‘సరైనోడు’ అని చెప్పొచ్చు.