'సరైనోడు' రివ్యూ
జానర్ : యాక్షన్ ఎంటర్టైనర్
నటీనటులు : అల్లు అర్జున్, ఆది పినిశెట్టి, శ్రీకాంత్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా తదితరులు
కథ, దర్శకత్వం : బోయపాటి శ్రీను
సంగీతం : ఎస్.ఎస్.థమన్
నిర్మాత : అల్లు అరవింద్
వేసవిలో స్కూళ్లకు సెలవులు, హాళ్లకు సినిమాలు విరివిగా దొరికేస్తాయి. అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాలు ఆడాయా లేదా అన్నదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. సినిమా సినిమాకి వైవిధ్యంగా కనిపించాలని తాపత్రయపడే యువ కధానాయకుల్లో అల్లు అర్జున్ ముందుంటాడు. ఈ సారి పూర్తిస్థాయి 'మాస్' క్యారెక్టర్లో 'సరైనోడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'లెజెండ్'లాంటి హిట్ సినిమా తర్వాత రెండేళ్లు విరామం తీసుకుని బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా 'సరైనోడు'. ఒకరు స్టైలిష్ స్టార్.. మరొకరు మాస్ మాస్టర్.. వీళ్లిద్దరి టార్గెట్.. బ్లాక్ బస్టర్. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో చూద్దాం..
కథేంటంటే.. గణ (అల్లు అర్జున్) ఆర్మీ ఆఫీసర్. కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే రకం కాదు. ఫలితంగా ఊర మాస్గా తయారవుతాడు. దివ్య (కేథరీన్) ముఖ్యమంత్రి కూతురు. తండ్రి హత్య అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. ఎమ్మెల్యే దివ్యను ప్రేమిస్తాడు గణ. ఆమె కూడా గణను ఇష్టపడుతుంది. పెళ్లికి ఇరు కుటుంబాల ఆమోదం లభిస్తుంది. అయితే ఈ పెళ్లి జరగాలంటే తనకో ప్రామిస్ చేయాలంటూ షరతు పెడుతుంది దివ్య. ఇక మీదట ఎలాంటి గొడవలకు వెళ్లనని ఒట్టేస్తే తప్ప పెళ్లికి ఒప్పుకునేది లేదంటుంది. ఆమెకు ప్రామిస్ చేస్తున్న సమయంలోనే మరో సమస్య మహాలక్ష్మి(రకుల్ ప్రీత్ సింగ్) రూపంలో అక్కడికి వస్తుంది.
మహాలక్ష్మి ఓ పల్లెటూరికి చెందిన యువతి. ధనుష్(ఆది పినిశెట్టి) తండ్రిని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతూ చెడు పనులకు కేరాఫ్ అడ్రస్గా ఉంటాడు. అసలు మహాలక్ష్మికి, ధనుష్కి ఉన్న సంబంధం ఏమిటి? ధనుష్ మహాలక్ష్మిని ఎందుకు తరుముతుంటాడు? మహాలక్ష్మి గణకి ముందే తెలుసా? ఆమెను కాపాడే దశలో ధనుష్తో వైరానికి దిగిన గణ ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటాడనేదే మిగిలిన కథ.
ఎవరెలా... అల్లు అర్జున్ ట్రైలర్లో చెప్పినట్టే ఊర మాస్గా కనిపించాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫిదానే. తెలుగు సినిమాలో తొలిసారి విలన్గా కనిపించిన ఆది పినిశెట్టి మంచి మార్కులు కొట్టేశాడు. బలమైన ప్రత్యర్థిగా హీరోకి గట్టి పోటీ ఇచ్చాడు. ఇక కేథరీన్, రకుల్లు ప్రేక్షకుల కళ్లకి అందమైన వినోదాన్ని వంద శాతం అందించారు. 'బ్లాక్ బస్టర్' పాటలో తళుక్కుమన్న అంజలి తన పరిధి మేరకు న్యాయం చేసింది. ఇక శ్రీకాంత్, సాయి కుమార్ తదితరులు అలవాటైన పాత్రల్లో ఒదిగిపోయారు. థమన్ సంగీతంలో కొన్ని పాటలకే ఓట్లు పడ్డాయి. కోరుకున్నంత కామెడీ కష్టమే. లొకేషన్లు, కొటేషన్లు (డైలాగులు) భారీగా ఉన్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే పక్కా బోయపాటి మార్క్ సినిమా. భారీ బిల్డప్, బీభత్సమైన యాక్షన్ సీన్లు, అల్లు అర్జున్ అల్లాడించిన డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటాయి. పాత కథే అయినా.. కొత్త హీరో.. క్రేజీ కాంబినేషన్. ఓవరాల్గా 'సరైనోడు' మాస్కి నచ్చేస్తాడు.