మెగా అభిమానులకు నిరాశే..!
ప్రస్తుతం టాలీవుడ్లో ధృవ ఫీవర్ నడుస్తోంది. బడా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతుండటంతో రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తన గత సినిమా బ్రూస్లీ నిరాశపరచటంతో చరణ్ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్లో మిలియన్ మార్క్ను అందుకోవటంతో పాటు ఓవరాల్గా వందకోట్ల క్లబ్లో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ధృవ విషయంలో మెగా అభిమానులకు నిరాశ తప్పదని తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోల సందడి మొదలవుతుంది. తమ అభిమాన నటుడి సినిమాను అందరికంటే ముందే చూసేందుకు ఫ్యాన్స్ ఎంత రేటు పెట్టైనా టికెట్ కొనేందుకు సిద్ధమవుతారు. అయితే ధృవ విషయంలో మాత్రం నిర్మాత అల్లు అరవింద్ అభిమానులకు షాక్ ఇచ్చాడు.
ధృవ సినిమాకు ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవట. ఉదయం ఆరుగంటల తరువాతే తొలి షో వేసేలా ప్లాన్ చేస్తున్నారు. బెనిఫిట్ షోస్ కారణంగా ముందే టాక్ బయటికి వచ్చేయటంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో సరైనోడు రిలీజ్ సమయంలోనూ బెనిఫిట్ షోలకు నో చెప్పిన అల్లు అరవింద్. ప్రస్తుతం ధృవ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.