అభిమానిని పరామర్శించిన అల్లు అర్జున్
యంగ్ హీరో అల్లు అర్జున్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇటీవల చెన్నై వరదల నేపథ్యంలో భారీ విరాళం అందించిన బన్నీ.. ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్న తన అభిమానిని పరామర్శించాడు. విజయవాడ సింగ్నగర్లో ఉంటున్న మస్తాన్ బీ 50 ఏళ్లుగా అల్లు రామలింగయ్య అభిమాని. తరువాత అదే కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్‌ను అభిమానిస్తోంది. ప్రస్తుతం క్యాన్సర్తో బాధపడుతున్న మస్తాన్ బీ ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి తన అభిమాన నటుణ్ని ఒక్కసారి ప్రత్యక్షంగా కలవాలని ప్రయత్నిస్తోంది.
విషయం తెలుసుకున్న బన్నీ మంగళవారం ఉదయం విజయవాడ వెళ్లి మస్తాన్ బీని కలిసి పరామర్శించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలోనటిస్తున్న బన్నీ, షూటింగ్ కు కాస్త గ్యాప్ రావటంతో స్వయంగా విజయవాడ వెళ్లి మస్తాన్ బీని కలిసి పరామర్శించటంతో పాటు ఆమె కుటుంబసభ్యులతో కొద్ది సేపు గడిపారు. గతంలో కూడా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇలా అనారోగ్యంతో ఉన్న అభిమానులను కలిసి వారికి మనోధైర్యం ఇచ్చారు.