
పాట కోసం 50 గంటల ప్రయాణం!
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ రకుల్ ప్రీత్‌సింగ్ కెరీర్‌కి మంచి మలుపు అయ్యింది. ఎక్స్‌ప్రెస్ వేగంతో ఆమె కెరీర్ దూసుకెళుతోంది. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ జాబితాలో ఉన్న ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో షూటింగ్స్ కోసం దేశ, విదేశాలు తిరుగుతున్నారు. దాంతో ప్రయాణాలు బాగా అలవాటై పోయాయి. కానీ, ఇప్పటివరకూ చేయనంత సుదీర్ఘ ప్రయాణం ఆమె చేశారు. అది ‘సరైనోడు’ సినిమా కోసం. అల్లు అర్జున్, రకుల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది.
ఆ పాటను సౌత్ అమెరికాలోని బొలీవియాలో గల ఉయుని నగరంలో చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉయుని చేరుకోవాలంటే దాదాపు 50 గంటలు పడుతుందట. ఆ విషయం గురించి రకుల్ ప్రస్తావిస్తూ - ‘‘50 గంటలైనా ఇంకా చేరుకోలేదు. ఈ సుదీర్ఘ ప్రయాణం మంచి అనుభూతినిస్తోంది. ఉయుని చాలా అందంగా ఉంటుంది.
అంత అందమైన ప్రదేశం వెళ్లడం కోసం ఇన్ని గంటలు కష్టపడడం సబబే’’ అని మరికాసేపట్లో గమ్యం చేరుకుంటారనగా పేర్కొన్నారు. మొత్తానికి లాంగ్ జర్నీ చేసి, ఈ యూనిట్ ఆ తర్వాత ఉయుని చేరుకున్నారు. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా షూటింగ్ జరగని అద్భుత ప్రదేశమది. ఈ నెల 13 వరకూ పాట చిత్రీకరించి, చిత్రబృందం హైదరా బాద్‌కు తిరుగు ప్రయాణమవుతుంది.