
గంటాపై చంద్రబాబు గుర్రు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు , మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుల మధ్య రోజు రోజుకూ దూరం పెరుగుతోంది.
♦ చిరంజీవితో సన్నిహితంగా మెలగడంపై అసంతృప్తి
♦ ‘సరైనోడు’ ఆడియో ఫంక్షన్‌లో గంటా కీలకపాత్ర
♦ గంటా విదేశీ పర్యటనకూ చెక్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు , మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుల మధ్య రోజు రోజుకూ దూరం పెరుగుతోంది. ఈ మధ్యన గంటాపై చిర్రుబుర్రులాడుతున్న చంద్రబాబు, ఇటీవల ఆయన విదేశీ (అమెరికా) పర్యటనకు వెళ్లకుండా ఆర్థికశాఖ ద్వారా అడ్డుపడ్డారు. ఒకపక్క రాష్ట్ర మంత్రివర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న గంటా.. మరోపక్క కాంగ్రెస్ నేత కొణిదెల చిరంజీవికి సన్నిహితంగా మెలగటం వల్లే చంద్రబాబు, గంటాల మధ్య అంతరం పెరగడానికి కారణమని సమాచారం. గంటాకు ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల ఆయన మేనల్లుడు అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా గంటా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జన సమీకరణ వెనక గంటా ఉన్నారని సీఎంకు జిల్లా టీడీపీ నేతలు సమాచారం అందించారు.
చిరుకు ఎందుకంత ప్రాధాన్యం: సీఎం
చిరంజీవి దాదాపు రాజకీయంగా కనుమరుగవుతున్న తరుణంలో ఆయన కార్యక్రమానికి ఇంత భారీగా జనసమీరణ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలసి గంటా విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. దీనిపై ఆర్థిక శాఖ కొర్రీ వేసింది. సీఎం సూచనల మేరకు అలా జరిగిందనే చర్చ జరుగుతోంది. అంతకు ముందు మంత్రివర్గ సమావేశంలోనూ గంటాపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన సిఫారసు చేసే ఏ ఫైల్‌ను వెంటనే క్లియర్ చేయవద్దని తన కార్యాలయ అధికారులకు సీఎం చెప్పినట్లు సమాచారం.