రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్ షోలో మాట్లాడుతున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అమరావతి పరిరక్షణ సమితి పేరుతో చంద్రబాబు శుక్రవారం నాటి జిల్లా పర్యటన ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందలా సాగింది. అమరావతి నుంచి కారులో బయలుదేరిన బాబు రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ ఇన్‌గేట్‌కు వచ్చేసరికి కిందకు దిగి జోలెపట్టి పోలీసు స్టేషన్ సెంటర్ వచ్చేసరికి తిరిగి కారు ఎక్కేశారు. అక్కడి నుంచి మోరంపూడి సెంటర్‌కు చేరుకుని మరోసారి కారు దిగి కోటిపల్లి బస్టాండ్ వరకూ పాదయాత్ర చేశారు. కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో సుమారు 40 నిమిషాల సేపు సాగిన చంద్రబాబు ప్రసంగంలో రాజధానిపై కంటే ముఖ్యమంత్రి, డీజీపీ టార్గెట్‌గా వ్యక్తిగత దూషణలకు దిగడం విస్మయానికి గురిచేసింది. కులాల మధ్య చిచ్చురేపే రీతిలో రైతులు, ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగం సాగింది. తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడతారని అనుకోలేదని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది.
జేఏసీలో ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాస్ కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ హీరో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానుల్లో అసంతృప్తిని రగిల్చాయి. మూడు రాజధానులకు అనుకూలంగా చిరంజీవిని బెదిరించి మాట్లాడించారన్న శ్రీనివాస్‌పై చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. చిరంజీవికి వ్యక్తిగతంగా ఓ అభిప్రాయం ఉండదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. కులాల మధ్య చిచ్చురేపే ప్లాన్ లేకుండా ఇలా మాట్లాడి ఉండరంటున్నారు.
ఎప్పటి మాదిరిగానే హైదరాబాద్ ఇప్పుడు ఆ స్థాయిలో అభివృద్ధి సాధించిందంటే అందుకు తానే కారణమని మరోసారి చంద్రబాబు చెప్పుకున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైటెక్ సిటీ, రింగురోడ్డు, సైబర్ సిటీ ఇవన్నీ తన ఘతనగానే చెప్పుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేనప్పుడు తానే హైదరాబాద్‌లో సాంకేతికను తీసుకువచ్చానన్నారు. తనకు వయస్సు మీదపడిందని ఇటీవల కొందరు అంటున్నారని చెబుతూ తన ఆలోచనల వయస్సు 25 సంవత్సరాలేనని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. తనలో ఇంకా ఉడుకు రక్తం ప్రవహిస్తోందంటూ, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 151 మందిని ఫుట్‌బాల్ ఆడుకుంటానని గల్లీ నేత రీతిలో మాట్లాడారు. తన మానసపుత్రిక ‘ఈనాడు’లో అమరావతిపై వేసిన ఫొటోలు చూడమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. తాను మొదటిసారి జోలె పట్టానని చెబుతూ స్వాతంత్య్రం కోసం గాంధీజీ జోలె పట్టిన అంశాన్ని ముడిపెట్టి మాట్లాడటం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో ఇదివరకు ఎప్పుడు, ఎవరు సమావేశం, సభలు పెట్టినా తండోపతండాలుగా వచ్చే జనం చంద్రబాబు సభలో పలచగా కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment