జీవనాధారం కోసం చెన్నై వస్తే..
తమిళసినిమా: గ్రామాల నుంచి రకరకాల కారణాలతో ప్రజలు చెన్నై వస్తుంటారు. అందులో చాలావరకు జీవనాధారం వెతుక్కుంటూ వచ్చే వారే అధికం. అలా పల్లెటూరు నుంచి వచ్చిన ముగ్గురు యువకులు బతువుదెరువు కోసం చెన్నై వచ్చి డబ్బు కోసం ఎలాంటి పనికైనా సిద్ధపడే ఒక ముఠా చేతుల్లో చిక్కుకుంటారు.
ఆ ముఠా అసలు రూపం తెలిసిన తరువాత ఈ ముగ్గురు ఏం చేశారన్నదే ఉన్నాల్ ఎన్నాల్ చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.జయకృష్ణ పేర్కొన్నారు. శ్రీశ్రీ గణేశ్ క్రియేషన్ పతాకంపై రాజేంద్రన్‌సుబ్బయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఏఆర్.జయకృష్ణ, జగా, ఉమేశ్ కథానాయకులుగా నటిస్తున్నారు.
వారికి జంటగా లుబ్నా, నిహారిక, సహానా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రాజేశ్, రామచంద్రన్, రవిమరియ, ఢిల్లీ గణేశ్, ఆర్.సుందరరాజన్, నెల్లైశివ తదితరులు నటిస్తున్నారు. కాగా ఒక కీలక పాత్రలో నటి సోనియాఅగర్వాల్ నటిస్తున్నారు. మహ్మద్ రిశ్వాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యుల్ షూటింగ్ జరుపుకుంటోందని దర్శకుడు వెల్లడించారు.