
తమిళనాడు, పెరంబూరు: సుప్రీం కోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా పోరాటానికి అనుమతినివ్వాల్సిందిగా గాయని చిన్మయి బుధవారం చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఒక లేఖను అందించారు. కోలీవుడ్‌లో మీటూ పోరాటానికి ఆధ్యం పోసింది గాయని చిన్మయినేనని చెప్పాలి. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసి కోలీవుడ్‌లో కలకలం సృష్టించిన చిన్మయి ఆ తరువాత సీనియర్ నటుడు రాధారవిపైనా ఆరోపణలు చేసి మీటూపై పోరాటం చేస్తోంది. ఈ కలకలం కాస్త సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో తాజాగా ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం అవుతోంది.
ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్‌గగోయ్‌పై ఆయన కార్యాలయం పనిమనిషి లైంగిక వేధింపుల కేసును పెట్టిన సంగతి, దానిపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే న్యాయమూర్తి రంజన్‌గగోయ్‌పై లైంగిక వేధింపుల కేసును ధర్మాసనం కొట్టివేసింది. దీంతో పలు మహిళామండలి కార్యకర్తలు సుప్రీంకోర్టు ముందు ధర్నాకు దిగారు. పోలీసులు వారిపై లాఠీలు ఝలిపించి 144 సెక్షన్ అమలు పరిచారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిచిన గాయని చిన్మయి, ఇతర మహిళా సంఘాల నిర్వాహకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా చెన్నైలో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోరాటానికి అనుమతినివ్వాల్సిందిగా మహిళా మండలి తరఫున గాయని చిన్మయి బుధవారం చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. మరి చిన్మయి వినతిపత్రంపై పోలిస్ కమిషనర్ కార్యాలయం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment