‘‘నాకు నేను అప్‌గ్రేడ్ అవడానికి ఇప్పటి సినిమాలు చూస్తా. ముఖ్యంగా ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌లో బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో ఎంపికైన 5 సినిమాలు చూస్తా.. ఎలా తీశారనే టెక్నిక్స్ తెలుసుకుంటా. మన భారతీయ సినిమా, హాలీవుడ్ సినిమాలన్నీ ఇప్పుడు బాగా దగ్గరైపోయాయి. ప్రస్తుతం కొత్త డైరెక్టర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా.
ఎందుకంటే కొత్తవారు కొత్త ఆలోచనలతో వస్తారు. మనకు తెలియని విషయాలు కూడా వారికి తెలుస్తాయి’’ అని ప్రముఖ కెమెరామన్ ఛోటా కె.నాయుడు అన్నారు. అశ్విన్ బాబు, అవికా గోర్ జంటగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజుగారి గది 3’. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరామన్‌గా చేసిన ఛోటా కె.నాయుడు చెప్పిన విశేషాలు.
►అల్లాణి శ్రీధర్‌గారి దర్శకత్వంలో నా తొలి సినిమా ‘రగులుతున్న భారతం’ స్టార్ట్ అయింది. అదే సమయంలో మా గురువు దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలో ‘అమ్మ రాజీనామా’ చేశా. ‘రగులుతున్న భారతం’ కంటే ముందుగా ‘అమ్మ రాజీనామా’ విడుదలయింది. ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేశాననే సంఖ్య కరెక్టుగా తెలియదు. మా వాళ్లేమో 94 అంటున్నారు. అందుకే 100కు దగ్గరలో ఉన్నానని చెబుతుంటా.
►కొందరు హీరోలు, నిర్మాతలు ‘అమ్మో.. ఛోటానా?’ అంటూ నా వద్దకు రాకుండా వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటా. ఏ విషయంలోనూ రాజీ పడను. ‘ఠాగూర్’ సినిమాకి చిరంజీవిగారు ఛోటాని తీసుకుందామని చెప్పగానే వీవీ వినాయక్ ఎగిరి గంతెయ్యలేదు. మన మాట వింటాడో? లేదో? అని లోపల మదనపడ్డాడు. రెండు రోజులు షూటింగ్ తర్వాత.. ‘మీరేంటో, మీ పనేంటో నాకు అర్థం అయింది’ అని వినాయక్ సంతోషంగా చెప్పాడు.
►‘స్టాలిన్’ సినిమా తర్వాత ఓంకార్ యాంకర్‌గా ఉన్న ఓ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచాడు. అప్పటి నుంచి మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ‘జీనియస్’ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నానంటూ ఓంకార్ కథ చెప్పగానే ఆశ్చర్యపోయా. ఆ సినిమాకి డేట్స్ కుదరకపోవడం వల్ల నేను చేయలేకపోయా. ఆ తర్వాత ‘రాజుగారి గది’ చిత్రానికి కూడా పని చేద్దామనుకున్నాం. కానీ, కుదరలేదు. ‘రాజుగారి గది 3’కి కుదిరింది.
►పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘రాజుగారి గది 3’. హారర్ అంశాలు తక్కువగా ఉంటాయి. నాకు చెప్పిన కథని ఓంకార్ అదే విధంగా తెరపైకి తీసుకొచ్చాడు. ఈ సినిమాలో హీరో అశ్విన్ బాబు అనగానే పూర్తి స్థాయి పాత్రకి సరిగ్గా న్యాయం చేయగలడా?’ అనిపించింది. ఎందుకంటే హీరోగా చేయడం అంటే చాలా కష్టం. కానీ తన నటన చూశాక చాలా సర్‌ప్రైజ్ అయ్యా. డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్... ఇలా ప్రతిదీ సింగిల్ టేక్‌లోనే చేశాడు. తనకు మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్‌గా తమన్నా స్థానంలో అవికా గోర్‌ని తీసుకున్నామని ఓంకార్ చెప్పగానే సరిగ్గా చేయగలదా? అనిపించింది. పతాక సన్నివేశాల్లో తన నటన చూసి అభిమాని అయిపోయా. అద్భుతంగా నటించింది.
►దర్శకత్వం చాలా కష్టమైన పని. ఇప్పుడు నాకున్న టెంపర్‌కి దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. పైగా ప్రస్తుతం సినిమాలకి కథ చాలా ముఖ్యం. అది లేకుంటే ఏమీ చేయలేం. మంచి కథ కుదిరితే కొన్నేళ్ల తర్వాత అయినా దర్శకత్వం చేస్తా. నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. ఆ తర్వాత ప్రేమకథలంటే ఆసక్తి.
►‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత రాత్రిళ్లు షూటింగ్ చేయడం మానేశా. కానీ, ‘రాజుగారి గది 3’కి మాత్రం చాలా రోజులు రాత్రిళ్లు పని చేయాల్సి వచ్చింది. పొద్దున్నే 6:30 గంటలకు సెట్స్‌కి వెళ్లడమే నా పని. రాత్రి అయినా ఎప్పుడు ప్యాకప్ చెబుతాడన్నది ఓంకార్ ఇష్టం.
►24 శాఖల్లో నాకు కొరియోగ్రఫీ అంటే ఇష్టం. భారతీయ కెమెరామన్లలో సంతోష్ శివన్, పీసీ శ్రీరామ్, ఛోటా కె.నాయుడు (నవ్వుతూ) అంటే ఇష్టం. హాలీవుడ్ కెమెరామన్ రాబర్ట్ రిచర్డ్‌సన్ అంటే ఎంతో ఇష్టం. ఆయనతో రెండున్నర గంటలు కలిసి మాట్లాడిన రోజుని మరచిపోలేను. ఎవరైనా దర్శకులు, కెమెరామన్లు అద్భుతం చేస్తే అహంభావం లేకుండా వాళ్లకు నేను సరెండర్ అయిపోతా.. అభినందిస్తా.
►ఏ సినిమాకైనా 100శాతం డైరెక్టర్లతో ప్రయాణం చేస్తా. వాళ్లు అనుకున్న దానికంటే కనీసం ఒక్క శాతమైనా ఎక్కువ చేయాలనుకుంటా. అదే నా విజయ రహస్యం. నా తమ్ముడు శ్యామ్ కె.నాయుడు నా కంటే మంచి కెమెరామన్.. చాలా మంచి సినిమాలు చేశాడు. ప్రస్తుతానికి నేను కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు. చివరి శ్వాస ఉన్నంత వరకూ కెమెరామన్‌గానే పని చేయాలన్నది నా కోరిక.
Comments
Please login to add a commentAdd a comment