శివ కందుకూరి హీరోగా శేష సింధు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చూసీ చూడంగానే’. ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ, మాళవిక హీరోయిన్లుగా నటించారు. రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రం గత నెల 31న విడుదలైంది. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని చెబుతున్నారు దర్శకురాలు శేష సింధు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శేష మాట్లాడుతూ– ‘‘నేను దుబాయ్‌లో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. క్రిష్, సుకుమార్ వంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. కేవలం దర్శకత్వ విభాగంలోనే కాదు నాకు కెమెరా, కాస్ట్యూమ్, రైటింగ్ విభాగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. దర్శకురాలిగా నా తొలి సినిమా ‘చూసీ చూడంగానే’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషాన్నిచ్చింది.
ముఖ్యంగా సినిమాలోని శృతీ, ఐశ్వర్య పాత్రలకు అమ్మాయిలు బాగా కనెక్ట్ అయ్యారు. తమ లైఫ్‌లో నుంచి వెళ్లిపోయిన అబ్బాయిలు తిరిగి వచ్చాక అమ్మాయిలు తప్పక వారిని టెస్ట్ చేస్తారు. అదే ఈ సినిమాలో చూపించాం. కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మెప్పిస్తోంది. శివ కందుకూరి బాగా నటించాడు. ఈ సినిమా కథను కొంతమందికి వినిపించాను. అమ్మాయి కదా హ్యాండిల్ చేయగలదా? అని కొందరు అంటే... అమ్మాయిలైతే చెప్పిన మాట వింటారని అన్నవారూ లేకపోలేదు. రాజ్ కందుకూరిగారు ఇలాంటి ప్రశ్నలు అడగకుండా దర్శకురాలిగా చాన్స్ ఇచ్చారు. నాకైతే గౌరవం లేని చోట పని చేయడం ఇష్టం ఉండదు. మా ఇద్దరు సిస్టర్స్ కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇండస్ట్రీలో నేను ఇబ్బందిపడే సందర్భాలు ఎదురు కాలేదు. కానీ కొందరు వారికి ఎదురైన కొన్ని ఇబ్బందికర సంఘటనలను చెప్పారు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment