శ్రీనగర్‌కాలనీ: సినిమాలో విలన్ అంటే ఎలా ఉండాలి! భయంకరమైన రూపం.. ఎరుపెక్కిన కళ్లు.. మొహంపై గాట్లు.. చూడగానే ఎవరికైనా భయం పుట్టాల్సిందే.. అలా ఉండాలి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు సినిమా విలన్లు స్మార్ట్‌గా మారిపోయారు. సిక్స్‌ప్యాక్ బాడీతో అందంలో హీరోనే తలదన్నుతున్నారు. మాస్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు.
కేవలం వారు చేసే పనుల్లోనే విలనిజం కనిపిస్తుంది తప్ప..
బాడీ లాంగ్వేజ్‌లో ఏ కోశానా ఆ ఛాయలు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో ఈ ట్రెండ్ రాజ్యమేలుతోంది. అసలు ‘విలన్’ అంటే ఎవరు..? హీరోకు శత్రువు. అందుకేనేమో ‘‘శత్రు’’ అని పేరు పెట్టుకున్న అతడు తెలుగు తెరపై ఇప్పుడు ట్రెండ్ సెట్టింగ్ విలన్‌గా ఎదుగుతున్నాడు. చూడ్డానికి 6 అడుగుల 3 అంగుళాల పొడవుతో ‘300’ హాలీవుడ్ మూవీ హీరో ‘జెరార్డ్ బట్లర్’ను తలపించేట్టు ఉండే ఈ విలన్‌కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ‘‘రంగస్థలం, శైలజారెడ్డి అల్లుడు, అరవింద సమేత వీరరాఘవ’’ చిత్రాల్లో మంచి పాత్రలుపోషించిన శత్రు తన సినీ ప్రయాణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు మన విలన్ మాటల్లోనే..
‘రంగస్థలం’ చిత్రం షూటింగ్‌లో రామ్‌చరణ్‌తో శత్రు
మాది ఒరిస్సా.. కానీ తెలుగబ్బాయినే. మా పూర్వికులది రాజమండ్రి. అయితే ఒరిస్సాలో సెటిలయ్యారు. నాన్న వ్యవసాయం చేస్తారు. నాకు ఇద్దరు అన్నలు. ఇంటర్ వరకూ కటక్‌లో చదువుకున్నాను. పస్ట్ క్లాస్ స్టూడెంట్‌ని. ఇంట్లో వారు బైపీసీ చేసి డాక్టర్ అవ్వమన్నారు. కానీ చిన్నతనం నుంచి నటన మీద చాలా ఇంట్రస్ట్ ఉండేది. స్కూల్ కల్చరల్ పోటీల్లో చురుగ్గా ఉండేవాడిని ఉండేది ఒరిస్సా అయినా ఇంట్లో అంతా తెలుగు వాతావరణమే. చిరంజీవిగారు నాకు ఇన్‌స్పిరేషన్. ఇంటర్ అయ్యాక మనసంతా యాక్టింగ్ వైపే లాగింది. ఇక డాక్టర్ మనకు సెట్ కాదనిపించింది. ఎలాగైనా ఇండస్ట్రీకి వచ్చేయాలని.. డిగ్రీ హైదరాబాద్‌లో చేస్తానని మా నాన్నతో చెబితే.. ‘ఇక్కడే చదువుకోవచ్చుగా’ అన్నారు. కానీ నేను హైదరాబాద్‌లో చదువుకుంటా అని గట్టిగా చెప్పేసరికి ఒప్పుకున్నారు. వెంటనే సిటీకి వచ్చేశా. డిగ్రీ మైక్రోబయాలజీ అవంతి కాలేజీలో చేరాను. అక్కడ పరిమళ మేడం నాకు సపోర్ట్ చేసింది. నా ఆసక్తిని గమనించి ప్రోత్సహించింది.
అనుకోకుండా టీవీలో ఛాన్స్..
జెమిని టీవీలో వీజేగా అవకాశాలు ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్లి నా ఫొటోలు ఇచ్చి వచ్చాను. కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేసి నువ్వు టీవీలో వస్తున్నావు అంటే కంగారుపడ్డాను. నేను అసలు ఎక్కడా నటించనే లేదు. ఎక్కడ వస్తున్నానబ్బా.. అని అడిగాను.. వాడు చెప్పిన సమాధానం ఏంటంటే...ఒక క్రైమ్ సీరియల్‌లో పోలీస్‌స్టేషన్‌లో మోస్ట్ వాంటెడ్ ఫొటోల్లో నీ ఫొటో ఉంది అన్నాడు. ఆ మాట విని నవ్వుతో పాటు కొద్దిగా కాన్ఫిడెంట్ కూడా వచ్చింది. కనీసం ఇలాగైనా ఎవరైనా చూసి అవకాశాలు ఇస్తారని (నవ్వుతూ) అనుకున్నా.
లీడర్‌తో అవకాశం
అవకాశాల కోసం తిరుగుతూ అసిస్టెంట్ డైరెక్టర్స్‌తో పరిచయాలు పెంచుకొన్నాను. అలా నా మొదటి సినిమా అవకాశం రానా హీరోగా తీసిన ‘లీడర్’తో వచ్చింది. అందులో చిన్న పాత్రే వేశాను. ఈ తర్వాత ‘అలియాస్ జానకి’ చిత్రంలో మెయిన్ విలన్‌గా చేశాను. కానీ సినిమా సరిగా ఆడకపోవడంతో గుర్తింపు రాలేదు. కానీ నిర్మాత రామ్ ఆచంట నా ఫొటోలు చూసి బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్’లోను, ‘ఆగడు’ చిత్రంలో సోనూసూద్ బ్రదర్‌గా అవకాశం ఇచ్చారు. వాటిలో ఓ మాదిరి గుర్తింపు వచ్చింది. అంతకు మించి నాకు చిత్ర పరిశ్రమలో ఓ గాడ్‌ఫాదర్‌లా ఆయన నాకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇచ్చారు. తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో హీరోయిన్ అన్నగా ఫుల్ రోల్ చేశాను. ఈ చిత్రం ప్రేక్షకుల్లో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఇజం, అత్తారింటికి దారేది, మిస్టర్, గరుడవేగ చిత్రాల్లో నటించారు. రెండేళ్ల క్రితం ‘మిస్టర్’ చిత్రం షూటింగ్‌లో ఊటీలో ఉన్నా. జీవితంలో మరువలేని ఘటన అప్పుడు జరిగింది.. మా నాన్న గుండెపోటుతో చనిపోయారు.
2018లో అదృష్టం పండింది
ఈ ఏడాది నాకు పండగను తెచ్చింది. ముగ్గురు సూపర్‌స్టార్స్ చిత్రాల్లో నటించారు. ఆ మూడూ ఈ ఏడాది బ్లాక్ బ్లస్టర్స్‌గా నిలిచాయి. ‘‘రామ్‌చరణ్ రంగస్థలం, మహేష్‌బాబు భరత్ అనే నేను, ఎన్‌టీఆర్ అరవింద సమేత వీరరాఘవ’’ చిత్రాల్లో నేను భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నా. అరవింద సమేత వీరరాఘవలో ‘ఒంటిచెయ్యి సుబ్బడు’ పాత్ర చిన్నదే అయినా చివరగా సినిమా కంక్లూజన్ ఇచ్చే పాత్ర నాది. అంతేకాకుండా రంగస్థలంలో కాశీ పాత్ర కూడా మంచి పేరు తెచ్చింది. తమిళంతో కార్తి హీరోగా నటించిన ‘చినబాబు’లో విలన్‌గా ఫుల్‌రోల్ చేశాను.
ప్రేమ..పెళ్లి.. వినూత్న..
నా జీవితంలో దొరికిన అదృష్టం వినూత్న. ‘అలియాస్ జానకి’ చిత్రం సమయంలో ఫ్యాషన్ డిజైనర్‌గా వినూత్న పరిచయమైంది. రెండేళ్ల ప్రేమ తర్వాత వివాహం చేసుకున్నాం. తనిప్పుడు ఫాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్‌గా పనిచేస్తోంది. నేను మంచి భోజనప్రియుణ్ని. నా కోసం చాలా వంటకాలు చేసి పెడుతుంది. ఖాళీగా ఉంటే ఇంట్లో సినిమాలు చూస్తాను. ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తాను.
కావాలనే డిగ్రీ పూర్తి చేయలేదు
నా లక్ష్యం ఒక్కటే.. నటుడిని కావాలి. కానీ డిగ్రీ పూర్తి చేస్తే నా కెరీర్ మరోదారిలో వెళుతుందని భయమేసింది. అందుకే ఓ సబ్జెక్ట్‌ను పాస్ అవకుండా అలాగే ఉంచాను. సినిమాల్లో అవకాశాలు రాకపోతే డిగ్రీతో జాబ్ చేసే ఆలోచన వస్తుందని డిగ్రీని పూర్తి చేయలేదు. సినిమానే ప్రపంచంగా ఉండాలని అలా చేశాను. ఇప్పటికీ డిగ్రీ సబ్జెక్ట్ అలాగే ఉండిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు పూర్తి చేయాలి.
చిరకాలం గుర్తుండిపోవాలి
హైదరాబాద్ నాకు సినిమా లైఫ్ ఇచ్చింది. హను రాఘవపూడి, జీవన్‌రెడ్డితో పాటు నా తోటి విలన్ స్నేహితులు, ఆర్టిస్ట్స్ చాలా మంది ఉన్నారు. చాలా ఆప్యాయంగా ఉంటారు. జగపతిబాబుగారి విలనిజం బాగా ఇష్టం. ఇప్పటికి 20 చిత్రాలు చేశాను. ప్రస్తుతం ‘పడిపడి లేచె మనసు, కల్కి, జార్జిరెడ్డి, కన్నడ శివరాజ్‌కుమార్ రుస్తుం’ చిత్రాల్లో నటిస్తున్నాను. సినీ ప్రేక్షకులకు ఆర్టిస్ట్‌గా గుర్తుడిపోయే పాత్రలు చేయాలి. అందుకు ఎంతటి శ్రమకైనా సిద్ధంగా ఉన్నాను.. అంటూ ముగించారు ఈ అందమైన విలన్ శత్రు.
Comments
Please login to add a commentAdd a comment