సిటీలైట్స్ కోసం ఎంతో కష్టపడ్డా!
ఇది వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. తాజాగా నటించిన సిటీలైట్స్ సినిమా ఒకెత్తని హీరో రాజ్‌కుమార్ రావు అంటున్నాడు. ఇంతకుముందు విడుదలైన కోయి పో చే, షహీద్ సినిమాలు మనోడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2010లో హత్యకు గురైన మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది షహీద్ ఆజ్మీ జీవితగాథ ఆధారంగా షహీద్ తీశారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం బ్రిటన్ నుంచి వచ్చిన మెట్రో మనీలా ఆధారంగా సిటీలైట్స్ రూపొందించారు. ‘దీని సినిమా షూటింగ్‌ను ఇటీవలే ముగించాం. మంచి జీవితం కోసం రాజస్థాన్ నుంచి ముంబై వచ్చిన జంట కథ ఇది. కొత్త నగరంలో వాళ్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి ప్రేమకథలో ఎన్నో మలుపులు ఉంటాయి’ అని రాజ్‌కుమార్ వివరించాడు. మహేశ్ భట్ నిర్మించగా, హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే ఒకటిన విడుదలయ్యే అవకాశముంది.
కొత్తనటి పత్రలేఖ ఇందులో హీరోయిన్‌గా కనిపిస్తుంది. షహీద్ సినిమాతో తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిన మెహతా కుటుంబసభ్యుడి వంటివాడేనని రావు అన్నాడు. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటామని, పాత్రలను ఎలా తీర్చిదిద్దాలో బాగా తెలుసని చెప్పాడు. ఆయన దమ్మున్న దర్శకుడు కాబట్టే సిటీలైట్స్‌లో నటించడానికి సంతోషంగా ఒప్పుకున్నానని ఈ 29 ఏళ్ల నటుడు అన్నాడు. కంగనా రనౌత్ ప్రధానపాత్రధారిగా ఇటీవలే వచ్చిన క్వీన్‌లోనూ రావు ప్రధాన పాత్ర పోషించాడు. తన ప్రియురాలిని ప్రేమలోకి దింపడానికి ఎన్నో కష్టాలు పడే ఢిల్లీ యువకుడు విజయ్ ధింగ్రాగా సత్తా ప్రదర్శించాడు. ‘ఇది హీరోయిన్ ఆధారిత సినిమా అని తెలిసినా, నాకూ నటించే అవకాశముంటుంది కాబట్టి అంగీకరించాను. ఇందులో విజయ్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది’ అని చెప్పిన రాజ్‌కుమార్ రావు ఢిల్లీడాలీ సినిమాలో సోనమ్ కపూర్ సరసన నటించే చాన్స్ కొట్టేశాడు.