
నయనను అధిగమించేనా?
అందాల భామలు నయనతార, త్రిషల మధ్య నువ్వా? నేనా? అన్నంతగా కోల్డ్‌వార్ నడిచింది. అయితే అది ఒకప్పటి కథ. ఇప్పుడు వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటిది తాజాగా ఈ బ్యూటీస్ మధ్య మరోసారి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. నయనతార, త్రిష ఇద్దరూ సంచలన తారలే. ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయినవారే.
ఈ అందగత్తెల మధ్య మరో పోలిక ఏమిటంటే ఇటీవల ఇద్దరూ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలకు మారారు. అదే విధంగా నయనతార నటించిన ఆ తరహా చిత్రం అన్భే నీ ఎంగే(తెలుగులో అనామిక)చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక త్రిష నటించిన నాయకి తెలుగులో విడుదలై ఆమెకు నిరాశనే మిగిల్చింది. తమిళంలో త్వరలో తెరపైకి రానుంది. అయితే ఆ తర్వాత నయనతార నటించిన మాయ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది.
ఇప్పుడు త్రిష కూడా మాదేశ్ దర్శకత్వంలో మరో హారర్ కథా చిత్రం చేస్తున్నారు. ఇకపోతే ఆ అమ్మడు కోలీవుడ్‌లో అగ్రకథానాయకులందరితోనూ జత కట్టారు. ఒక్క సూపర్‌స్టార్‌తో తప్ప. ఆయనతో నటించే అవకాశం రాలేదన్న నిరాశను, నటించాలన్న ఆశను తను చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. మూడు పదుల వయసు దాటిన త్రిషకు త్వరలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలనే కోరిక తీరే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ఆశకు తన నెచ్చలి నయనతార గండి కొట్టే అవకాశం లేకపోలేదనే టాక్ మరో పక్క వినిపిస్తోంది.
కబాలి చిత్రంతో ఆల్ రికార్డులను బద్దలు కొట్టిన రజనీకాంత్ తాజాగా శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నారు. కాగా తదుపరి కబాలి-2ను చేయబోతున్న విషయం ఇప్పటికే కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన అల్లుడు ధనుష్ వుండర్‌బార్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఆ చిత్రానికి దర్శకుడు ర ంజిత్ కథను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా అమలాపాల్ నటించనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఆ పాత్రకు నయనతార అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం వరుస విజయాలతోనూ, చేతి నిండా చిత్రాలతోనూ బిజీగా ఉన్న నయనతార కాల్‌షీట్స్ కుదరక పోతే త్రిషకు అవకాశం దక్కనుంది. నయన్ ఇప్పటికే సూపర్‌స్టార్‌తో చంద్రముఖి, కుచేలన్, శివాజీ చిత్రాల్లో జతకట్టారు. తాజాగా నాలుగోసారి నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నయనతారను అధిగమించాలంటే త్రిష లక్కుపైనే ఆధారపడి ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.