మూవీ ఫ్రెండ్స్‌ | Comedian Friends In Tollywood Hyderabad | Sakshi
Sakshi News home page

మూవీ ఫ్రెండ్స్‌

Published Tue, Aug 28 2018 8:21 AM | Last Updated on Sat, Sep 1 2018 12:48 PM

Comedian Friends In Tollywood Hyderabad - Sakshi

అభయ్‌ బేతిగంటి , రాహుల్‌ రామకృష్ణ ,ప్రియదర్శి

హీరో విజయ్‌ దేవరకొండతో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ... నాని, నిఖిల్‌తో సత్య... రానా, రాజ్‌ తరుణ్‌తో నవీన్‌... వీరందరిప్పుడు ఫ్రెండ్స్‌ అయిపోయారు. తెరపై నవ్వులు పూయిస్తున్నారు. ప్రతి సినిమాలో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్రల్లో ఒకప్పుడు సీనియర్‌ నటులు రాణించగా... ఇప్పుడు నయా ఆర్టిస్టులు దూసుకొచ్చారు. అలాంటి కొందరు మూవీ ఫ్రెండ్స్‌ గురించి.. 

శ్రీనగర్‌కాలనీ: ఓ హీరోయిన్‌.. ఓ హీరో.. ఓ ఫ్రెండ్‌.. ఈ ట్రాక్‌ సినిమాల్లో సూపర్‌ హిట్‌. మూవీస్‌లో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ ఓ ట్రెండ్‌ సెట్టర్‌. అప్పట్లో నటుడు చంద్రమోహన్‌ ఫ్రెండ్‌గా నటిస్తే చిత్రాలు హిట్‌ అనే అభిప్రాయం ఉండేది. ఆ తర్వాత హీరో ఫ్రెండ్స్‌ లిస్టులో అలీ, వేణుమాధవ్, సునీల్, రాజీవ్‌ కనకాల, ఉత్తేజ్‌ చేరారు. వీరి తర్వాత శ్రీనివాసరెడ్డి, వేణు, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, గిరిధర్, చిత్రం శ్రీను, సప్తగిరి తదితరులు ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు కొన్ని కొత్త ముఖాలు తెరపైకనిపిస్తున్నాయి. సోషల్‌ మీడియా ప్రభావంతో పాపులర్‌ అయినకొంతమంది ఆర్టిస్టుల పరిచయమిది...  

అభినవ్‌ గోమటం
థియేటర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తూనే షార్ట్‌ఫిలిమ్స్‌ కూడా చేశాడీ హైదరాబాదీ కుర్రాడు. జగన్నాటకం అనే చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సుమంత్‌ హీరోగా తెరకెక్కిన ‘మళ్లీరావా’లో మంచి పాత్ర చేశాడు. తరుణ్‌భాస్కర్‌ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో కామెడీ టచ్‌ ఉన్న పాత్ర ఇవ్వడంతో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. దర్శకుడు తేజ, ఆది సాయికిరణ్‌ చిత్రాల్లో నటిస్తున్నాడు.  

ప్రియదర్శి  
ప్రియదర్శి పక్కా హైదరాబాదీ. 20కి పైగా షార్ట్‌ఫిల్మ్స్‌ చేశాడు. బైపాస్‌ రోడ్‌ మూవీతో సినీ జర్నీ ప్రారంభించగా... మూడో చిత్రం ‘పెళ్లిచూపులు’తో బ్రేకొచ్చింది. ‘నా చావు నేను చస్తా.. నీకెందుకు’ అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ అయింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. టైమింగ్‌తో కూడిన పంచ్‌లతో ప్రియదర్శి హీరో ఫ్రెండ్‌గా అదరగొడుతూ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్, వెంకటేష్‌–వరుణ్‌తేజ్, సుధీర్‌బాబు చిత్రాల్లో నటిస్తున్నాడు.  

రాహుల్‌ రామకృష్ణ  
‘సైన్మా’ షార్ట్‌ఫిల్మ్‌తో కెరీర్‌ ప్రారంభించాడు. అర్జున్‌రెడ్డి సినిమాతో అందరికీ సుపరిచితుడయ్యాడు. తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అలరిస్తున్నాడు. ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘గీత గోవిందం’లోనూ రాహుల్‌ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు 16 చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం రాజశేఖర్, శ్రీవిష్ణు, సందీప్‌కిషన్‌ చిత్రాల్లో నటిస్తున్నాడు.  

సత్య అక్కల  
హావభావాలతోనే కామెడీ రక్తికట్టిస్తాడు. తూర్పుగోదావరి అమలాపురానికి చెందిన సత్య అక్కల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. ‘పిల్ల జమిందార్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డెరెక్టర్‌గా చేస్తూ నటించాడు. అనంతరం ‘స్వామిరారా’తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రౌడీఫెల్లో, కార్తికేయ, జైలవకుశ, ఎక్కడికిపోతావు చిన్నవాడా, రంగస్థలం తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’, నిఖిల్‌ ‘ముద్ర’, నాగార్జున–నానిల ‘దేవదాస్‌’, రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

నవీన్‌
నవీన్‌ది రాజమండ్రి. 100 పర్సంట్‌ లవ్‌ చిత్రంలో పాపులర్‌ అయ్యాడు. ‘5డేస్‌ ఇన్‌ హైదరాబాద్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించాడు. అనంతరం పిల్ల జమిందార్, కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, నేనే రాజు నేనే మంత్రి, ఆటోనగర్‌ సూర్య చిత్రాల్లో ఫ్రెండ్‌గా తనదైన ముద్ర వేశాడు. ఆకతాయిగా ఉంటూ సరదాగా కామెడీ పండిస్తాడు. ఇప్పుడు సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, మారుతి దర్శకత్వంలోని చిత్రాలతో పాటు మరోదాంట్లో లీడ్‌రోల్‌ చేస్తున్నాడు.  

సుదర్శన్‌రెడ్డి
‘మచ్చా’ అంటూ చిత్తూరు యాసతో అరదగొడతాడు సుదర్శన్‌రెడ్డి. బీటెక్‌ పూర్తయ్యాక యూఎస్‌ ప్లాన్స్‌ కోసం సిటీకొచ్చిన మనోడు... ‘నాకు కోపం వచ్చింది’, ‘ఇదిగో ప్రియాంక’ లాంటి షార్ట్‌ఫిల్మ్స్‌తో పాపులర్‌ అయ్యాడు. ఆ తర్వాత రన్‌ రాజా రన్, పటాస్, కుమార్‌ 21ఎఫ్, చలో, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు చేశాడు. ప్రస్తుతం శర్వానంద్, రామ్, నాగచైతన్య చిత్రాల్లో నటిస్తున్నాడు.  

మహేష్‌ విట్టా   
ఎంబీఏ పూర్తి చేసి, ఉద్యోగం చేయమని తల్లిండ్రులు చెబితే... నేను నటుడు, డెరెక్టర్‌ అవుతానంటూ హైదరాబాద్‌ వచ్చాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేష్‌... రాయలసీమ యాసతో షార్ట్‌ఫిల్మ్స్, ఫన్‌ బకెట్‌లో పాపులర్‌ అయ్యాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి... కృష్ణార్జున యుద్ధం, చలో, విజేత, నా నువ్వే సినిమాల్లో చేశాడు. పేపర్‌బోయ్, పడి పడి లేచె మనసు చిత్రాల్లో నటిస్తున్నాడు.

వెన్నెలకంటి రాకెందుమౌళి
రచయిత వెన్నెలకంటి కుమారుడు రాకెందుమౌళి. పాటలు, మాటల రచయితగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, సింగర్, డ్యాన్సర్‌గా సుపరిచితుడు. షార్ట్‌ఫిల్మ్స్, వెబ్‌ సీరిస్‌లలో నటించాడు. చాలా చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పడంతో పాటు పాటలు రాశాడు. నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో, కిరాక్‌ పార్టీ చిత్రాల్లో నటించాడు. పల్లెవాసి, మైడియర్‌ మార్తాండం, బియాండ్‌లైఫ్‌ చిత్రాల్లో లీడ్‌ రోల్‌ చేస్తున్నాడు.

అభయ్‌ బేతిగంటి
సిద్దిపేటకు చెందిన అభయ్‌ ‘సోడాబుడ్డి భాస్కర్‌’, ‘లగ్గం’  షార్ట్‌ఫిల్మ్స్‌ చేశాడు. ‘పెళ్లిచూపులు’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. పక్కింటి కుర్రాడిలా ఉంటూ కామెడీని పండిస్తున్నాడు. ప్రస్తుతం జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న జార్జిరెడ్డి, నాగశౌర్య చిత్రాల్లో నటిస్తున్నాడు.  

వైవా రాఘవ   
వైజాగ్‌కు చెందిన రాఘం వైవా  షార్ట్‌ఫిల్మ్స్‌తో సోషల్‌ మీడియాలో వైవా రాఘవగా పరిచయమయ్యాడు. గలగల మాట్లాడుతూ అల్లరి పిల్లోడిగా కనిపిస్తాడు. రాజా ది గ్రేట్, కిరాక్‌ పార్టీ సినిమాల్లో నటించాడు. శివాజీరాజా కుమారుడి చిత్రం, నర్తనశాల, ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌ చిత్రాల్లో నటిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement