త్వరలో ప్రేమ వివాహం చేసుకుంటున్నా: దీపు | Coming get love Marriage Deepu | Sakshi

త్వరలో ప్రేమ వివాహం చేసుకుంటున్నా: దీపు

Jul 21 2014 10:54 PM | Updated on Sep 2 2017 10:39 AM

త్వరలో ప్రేమ వివాహం చేసుకుంటున్నా: దీపు

త్వరలో ప్రేమ వివాహం చేసుకుంటున్నా: దీపు

ప్రతిభావంతులైన నేటి తరం యువ గాయకుల్లో దీపు ఒకరు. ఎనిమిదేళ్ల క్రితం ‘టెన్త్‌క్లాస్’ సినిమా ద్వారా గాయకునిగా పరిచయమయ్యారు తను.

 ప్రతిభావంతులైన నేటి తరం యువ గాయకుల్లో దీపు ఒకరు. ఎనిమిదేళ్ల క్రితం ‘టెన్త్‌క్లాస్’ సినిమా ద్వారా గాయకునిగా పరిచయమయ్యారు తను. ఇప్పటివరకూ మూడొందల పై చిలుకు సినీ గీతాలను ఆలపించి, తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఓ మంచి స్థానాన్ని సాధించిన ఈ యువ సంగీత కెరటంతో ‘సాక్షి’ సంభాషణ...
 
 కెరీర్ ఎలా ఉంది?
 బావుందండీ.. కెరీర్ ప్రారంభించినప్పట్నుంచీ ఒక్క రోజు కూడా ఖాళీగా లేను. పాడుతూనే ఉన్నాను. నా సక్సెస్‌కి కారణం.. నా సంగీత దర్శకులే.
 
 మీ కెరీర్‌లో మీకు బాగా పేరుతెచ్చిన పాటలు?
 ‘యమదొంగ’లో ‘నాచోరె నాచోరె..’, ‘చిరుత’లో ‘లవ్‌యూ రా.. లవ్‌యూ రా..’, ‘మగధీర’లో ‘నా కోసం నువ్ జుట్టు పీక్కుంటే బాగుంది..’, ‘రచ్చ’లో ‘ హీ ఈజ్ ద మిస్టర్ తీస్‌మార్ ఖాన్ రచ్చ’.. ఇలా చాలా పాటలున్నాయి. అయితే.. ఇవన్నీ ఓ ఎత్తు ‘ఈగ’లో కీరవాణిగారు పాడించిన ‘నేనే నానినే నేనే నానినే..’ పాట ఓ ఎత్తు. గాయకునిగా నన్ను మరో మెట్టు పై కూర్చోబెట్టిందీ పాట.
 
 మీ కెరీర్‌లో మరిచిపోలేని ప్రశంస?
 ‘నేనే నానినే..’ పాట చరణంలోని ఓ లైన్ హై పిచ్‌లో ఉంటుంది. నాకంటే ముందు ఆ పాటను కొంతమందితో పాడించారట కీరవాణి. కానీ.. ఆయనకు నచ్చలేదు. నేను పాడిన తీరుతో ఆయన సంతృప్తి చెందారు. ‘ఈ పాట నీ కోసమే పుట్టినట్లుంది. హై పిచ్‌ని బాగా అందుకున్నావ్’ అని కీరవాణిగారు ఇచ్చిన ప్రశంస జీవితంలో మరచిపోలేను.
 
 సింగర్లు ఎక్కువైపోయారు కదా! పోటీ కష్టంగా ఉందా?
 పోటీ ఎక్కువే. కానీ.. నా స్థానం నాకుందని నేను నమ్ముతాను. నా అదృష్టం బాగుండి మంచి పాటలు పాడాను. ఇంకా పాడాలి. గాయకునిగా చెరగని స్థానాన్ని సంపాదించాలి. నా ముందున్న కర్తవ్యం అదే.
 
 గాయకునిగా ప్రేరణ?
  చిన్నప్పట్నుంచీ బాలూగారి పాటలు వింటూనే పెరిగాను. ఆయనలా పాడాలని ప్రయత్నించేవాణ్ణి. పాటల పోటీల్లో కూడా పాల్గొనేవాణ్ణి. శంకర్‌మహదేవన్, కె.కె ప్రభావం కూడా నాపై ఉంది.
 
 ఇంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా?
 తాతగారు పాడేవారట. మా బాబాయ్ కూడా మ్యూజికల్ నైట్స్‌లో పాడేవారు. వారి పోలికే వచ్చిందేమో!

 సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది?
 ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లోని నా పాట మిక్కీ జె.మేయర్‌గారికి నచ్చిందట. వెంటనే... టెన్త్‌క్లాస్’ సినిమాకు నాతో పాడించారు. అలా సింగర్‌ని అయ్యా.
 
 మ్యూజిక్ డెరైక్షన్ చేయాలనే ఆలోచనేమైనా ఉందా?
 ప్రస్తుతానికి లేదు. అయితే... ఓ ఆల్బమ్ మాత్రం చేస్తా. ఎవరైనా ఆల్బమ్ చేయడానికి ముందుకొస్తే సరే. లేకపోతే నా సొంత ఖర్చుతోనే ఆల్బమ్ చేస్తా.
 
 మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు కదా! ఇప్పటివరకూ ఎన్ని దేశాల్లో పాడారు?
 ‘సూపర్‌సింగర్’ కార్యక్రమం నాకు ఎక్కడలేని గుర్తింపును తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మ్యూజికల్ షోస్ ఇచ్చానంటే దానికి ‘సూపర్‌సింగర్’ కార్యక్రమమే కారణం. ఇప్పటివరకూ అమెరికా, దుబాయ్, మస్కట్, మలేసియా, సింగపూర్... తదితర ప్రదేశాల్లో షోలు చేశాను.
 
 గాయకునిగా మీ లక్ష్యం?
 బాలీవుడ్‌లో పాడాలి. ఇళయరాజా, రెహమాన్‌లతో పనిచేయాలని ఉంది.
 
 శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా?
 నేర్చుకుంటూనే ఉన్నాను. మ్యూజిక్‌లో డిప్లమా చేశాను. ప్రస్తుతం రామాచారి వద్ద లైట్ మ్యూజిక్, విజర్సు బాలసుబ్రమణ్యంగారి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నా.
 
 అసలు మీ స్వస్థలం ఏది?
 నేను పూర్తి హైదరాబాదీని. ఇక్కడే బీటెక్ చేశాను.
 
 మరి పెళ్లెప్పుడు?
 ఆ పనిలోనే ఉన్నా. త్వరలోనే చెబుతా.
 
 ప్రేమ వివాహమా?
 అవును.
 
 ఎవరా అమ్మాయి. ఆమె సింగరేనా?
 కాదు..అసలు నా ప్రొఫెషన్‌తో ఆమెకు సంబంధం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement