Magadheera
-
'సాయి పల్లవి'పై నమ్మకం, 'రామ్ చరణ్'పై ప్రేమ.. అల్లు అరవింద్ వ్యాఖ్యలు
నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా ప్రమోషన్స్ చాలా స్సీడ్గానే జరుగుతున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చందు మొండేటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ కోసం సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారో చెప్పారు.అమ్మాయిలకు వైట్ స్కిన్ ఉంటే సరిపోదు..వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘తండేల్’ అని అల్లు అరవింద్ అన్నారు. లవ్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి యాక్షన్ కూడా ఇందులో ఉంటుంది. తండేల్ రాజు పాత్రలో నాగచైతన్య అద్భుతమైన నటన చూస్తారని ఆయన అన్నారు. ఇదే సమయంలో సాయి పల్లవి గురించి ఆయన ఇలా అన్నారు. 'తండేల్‌లో సాయి పల్లవి ఎంపిక నాదే.. కమర్షియల్‌గా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. బుజ్జితల్లి పాత్ర కోసం ముంబైకి వెళ్లి హీరోయిన్ను తీసుకురాలేదు. అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిల స్కిన్ వైట్‌గా ఉండొచ్చు కానీ, ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనేది నా అభిప్రాయం. కథలో ఈ పాత్ర చుట్టూ చాలా భావోద్వేగాలు ఉంటాయి. సినిమా చూశాక సాయి పల్లవి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ పాత్ర సాయి పల్లవి అయితే చాలా నిజాయతీగా నటించగలదని అనుకున్నాను. అందరి అంచనాలకు మించి ఆమె వంద శాతం సినిమాకు న్యాయం చేసింది. ఆమెలోని టాలెంట్ అనంతం.' అని చెప్పవచ్చన్నారు.అదీ.. నా అల్లుడిపై ప్రేమరామ్ చరణ్‌తో పాటు గీతా ఆర్ట్స్‌కు మగధీర సినిమా చాలా ప్రత్యేకం. ఈ సినిమాను చరణ్‌తో చేయాలని రాజమౌళినే ఎందుకు కలిశారని అల్లు అరవింద్‌ను బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. నా అల్లుడు (రామ్ చరణ్) మొదటి సినిమా చిరుత యావరేజ్‌గా రన్ అయింది. అలాంటి సమయంలో అతని తర్వాతి సినిమా చేసే ఛాన్స్ నాదే. చరణ్‌కు మంచి హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే మంచి దర్శకుడిని సంప్రదించాలని ముందే అనుకున్నాను. చరణ్ సినిమా కోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు రెడీగా ఉన్నాను. అలాంటి సమయంలో రాజమౌళిని సంప్రదించాను. అలా మగధీర రావడానికి కారణం అయింది. అలా నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చాను. అది తనపై నాకున్న ప్రేమ' అంటూ అరవింద్ పేర్కొన్నారు.గతంలో కూడా మగధీర గురించి అల్లు అరవింద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం అనుకున్నదానికంటే 80 శాతం ఖర్చు అధికమైందని ఆయన అన్నారు. మగధీర కోసం తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పెట్టానని ఆయన అన్నారు. అయితే, ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్‌తో సంబంధం లేకుండా ఆయనే సొంతంగా విడుదల చేశారు. మూవీ విడుదలయ్యాక దానికి మూడింతలు వచ్చిందని ఆయనే అన్నారు. ఒక్కోసారి రిస్క్ చేసి పొగొట్టుకున్న సందర్భాలూ కూడా ఉన్నాయని తెలిపారు. -
మగధీర విలన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది!
మగధీర విలన్ దేవ్‌గిల్ హీరోగా నటించిన తాజా చిత్రం అహో విక్రమార్క. ఈ సినిమాలో చిత్ర శుక్లా హీరోయిన్గా నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రాజమౌళి శిష్యుడు పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నాడు. వార్డ్ విజర్డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఆర్తి దేవిందర్ గిల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే దేవ్‌గిల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం ఆగస్టు 30న ఇది విడుదల కానుంది. -
మగధీర మళ్లీ వస్తున్నాడు
మెగా అభిమానులకు శుభవార్త. రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్ బర్త్‌డే సందర్భంగా ‘మగధీర’ చిత్రాన్ని 26న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ‘మగధీర’ 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్ చేస్తున్నారు. ‘‘మగధీర’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి’’ అన్నారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్ బాబు. ఈ రోజుల్లోనూ... ఈ నెల రీ రిలీజ్ అవుతున్న చిత్రాల్లో శ్రీ, రేష్మ జంటగా మారుతి దర్శకత్వం వహించిన ‘ఈ రోజుల్లో’ కూడా ఉంది. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌పై యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 2012 మార్చి 23న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని 12 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 23న ‘ఈ రోజుల్లో’ విడుదల కానుంది. -
గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!
మెగా తనయుడు, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీకి జంటగా కనిపించనుంది. ఇకపోతే చిన్నప్పట్నుంచి రామ్ చరణ్‌కు హార్స్ రైడింగ్ ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. అంతే కాకుండా మగధీర చిత్రంలో గుర్రపు స్వారీ అభిమానులను కట్టిపడేసింది. ఆ సీన్స్ అభిమానులను ఇప్పటికీ మర్చిపోలేరు. ఇసుకలో కురుకుపోయిన రామ్ చరణ్‌ను గుర్రం కాపాడే సీన్ ఎమోషనల్‌గా టచ్ చేసింది. (ఇది చదవండి: రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'టైగర్ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు) అయితే గతంలో ఉపయోగించిన మగధీర సినిమాలోని గుర్రం పేరు బాద్షా. అప్పట్లో సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుర్రాన్ని ఇంటికి తెచ్చుకుని ‘కాజల్’ అని పేరు పెట్టుకున్నారు చెర్రీ. వీలు చిక్కినప్పుడల్లా అలా గుర్రంపై సరదాగా రైడింగ్ చేసేవారు మన గ్లోబల్ స్టార్. మగధీర గుర్రంతో పాటు ఆయన దగ్గర మరిన్నీ హార్సెస్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా మరో గుర్రాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెర్రీ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 'బ్లేజ్.. మై న్యూ ఫ్రెండ్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ కోసమేనా అన్నా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ఫోటో చూస్తుంటే అచ్చం మగధీరలోని గుర్రమే అభిమానులకు గుర్తుకు వస్తోంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
చరణ్ బర్త్‌డే: మెగా ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్న అల్లు అరవింద్
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మెగా ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ అందించనున్నారు. చరణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘మగధీర’. 2009లో విడుదలైన ఈ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. 13 ఏళ్ల తర్వాత మరోసారి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టించడానికి సిద్దమవుతుంది. ఈ సినిమాను రిరిలీజ్ చేసేందుకు గీతా ఆర్ట్స్ ప్లాన్ చేస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని రిరిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా గీతా ఆర్ట్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. చదవండి: కేరళ హైకోర్టులో మోహన్ లాల్‌కు చుక్కెదురు! కాగా మెగా తనయుడిగా చిరుత సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చరణ్ తన రెండవ సినిమా మగధీరతోనే ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రాని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు మూడింతల లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాను చరణ్ బర్త్‌డే సందర్భంగా అల్లు అరవింద్ రిరిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇందులో చరణ్ పోషించిన కాలభైరవ పాత్రకు విపరీతమైన ప్రేక్షక ఆదరణ దక్కింది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. చదవండి: విశ్వనాథ్‌గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ On the occasion of 𝐌𝐄𝐆𝐀 𝐏𝐎𝐖𝐄𝐑𝐒𝐓𝐀𝐑 @AlwaysRamCharan Birthday! 😎 Re-Releasing the Sensational 𝐈𝐍𝐃𝐔𝐒𝐓𝐑𝐘 𝐇𝐈𝐓 #Magadheera in theaters 🔥#MagadheeraReRelease 💥@ssrajamouli @MsKajalAggarwal @mmkeeravaani #AlluAravind @BvsnP @DOPSenthilKumar @GeethaArts pic.twitter.com/aENWnSn23a — Geetha Arts (@GeethaArts) February 23, 2023 -
'మగధీర'లో ఆఫర్ వచ్చింది, కానీ నో చెప్పా: అర్చన
హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన అర్చన ఈ మధ్య వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని బుల్లితెర ప్రేక్షకులక సైతం చేరువైన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమాలో తాను బాలకృష్ణకు డ్యాన్స్ నేర్పించానంది. బాలయ్య బృందావనంలో గోపికలతో కలిసి డ్యాన్స్ చేసే ఒక బిట్ నేర్పించినట్లు వెల్లడించింది. ఇక పెళ్లికి ముందు ఫ్రెండ్స్‌తో పార్టీకి వెళ్లిన తాను పెగ్గులు ఎక్కువవడంతో ఆసుపత్రికి వెళ్లానని చెప్పింది. రాజమౌళిగారు మగధీరలో చేయమని ఆఫర్ ఇచ్చారు, కానీ అప్పుడంత లౌక్యం లేకపోవడంతో చేయలేదని తెలిపింది. నిజంగా ఆ సినిమా చేసుంటే ఇప్పుడు ఇంకోలా ఉండేదేమోనని పేర్కొంది. కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయంటూ ఎమోషనలైంది అర్చన. చదవండి: నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ పావురాల వ్యర్థాల వల్లే మీనా భర్త మృతిచెందాడా?..షాకింగ్ రీజన్ -
మగధీర.. కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రికార్డు తిరగరాసిన చిత్రం మగధీర. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. రామ్‌చరణ్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్.. తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా రామ్‌చరణ్.. హార్స్ రైడింగ్, కాజల్ గ్లామర్, శ్రీహరి-రామ్‌చరణ్ మధ్య డైలాగ్ వార్ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.(జూన్ 8 వరకు సుశాంత్‌తోనే ఉన్నా: రియా) Here's the beautiful video tribute to Dr.Srihari garu by @AlwaysRamCharan fans on the 11th anniversary of #Magadheera #11YearsForIHMagadheera#RamCharan #SSRajamouli pic.twitter.com/j9uaFfdt8t — BARaju (@baraju_SuperHit) July 31, 2020 అలాగే రాజమౌళి- డైరెక్షన్, కీరవాణి- సంగీతం, కేకే సెంథిల్- సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్- ఫైట్స్, రమ రాజమౌళి- కాస్ట్యూమ్ డిజైన్స్.. ఇలా ప్రతి ఒక్కటి సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం విడుదలై 11 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్.. ఆ సినిమా సంగతులను గుర్తుచేసుకుంది. ‘ మగధీర సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. ఫిల్మ్ మేకింగ్‌లోనూ, బాక్సాఫీస్ వసూళ్లలోనూ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. విడుదల తర్వాత దక్షిణాదిలో సన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది’ అని పేర్కొంది.(రాజమౌళి, ఆయన కుటుంబసభ్యులకు కరోనా) తాజాగా ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కూడా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మగధీర షూటింగ్‌కు సంబంధించిన పలు చిత్రాలనున ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. మగధీర నుంచి కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు కూడా సోషల్ మీడియాలో ‘#11YearsForIHMagadheera’ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దివంగత నటుడు శ్రీహరికి రామ్‌చరణ్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీహరి తనపై తీసుకున్న కేర్ గురించి రామ్‌చరణ్ గతంలో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేస్తున్నారు. Some wonderful memories from #Magadheera.....@AlwaysRamCharan @MsKajalAggarwal @ssrajamouli @GeethaArts pic.twitter.com/DTDa46DoiO — KK Senthil Kumar ISC (@DOPSenthilKumar) July 31, 2020 -
‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్ కామెంట్..!
‘మగధీర’ ఈ మధ్యే విడుదలైనట్టు అనిపిస్తున్నా.. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తి చేసుకుంది. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చింది. రెండో సినిమా అయినప్పటికీ రామ్‌చరణ్ చక్కని నటన కనబరిచాడు. స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. ఇందు, మిత్రవింద పాత్రల్లో మెప్పించిన కాజల్ అగర్వాల్‌కు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. టికెట్ల ధరలు తక్కువగా ఉన్న కాలంలోనే ఈ సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేసింది. జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులను సొంతం చేసుకుంది. ‘మగధీర’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా రామ్‌చరణ్ స్పందించారు. ఇన్‌స్టాలో ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ‘మగధీర సినిమా వచ్చి 10 సంవత్సరాలు పూర్తయిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఈ సినిమా కోసం కష్టపడ్డ యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు’ అంటూ గత స్మృతులను గుర్తు చేసుకున్నాడు. ‘మగధీర’ రాజమౌళి సృష్టించిన అద్భుతమంటూ కొనియాడాడు. కాగా, రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో ‘ఆర్ఆర్ఆర్’ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మగధీర విడుదలైన రోజునే.. అంటే 2020, జూలై 30న విడుదల చేస్తామని రాజమౌళి ఇదివరకే ప్రకటించారు. మరోసారి అద్భుత విజయం ఆవిష్కృతమవుతుందేమో వేచి చూడాలి..! View this post on Instagram Can’t believe it’s been a decade already! Still seems so recent! A big thank you to the dream team of #Magadheera, Keeravaani garu, @kajalaggarwalofficial & @geethaarts for this memorable film. @ssrajamouli garu, learnt so much from you back then and continuing to do so even now. #10YearsofMagadheera A post shared by Ram Charan (@alwaysramcharan) on Jul 30, 2019 at 9:32pm PDT -
స్వీట్ సర్ప్రైజ్
రామ్‌చరణ్‌కి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనకు జపాన్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. మార్చి 27న చరణ్ 34వ పుట్టినరోజును జరుపుకున్నారు. జపాన్ అభిమానుల నుంచి చరణ్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. ఆయన నటించిన ‘మగధీర’ చిత్రంలోని పాత్రల బొమ్మలను గ్రీటింగ్ కార్డులపై గీసి ‘హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్’ అని రాసి పంపించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ గ్రీటింగ్ కార్డులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చరణ్ ‘‘జపాన్ నుంచి స్వీట్ సర్ప్రైజ్ను అందుకున్నా. నా పట్ల మీకున్న ప్రేమానురాగాలు నన్నెంతో సంతోషపరిచాయి. నా జపాన్ అభిమానులకు నా ప్రేమను పంచుతున్నాను. త్వరలో మిమ్మల్ని కలవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్యూ జపాన్’ అన్నారు. -
‘మగధీర’ పనుల్లో రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా మగధీర. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసింది. పునర్జన్మల నేపథ్యంలో ఫాంటసీ కథాశంతో తెరకెక్కిన మగధీర సినిమా రాజమౌళిని టాప్ డైరెక్టర్‌గా నిలిపింది. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. బాహుబలి సినిమాతో రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్‌లో బాహుబలి చిత్రానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు మగధీర సినిమాను కూడా జపనీన్ భాషలతో డబ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. అయితే గతంలోనే మగధీర జపనీస్ సబ్‌టైటిల్స్‌తో అక్కడ రిలీజ్ అయ్యింది. కానీ ఆ సమయంలో రాజమౌళికి జపాన్‌లో ఎలాంటి ఇమేజ్ లేదు. బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు జపాన్‌లోనూ మారుమోగిపోయింది. అందుకే మగధీరను డబ్ చేసి రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారట. అయితే విషయంపై చిత్రయూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
‘మగధీర’ సినిమా చూపించాడు
చాంద్రాయణగుట్ట: మానవతీత శక్తుల పేరుతో అమాయకులను బురిడి కొట్టించి కోట్లాది రూపాయలు కాజేసిన ఘరానా మోసగాడిని మీర్‌చౌక్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ గోల్డెన్ కాలనీకి చెందిన మెహతాబ్ హుస్సేన్ అలియాస్ ఆదిల్, అతని మూడో భార్య సకీనా ఫాతీమా ఫర్నీచర్ వ్యాపారం చేసేవారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు భూత వైద్యుడి అవతారం ఎత్తిన అతడికి ఆజం అనే వ్యక్తి ద్వారా యాకుత్‌పురాకు చెందిన వ్యాపారి రుస్తుం పటేల్‌తో పరిచయం ఏర్పడింది. తనకు దివ్యదృష్టి ఉందని, ఆసిఫ్‌జాహి, టిప్పు సుల్తాన్, కుతుబ్‌షాహిల కాలంలో దాచిన గుప్త నిధుల వివరాలు చెబుతానంటూ నమ్మించాడు. కర్ణాటక, మైసూర్ ప్రాంతాలకు తీసుకెళ్లిన అతను వాస్తు దోషాల కారణంగా నిధి బయటికి రావడం లేదని నమ్మించాడు. ఇంతటితో ఆగకుండా మీరు 4000 ఏళ్ల క్రితం గొప్ప రాజు అని, అప్పట్లో మీ భార్యగా ఉన్న మహిళ కూడా మళ్లీ జన్మించిందని.....ఆమె ప్రస్తుతం వేల కోట్లకు అధిపతిగా ఉందని చెబుతూ ఓ మహిళ ఫొటో, హిందీలో రాసిన లవ్ లెటర్‌ను కూడా చూపించాడు. ఆమెతో పెళ్లి జరిపించి కోటీశ్వరుడిని చేస్తానని నమ్మించాడు. అంతేగాకుండా తన వద్ద ఉన్న రైస్ ఫుల్లింగ్ యంత్రం ద్వారా రూ.కోట్లు సంపాదించవచ్చని చెప్పి దాదాపు రూ.3 కోట్లు వసూలు చేశాడు. మరి కొందరినుంచి కూడా భారీగా వసూలు చేశాడు. ఈ డబ్బుతో చిన్న గోల్కొండ ప్రాంతంలో 2000 గజాల స్థలం, చింతల్మెట్లో ఓ భవనాన్ని నిర్మించడంతో పాటు పలుమార్లు విదేశీ పర్యటనలు చేశాడు. కొంతకాలానికి అతడిపై అనుమానం వచ్చిన రుస్తుం పటేల్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మెహతాబ్ అతడిని ఎయిర్ పిస్తోల్‌తో బెదిరించాడు. అయినా బాధితుడు ఒత్తిడి చేయడంతో రూ.8.5 లక్షలు హబీబ్‌నగర్ రౌడీషీటర్ మహ్మద్ యూసుఫ్ అలియాస్ జంగ్లీ యూసుఫ్ ద్వారా ఇచ్చి పంపాడు. అయితే ఆ డబ్బులను యూసుఫ్ బాధితుడికి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నాడు. దీంతో గత నెల 24న బాధితుడు మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.13.5 లక్షల నగదు, ఎయిర్ పిస్తోల్, రెండు పాస్ పోర్టులు, ఐదు గ్రాముల బంగారం, రైస్ ఫుల్లింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. -
పాత స్నేహితుడితో చరణ్ వీకెండ్
-
పాత స్నేహితుడితో చరణ్ వీకెండ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబందించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఉపాసన, అభిమానుల ఈ వీకెండ్ అప్డేట్ను కూడా ఇచ్చేసింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీకెండ్ సందర్భంగా షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చిన చెర్రీ తన పాత స్నేహితుడితో ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఉపాసన తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ పాత స్నేహితుడు ఎవరనుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ కెరీర్‌ను మలుపు తిప్పిన భారీ బ్లాక్‌బస్టర్ సినిమా మగధీరలో చరణ్ వాడిన గుర్రం. రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోతో పాటు ఓ వీడియోనూ కూడా పోస్ట్ చేసిన ఉపాసన ‘మిస్టర్.సి ఈ వారాంతాన్ని తన పాత స్నేహితుడితో గడుపుతున్నాడు’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రంగస్థలం 1985లో చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తుండగా జగపతి బాబు, ఆది పినిశెట్టి, వైభవ్, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2018 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Mr.C spending the weekend with his old buddy from #magadheera #ramacharan . 😊 pic.twitter.com/6DQ0dojS13 — Upasana Kamineni (@upasanakonidela) 12 November 2017 -
కేసు వెనక్కి తీసుకున్న అల్లు అరవింద్
బాలీవుడ్ రిలీజ్ కు రెడీ అవుతున్న రాబ్తాపై టాలీవుడ్ లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా మగధీరకు కాపీ అంటూ.. హీరోయిన్లు వందల ఏళ్లనాడు ప్రేమించుకోవటం.. తమ ప్రేమను గెలిపించుకోవడానికి తిరిగి జన్మించటం.. హీరో వంద మంది యోధులతో తలపడటం లాంటి సీన్లు రాబ్తాలో ఉన్నాయన్న వార్తలు రావటంతో ఇది మగధీరకు కాపీ అన్న టాక్ బలంగా వినిపించింది. మగధీర నిర్మాత అల్లు అరవింద్ కూడా ట్రైలర్ ను చూసి ఈ సినిమా మగధీరకు కాపీ నే అన్న ఆలోచనలో రాబ్తా యూనిట్ పై కేసు వేశాడు. రాబ్తా యూనిట్ మాత్రం తమ సినిమా కాపీ అన్న వార్తలను ఖండించింది. కేవలం రెండు నిమిషాల ట్రైలర్ చూసి సినిమా కాపీ అని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. బుధవారం కోర్టు ముందు కూడా ఇదే వాదన వినిపించింది. కోర్లు రాబ్తా సినిమా ఫుల్ స్క్రిప్ట్ ను కూడా అదంజేసింది. రాబ్తా యూనిట్ వాదనతో సంతృప్తి చెందిన కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఈ రోజు(గురువారం) ఉదయం రాబ్తా యూనిట్ పై వేసిన కేసును అల్లు అరవింద్ వెనక్కి తీసుకున్నారు. దీంతో రేపు రాబ్తా రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతిసనన్ జంటగా తెరకెక్కిన రాబ్తాకు దినేష్ విజన్ దర్శకుడు. -
అభిమానులకు హీరో చిన్న విజ్ఞప్తి
ముంబై: ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువైన బాలీవుడ్ మూవీ రాబ్తా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాకు రాబ్తా కాపీ అంటూ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించగా.. కేవలం ట్రైలర్ చూసి కాపీ అనడం భావ్యం కాదని మూవీ యూనిట్ వివరణ ఇచ్చుకుంది. రేపు (శుక్రవారం) విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో 'రాబ్తా' హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. 'నా మూవీ రాబ్తా రేపు విడుదల కానుంది. ఎలాగైనా సరే కాస్త తీరక చేసుకుని మూవీ చూడండి. మీ అభిప్రాయాలను నాతో షేర్ చేసుకోగలరని' సుశాంత్ ట్వీట్ చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవిత కథాంశంతో తెరకెక్కిన 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ' తో సక్సెస్ బాట పట్టాడు సుశాంత్. ఓ మంచి సక్సెస్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో రాబ్తాపై ఈ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ కోసం ఎంతగానో కసరత్తులు చేయడం తెలిసిందే. హిట్ కోసం ఎదురుచూస్తున్న కృతి సనన్‌కు రాబ్తా సక్సెస్ కీలకం కానుంది. మరోవైపు టాలీవుడ్ మూవీ మగధీరను కాపీ కొట్టారంటూ వివాదం రాజుకోవడంతో రాబ్తాకు ప్రచారం కూడా ఎక్కువగానే జరిగింది. దీంతో 'రీల్' ధోనీని ప్రేక్షక్షులు ఆధరిస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. సుశాంత్, ‘వన్ నేనొక్కడినే’ ఫేమ్ కృతి సనన్ జంటగా నటించిన ఈ మూవీ రేపు (జూన్ 9న) ప్రేక్షకుల ముందుకు రానుంది. Please find some time and love for #raabta tomorrow and let me know how the experience was.Much love❤️@RaabtaOfficial @kritisanon @TSeries — Sushant Singh Rajput (@itsSSR) 8 June 2017 -
ట్రైలర్ చూసే కాపీ అంటారా..? : రబ్తా టీం
త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న బాలీవుడ్ మూవీ రబ్లా యూనిట్, కాపీ సినిమా అంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించింది. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాకు రబ్లా కాపీ అంటూ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించడంతో వివాదం ముదిరింది. కేవలం 2 నిమిషాల 14 సెకన్ల ట్రైలర్ చూసి సినిమా కాపీ అంటూ ఎలా నిర్ణయిస్తారని రబ్లా యూనిట్ ఫైర్ అయ్యింది. ఎలాంటి ఆదారాలు లేకుండా కాపీ అని ప్రచారం చేయటం క్రియేటివిటీని అవమానించటమే అన్నారు రబ్తా టీం. చాలా సినిమాల్లోని సన్నివేశాలు ఇతర చిత్రాల నుంచి స్ఫూర్తిని పొంది రూపొందిస్తున్నారని అంత మాత్రానికే కాపీ అంటూ ఆరోపణలు చేయటం తగదంటున్నారు. అల్లు అరవింద్ తమ సినిమాపై కోర్టును ఆశ్రయించినందుకు బదులుగా రబ్తా చిత్ర నిర్మాతలు ప్రతికా ప్రకటన ద్వారా తమ సమాధానం ఇచ్చారు. Official Statement on behalf of the producers of #Raabta, Dinesh Vijan and Bhushan Kumar pic.twitter.com/ueU87TUIuv — taran adarsh (@taran_adarsh) May 25, 2017 -
‘రబ్తా’ చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ
హైదరాబాద్ : హిందీ చిత్రం ’రబ్తా’ నిర్మాతకు కోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. మగధీర చిత్రాన్ని కాపీ కొట్టారంటూ ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ నిన్న హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాబ్తా విడుదలను నిలిపివేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. దీనిపై జూన్ 1లోగా రబ్తా నిర్మాత సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ (‘వన్ నేనొక్కడినే’ ఫేమ్) జంటగా నటించిన రాబ్తా చిత్రం వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రబ్తా సినిమా ట్రైలర్ రిలీజ్ అవగానే ‘మగధీర’కు, దీనికి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది!’’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ పేలాయి. ‘రాబ్తా’ ట్రైలర్లో, స్టిల్స్‌లో ‘మగధీర’ ఛాయలు కనిపిస్తున్నాయనే కామెంట్స్ వినిపించాయి కూడా. -
మగధీరతో కనెక్షన్ ఉందా?
హిందీలో ‘రాబ్తా’ అనే పదానికి మీనింగ్ ఏంటో తెలుసా? ‘కనెక్షన్’ అని! సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ (‘వన్ నేనొక్కడినే’ ఫేమ్) జంటగా నటించిన హిందీ ఫిల్మ్ ‘రాబ్తా’ ట్రైలర్ రిలీజవ్వగానే ‘‘తెలుగు హిట్ ‘మగధీర’కు, దీనికి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది!’’ అని సోషల్ మీడియాలో కొందరు సెటైర్స్ వేశారు. ‘రాబ్తా’ ట్రైలర్లో, స్టిల్స్‌లో ‘మగధీర’ ఛాయలు కనిపిస్తున్నాయంటున్నారు. ‘‘కనెక్షన్ కాదు, మా చిత్రకథను కాపీ కొట్టారు’’ అంటూ ‘మగధీర’ చిత్రనిర్మాత అల్లు అరవింద్ బుధవారం హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు మెట్లెక్కారు. ‘రాబ్తా’ విడుదలను నిలిపివేయాలని కోరారు. కేసును కోర్టు జూన్ 1కి వాయిదా వేసింది. జూన్ 9న ‘రాబ్తా’ విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో 1న ఏం తీర్పు వస్తుందనేది ఆసక్తిగా మారింది. -
స్పై సెప్టెంబర్!
వెయిటింగ్... వెయిటింగ్... మహేశ్‌బాబు అభిమానులు ఎప్పట్నుంచో ‘స్పైడర్’ను ఎప్పుడు విడుదల చేస్తారోనని వెయిట్ చేస్తున్నారు. వాళ్ల వెయిటింగ్‌కి తగ్గట్టు మహేశ్ బర్త్‌డే (ఆగస్టు 9) కానుకగా ఆగస్టు సెకండ్ వీక్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనే వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. కట్ చేస్తే... అభిమానులకు చిన్న షాక్! చిత్రనిర్మాతలు ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు ‘స్పైడర్’ను సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. కారణం ఏంటంటే... ప్రస్తుతం చెన్నైలో క్లైమాక్స్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీతో క్లైమాక్స్ షెడ్యూల్ ముగుస్తుంది. తర్వాత బ్యాలెన్స్ రెండు సాంగ్స్ షూట్ చేయడం కోసం ఫారిన్ వెళతారు. షూటింగ్ ఫాస్ట్‌గా పూర్తయినా... పోస్ట్ ప్రొడక్షన్ అండ్ గ్రాఫిక్ వర్క్స్‌కి ఎక్కువ టైమ్ కావాలని దర్శకుడు ఏఆర్ మురుగుదాస్ అడిగారట! అదీ మేటర్. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ స్వరకర్త. -
రణదేవ్ బిల్లా అంటే ఎవరు?
ఐ టాకు ఏ ఇంగిలీసు ఆల్ పీపులు వెల్లా టుడే! ఉత్తమ విలన్ ఇది నాది అని ఒక్కసారి నేను అనుకుంటే అది నాకు దక్కి తీరాలి విలన్ ఎలా ఉండాలి? కోపం కోసమే పుట్టినట్లు... రెండు నిప్పుల కుంపట్లు ఎప్పుడూ కళ్లలో పెట్టుకోవడమే తన హక్కు అన్నట్లు ఉండకూడదు. ఒక లెక్క ప్రకారం చెప్పుకోవాలంటే... సెలైంట్‌గా ఉంటూనే సునామీ సృష్టించాలి. సునామీలా వెర్రెత్తిపోతూనే... సెలెనైై్సపోవాలి. వ్యూహాన్ని మెరుగుదిద్దుకోవాలి. ‘ఉత్తమ విలన్’ అంటే ఇలా ఉండాలి’ అనిపించుకోవాలి. చల్లగా చాపకింద నీరులా ఉండి చావు దెబ్బతీసే ‘విలన్’ పాత్రలకు ఇంకా చేరువకాలేదుగానీ... ఆవేశాన్ని, హాస్యాన్ని సమపాళ్లలో పండించగలనని నిరూపించాడు దేవ్ గిల్. దేవ్ గిల్ అంటే? ఎవరు? అదేనండీ... ‘మగధీర’ విలను. రణదేవ్ బిల్లా!! అమ్మో....! నాలుగు శతాబ్దాల నాటి తీరని వాంఛతో రాకుమార్తె కోసం మళ్లీ పుట్టిన విధ్వంసకారుడు. ఎంతకైనా తెగించి తొడగొట్టే రాక్షసుడు... రణదేవ్ బిల్లా! ‘మగధీర’లో మగటిమి ఉట్టి పడే విలన్‌గా భయపెట్టిన దేవ్... ‘పూలరంగడు’లో ‘ఐ టాకు ఏ ఇంగిలీసు’ అంటూ నవ్వించాడు. ‘సినిమాలో ఒక హీరో ఉంటాడు కాబట్టి... అతనికొక విలన్ ఉండాలి’ అన్నట్లుగా ‘మగధీర’ సినిమాలో ‘విలన్’ పాత్రను డిజైన్ చేయలేదు. ఆ పాత్రలో రక్తమాంసాలు ఉంటాయి. చీకటి వెలుగులు ఉంటాయి. కొండను ఢీ కొట్టే బలమైన ముందడుగు ఉంటుంది. అగ్గిలాంటి ఆవేశం ఉంటుంది. దీంతో పాటు అడుగుతడబడడం ఉంటుంది. అవమానం ఉంటుంది. ప్రత్యర్థిని సవాలు చేసే దమ్ము కావాలి.ఆ దమ్ము గొంతులోనే కాదు... గంభీరమైన దృఢమైన శరీరంలోనూ కనిపించాలి.‘మగధీర’లో విలన్ పోస్ట్‌కు ఎంపిక కావడం అంటే ఆషామాషీ ఏమి కాదు. మరి అదృష్టం ఉంటే? ఆ అదృష్టానికి ప్రతిభ తోడైతే.... ఆ ప్రతిభే... రణదేవ్ బిల్లా, రఘువీర్గా నటించిన దేవ్ గిల్! దేవిందర్‌సింగ్ గిల్ మహారాష్ట్రలోని పుణేలో పుట్టాడు.తండ్రికి చిన్న రెస్టారెంట్ ఉంది.నటుడు కావాలనే కోరిక మూడో క్లాసు నుంచే మొదలైంది. మూడో క్లాసులోనే ఒక నాటికలో నటించాడు. అలా ప్రతి సంవత్సరం నటిస్తూనే ఉన్నాడు. పెద్దయ్యాక... మోడల్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.బాలీవుడ్ సినిమా ‘షాహీద్-ఏ-ఆజమ్’లో రాజ్‌గురుగా నటించాడు. మంచి పాత్ర!దమ్మున్న పాత్ర!! కానీ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తరువాత... దేవానంద్ డెరైక్ట్ చేసిన ‘మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమాలో నటించాడు. ప్చ్... పెద్దగా ప్రయోజనం లేదు. కేసీ బొకాడియా ‘బోల్డ్’ సినిమాలో.... ‘డబ్బుతో ఈ ప్రపంచాన్ని ఈజీగా కొనేయవచ్చు’ అని నమ్మే బిజినెస్ టైకూన్ ప్రాత్రలో నటించాడు. ఆ సినిమా పెద్ద హిట్టై ఉంటే... పరిస్థితి ఎలా ఉండేదో తెలియదుగానీ... ‘బోల్డ్’ తరువాత గ్యాప్ వచ్చింది.గ్యాప్ తరువాత తెలుగులో నాగార్జున, విష్ణు సినిమా ‘కృష్ణార్జున’లో నటించాడు.ఆ సమయంలోనే మోహన్‌బాబు దృష్టిలో పడ్డాడు. ఆయన రాజమౌళికి దేవ్ గిల్ గురించి చెప్పాడు. గిల్ రాజమౌళిని కలిశాడు. ‘‘ఇప్పుడు ఎలా ఉన్నావో... నెల తరువాత కూడా అలాగే కనిపించాలి’’ అని చెప్పాడు రాజమౌళి.అదే... మీసం... అదే గడ్డంతో... నెల తరువాత కలిశాడు. ఒడ్డూ పొడుగు బాగున్న దేవ్ గిల్‌ను ‘రణదేవ్ బిల్లా’ పాత్ర వరించింది. ‘ఉత్తమ విలన్’గా ఎంతో పేరు తెచ్చింది. తెలుగు చిత్రసీమకు చాలా దగ్గర చేసింది. హైదారాబాద్ అల్లుడిని కూడా చేసింది! ‘మగధీర’ ‘పూలరంగడు’ ‘రగడ’ ‘ప్రేమకావాలి’ ‘రచ్చ’ ‘నాయక్’ ‘లింగ’ సినిమాలతో ‘యంగ్ విలన్’గా మంచి మార్కులు కొట్టేశాడు దేవ్ గిల్. ‘‘చెడ్డ పాత్రల్లో నటించాలని నాకు మా చెడ్డ కోరిక’’ అంటాడు దేవ్‌గిల్.అందుకే కదా... దేవిందర్ సింగ్ గిల్ కాస్తా ఉదయఘడ్ సేనాధిపతి ‘రణదేవ్ బిల్లా’గా మనకు చేరువయ్యాడు! -
డై..లాగి కొడితే...
సినిమా : మగధీర రచన: ఎం. రత్నం దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి భారతదేశాన్నంతటినీ తానొక్కడే పరిపాలించాలని ఇతర రాజ్యాలపై దండయాత్ర చే సే షేర్‌ఖాన్ (శ్రీహరి) ఉదయ్‌ఘడ్ రాజ్యంపై దండెత్తేందుకు సైన్యంతో సిద్ధంగా ఉంటాడు. ఉదయ్‌ఘడ్ సుభిక్షంగా ఉండాలని యువరాణి మిత్రవిందతో (కాజల్ అగర్వాల్) భైరవకోనలో కాల భైరవునికి అభిషేకం చే యించే పనిలో ఉంటాడు కాలభైరవ (రామ్‌చరణ్). మిత్రవింద తనకు దక్కదని షేర్‌ఖాన్‌తో చేతులు కలిపి భైరవకోన వద్దకు వెళతాడు రణదేవ్ బిల్లా (దేవ్‌గిల్). నా మనుషుల్ని వందమందిని పంపిస్తా.. యువరాణి ఒంటిమీద చేయి పడకుండా ఆపు. ఈ రాజ్యాన్నీ, యువరాణిని నీకే అప్ప చెబుతా అంటాడు షేర్‌ఖాన్. వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకుని పంపించ మని చెబుతాడు భైరవ. వాళ్లను చూస్తేనే నువు చస్తావురా అని షేర్ ఖాన్ హెచ్చరిస్తాడు. లెక్క ఎక్కువైనా ఫర్వాలేదు తక్కువ కాకుండా చూస్కో అని బదులిస్తాడు భైరవ. వందలో ఒక్కడు మిగిలినా నువు ఓడినట్టేరా అని షేర్‌ఖాన్ అంటే.. ‘ఒక్కొక్కర్ని కాదు షేర్‌ఖాన్.. వందమందిని ఒకేసారి రమ్మను’ అంటాడు భైరవ. లక్షలాదికి నచ్చిన డైలాగ్ ఇది. -
ఎట్టకేలకు బాలీవుడ్లో మగధీరకు మోక్షం
-
మహేష్‌ను భయపెట్టిన మగధీర
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఇటీవల మగధీర సినిమా వల్ల భయపడ్డాడు.. అదేంటి ఎప్పుడో రిలీజ్ అయిన మగధీర ఇప్పుడు మహేష్ ను భయపెట్టడం ఏంటి అనుకుంటున్నారా.. అవునండి శ్రీమంతుడు సినిమా రిలీజ్ సమయంలో మగధీర సినిమా గుర్తుకు వచ్చిన మహేష్ చాలా టెన్షన్ పడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా మహేషే ప్రకటించాడు. శ్రీమంతుడు సినిమా తరువాత ఎంతో ఆనందంగా తన నెక్ట్స్ సినిమా బ్రహ్మోత్సవం షూటింగ్ స్టార్ట్ చేసిన సూపర్ స్టార్.. ఈ మూవీ రిలీజ్‌కు ఒక రోజు ముందు తన పరిస్థితిని వివరించాడు. ' శ్రీమంతుడు సినిమా ఎంతకలెక్ట్ చేసింది అన్న విషయం అప్రస్తుతం, ఈ సినిమా బిగ్ హిట్. ఇప్పుడు అందరూ హ్యాపి, కాని రిలీజ్‌కు ముందు రోజు మాత్రం నేను చాలా టెన్షన్ పడ్డాను. ముఖ్యంగా మగధీర లాంటి బిగ్ హిట్ సినిమా తరువాత దాదాపు రెండు నెలల పాటు ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. బాహుబలి సక్సెస్ తరువాత కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. అందుకే శ్రీమంతుడు రిలీజ్ తనను మరింత టెన్షన్ కు గురిచేసింది.' అంటూ ఆ రోజు తన టెన్షన్ గుర్తు చేసుకున్నాడు మహేష్. -
తమిళంలో ఎవడు మగధీర
రామ్‌చరణ్, అల్లు అర్జున్ కథానాయకులుగా నటించిన టాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రం ఎవడు. కోలీవుడ్‌లో మగధీరగా రానుంది. ముగ్గురు ముద్దుగుమ్మలు కాజల్, శ్రుతిహాసన్, ఎమిజాక్సన్ కథానాయికలుగా అభినయంతో పాటు అందాలు తెరపై ఆరబోసిన కలర్‌ఫుల్ చిత్రం ఎవడు. ఇంతవరకు భారతీయ సినిమాలో రానటువంటి ఒక కొత్త పాయింట్‌తో భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ, ప్రతీకారం, యాక్షన్ సన్నివేశాలకు ప్రాముఖ్యత నిస్తూ పక్కా కమర్షియల్ చిత్రంగా ఉంటుంది. ప్రస్తుతం నాగార్జున, కార్తీతో హీరోలుగా ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వంశీ పైడిపల్లి ఈ ఎవడు చిత్రానికి దర్శకుడు. ఒక యువకుడు రెండు రూపాలు. అదెలా, ఎందుకు మారాల్సి వచ్చింది అన్న ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఎవడు చిత్రాన్ని తమిళంలో మగధీరగా ఏవీవీఎస్నాయుడు సమర్పణలో భద్ర కాళీ ఫిలిం పతాకంపై భద్రకాళి ప్రసాద్ అనువదిస్తున్నారు. ఈయన ఇంతకుముందు తమిళంలో వంబు, భద్రత, గాయత్రి ఐపీఎస్, హిందీలో భాష, తదితర చిత్రాలను అనువదించారన్నది గమనార్హం. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటున్న మగధీర చిత్రాన్ని వచ్చే నెలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ చిత్రానికి ఏఆర్కే రాజా మాటలను, వివేకా, స్నేహన్, అరుణ్ భారతి, మీనాక్షి సుందరం పాటలు రాస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. -
ఒక్కొక్కడ్ని కాదు షేర్‌ఖాన్...
పంచ్ శాస్త్ర ఎప్పుడూ గంభీరంగా కనిపించే భైరవకోన ఆరోజు భావోద్వేగాలకు సంబంధించిన అనేక కోణాలతో వెలిగిపోతోంది. భయం, నిర్భయం, ఆగ్రహం, ఆరాటం, పోరాటం... వీరత్వం, రణతంత్రం... ఒకే సమయంలో అనేక రకాల అనుభూతులు ఆకాశంలో కారు మేఘాలై సంచరిస్తున్నాయి. దట్టంగా దుమ్ములేస్తుంది. చెవులు పిక్కటిల్లేలా గుర్రపు డెక్కల శబ్దం వినిపిస్తుంది. షేర్‌ఖాన్ వస్తున్నాడు. పేరులోనే కాదు ధైర్యంలోనూ అతడు షేరే. ‘నేను యుద్ధానికి పిలుపునిస్తే... ప్రతిఘటించ కుండానే రాజ్యం అప్పగించి పారిపోయిన రాజులు ఉన్నారు. నేను యుద్ధరంగంలోకి దిగితే... పోరాడకుండానే పారిపోయిన సైనికులు ఉన్నారు’ అని తనను తాను పరిచయం చేసుకునే షేర్‌ఖాన్ ఉదయ్గఢ్ను జయించడానికి, అదే రాజ్యానికి చెందిన రణదేవ బిల్లాను తొత్తుగా మార్చుకొని వస్తున్నాడు. రణదేవ బిల్లాకు రాజ్యం కాదు పిల్ల కావాలి. షేర్ఖాన్కి రాజ్యం కావాలి. ‘‘యువరాణిని విడిపిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్లో పెట్టి నా కాళ్లకు సలాం కొట్టు... పో... నిన్ను ప్రాణాలతో వదిలేస్తా’’ గర్జించాడు షేర్‌ఖాన్. ‘అలాగే మహారాజా’ అనే భయమేదీ వినిపించలేదు. భయాన్ని భయపెట్టే మాటొకటి కాలభైరవుడి నోటి నుంచి దూసుకొచ్చింది... ‘‘నేను నీకు మాటిస్తున్నాను షేర్‌ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పజెప్పు. నిన్నూ నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలిపెడతా’’ ఈ మాటకు తోక తొక్కిన తాచులా లేచాడు షేర్‌ఖాన్. ‘‘నాకు ప్రాణభిక్షపెడతావా? ఖుదా హు మై.. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కళ్లలో నిజం ఉంటే నా మనుషుల్ని వందమందిని పంపిస్తా. నీ ఒంటి మీద చేయిపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకు అప్పగిస్తా’’ అని ఆఫర్ ఇచ్చాడు షేర్‌ఖాన్. ‘‘వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని మరీ పంపించు షేర్‌ఖాన్’’ అని ధైర్యంగా బదులిచ్చాడు కాలభైరవ. ‘‘వాళ్లను చూస్తేనే నువ్వు సగం ఛస్తావురా’’ బెదిరింపు ఖడ్గం విసిరాడు షేర్‌ఖాన్. దాన్ని వేలిగోరుతో దూరంగా నెట్టి ‘‘ఎక్కువైనా ఫరవాలేదు. లెక్క తక్కువ కాకుండా చూసుకో’’ సవాలుకు సవాలు విసిరాడు కాలభైరవ. ‘‘ఆ వందలో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడిపోయినట్లే’’ కవ్వించాడు షేర్‌ఖాన్. ‘‘ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్ వందమందిని ఒకేసారి పంపించు’’ కాలభైరవుడి దమ్ముకు, ధైర్యానికి భైరవకోన నలుదిక్కులు ప్రతిధ్వనించాయి. ఒక్కడు కాదు... నిజంగానే వందమంది ఒకేసారి కాలభైరవుడి మీది వచ్చారు. మాటల్లో పొగరు మాత్రమే కాదు... చేతల్లో దమ్ము కూడా ఉందని నిరూపిస్తున్నాడు భైరవ. షురూ... ఒక్కటి... పది... ఇరవై మూడు... కుత్తుకలు తెగిపడుతున్నాయి. ‘పిచ్చేసే మారు’’ అరుస్తున్నాడు షేర్. ఇరవై తొమ్మిది... ముప్పై.. నిమిషాల వ్యవధిలోనే కౌంట్ పూర్తయింది. వంద శిరస్సులు... ఒక్క యోధుడికి వందనం చెబుతున్నాయి ‘‘చాలా షేర్‌ఖాన్... ఇంకో వందిమందిని పంపిస్తావా?’’ భైరవుడు అడుగుతున్నాడు. ఆ ఎర్రటి నేలపై షేర్‌ఖాన్ తెల్లటి ముఖం వేశాడు. ఒక్క చిత్రం వెయ్యి పదాలను చెబుతుంది అంటారు. ‘మగధీరా’ సినిమాలో ‘ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్... డైలాగులో మాత్రం ఒక్కో పదం రోమాలు నిక్కబొడుచుకునేలా వందల చిత్రాలను చూపించి పంచ్శాస్త్ర పవర్ ఏమిటో రుజువు చేసింది. సినిమా: మగధీర డైలాగ్: ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్ -
‘మగధీర’ను జీవితాంతం గుర్తుంచుకుంటా!
చిన్నప్పుడు సరదాగా కొన్ని ఆటలు ఆడుకుంటాం. అలా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా బోల్డన్ని ఆటలు ఆడుకున్నారు. వాటిలో మళ్లీ మళ్లీ ఆడుకున్న ఆట ఒకటి ఉందట. అదేంటంటే.. నెత్తికి టోపీ పెట్టుకుని, చేత్తో బెత్తం పట్టుకుని, తనను తాను ఓ పోరాట యోధుడిలా ఊహించుకుని, రాజసం ఉట్టిపడేలా బుజ్జి షాహిద్ నడిచేవాడట. సినిమాల్లోకొచ్చాక పోరాట యోధుడి పాత్ర వస్తే, చేయాలని చిన్నప్పుడే కలలు కనేవాడట. కానీ, హీరో అయిన ఈ పన్నెండేళ్లల్లో షాహిద్‌కి ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు ‘మగధీర’ రూపంలో ఆ కల నెరవేరుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. ఇందులో గుర్రమెక్కి స్వారీ చేస్తూ, పోరాట యోధుడిగా నటించడం ఆనందంగా ఉందనీ, చిన్నప్పుడు ఇష్టపడి ఆడుకున్న ఆటలోని పాత్రను చేయడం థ్రిల్‌గా ఉందనీ, ఆ కల నెరవేర్చిన ‘మగధీర’ జీవితాంతం గుర్తుండిపోతుందనీ షాహిద్ అంటున్నారు. -
బాలీవుడ్ మిత్రవింద?
తెలుగు తెర సంచలనం ‘మగధీర’ హక్కుల్ని దర్శకనిర్మాత సాజిద్ నడియాడ్వాలా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయకునిగా షాహిద్‌కపూర్ ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. మరి కథానాయిక పాత్ర పోషించేదెవరు? అనేది గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో నలుగుతున్న ప్రశ్న. తొలుత మాతృకలో కథానాయికగా నటించిన కాజల్ అగర్వాల్‌నే కథానాయికగా తీసుకోవాలని సాజిద్ నడియాడ్వాలా భావించారు. బాలీవుడ్ తెరపై మిత్రవిందగా కాజల్ మెరవనున్నారని వార్తలు కూడా మీడియాలో హల్చల్ చేశాయి. అయితే... కొందరు శ్రేయోభిలాషులు... ‘కాజల్ అయితే... ఫ్రెష్‌నెస్ ఉండదు’ అని చెప్పడంలో సాజిద్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట. మరి బాలీవుడ్ మిత్రవింద ఎవరు? అని అందరూ అనుకుంటున్న తరుణంలో... సీన్లోకి అలియా భట్ వచ్చారు. ఈ పాత్రకు అలియా వందకు వంద శాతం యాప్ట్ అని యూనిట్ మొత్తం ఏకగ్రీవంగా ఓటు వేయడంతో, అలియాను మిత్రవిందగా ఖరారు చేసేశారట సాజిద్. వచ్చే నెల చివర్లో ఈ సినిమా సెట్స్‌కి వెళుతుందని సమాచారం. -
త్వరలో ప్రేమ వివాహం చేసుకుంటున్నా: దీపు
ప్రతిభావంతులైన నేటి తరం యువ గాయకుల్లో దీపు ఒకరు. ఎనిమిదేళ్ల క్రితం ‘టెన్త్‌క్లాస్’ సినిమా ద్వారా గాయకునిగా పరిచయమయ్యారు తను. ఇప్పటివరకూ మూడొందల పై చిలుకు సినీ గీతాలను ఆలపించి, తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఓ మంచి స్థానాన్ని సాధించిన ఈ యువ సంగీత కెరటంతో ‘సాక్షి’ సంభాషణ... కెరీర్ ఎలా ఉంది? బావుందండీ.. కెరీర్ ప్రారంభించినప్పట్నుంచీ ఒక్క రోజు కూడా ఖాళీగా లేను. పాడుతూనే ఉన్నాను. నా సక్సెస్‌కి కారణం.. నా సంగీత దర్శకులే. మీ కెరీర్లో మీకు బాగా పేరుతెచ్చిన పాటలు? ‘యమదొంగ’లో ‘నాచోరె నాచోరె..’, ‘చిరుత’లో ‘లవ్యూ రా.. లవ్యూ రా..’, ‘మగధీర’లో ‘నా కోసం నువ్ జుట్టు పీక్కుంటే బాగుంది..’, ‘రచ్చ’లో ‘ హీ ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ’.. ఇలా చాలా పాటలున్నాయి. అయితే.. ఇవన్నీ ఓ ఎత్తు ‘ఈగ’లో కీరవాణిగారు పాడించిన ‘నేనే నానినే నేనే నానినే..’ పాట ఓ ఎత్తు. గాయకునిగా నన్ను మరో మెట్టు పై కూర్చోబెట్టిందీ పాట. మీ కెరీర్లో మరిచిపోలేని ప్రశంస? ‘నేనే నానినే..’ పాట చరణంలోని ఓ లైన్ హై పిచ్‌లో ఉంటుంది. నాకంటే ముందు ఆ పాటను కొంతమందితో పాడించారట కీరవాణి. కానీ.. ఆయనకు నచ్చలేదు. నేను పాడిన తీరుతో ఆయన సంతృప్తి చెందారు. ‘ఈ పాట నీ కోసమే పుట్టినట్లుంది. హై పిచ్‌ని బాగా అందుకున్నావ్’ అని కీరవాణిగారు ఇచ్చిన ప్రశంస జీవితంలో మరచిపోలేను. సింగర్లు ఎక్కువైపోయారు కదా! పోటీ కష్టంగా ఉందా? పోటీ ఎక్కువే. కానీ.. నా స్థానం నాకుందని నేను నమ్ముతాను. నా అదృష్టం బాగుండి మంచి పాటలు పాడాను. ఇంకా పాడాలి. గాయకునిగా చెరగని స్థానాన్ని సంపాదించాలి. నా ముందున్న కర్తవ్యం అదే. గాయకునిగా ప్రేరణ? చిన్నప్పట్నుంచీ బాలూగారి పాటలు వింటూనే పెరిగాను. ఆయనలా పాడాలని ప్రయత్నించేవాణ్ణి. పాటల పోటీల్లో కూడా పాల్గొనేవాణ్ణి. శంకర్‌మహదేవన్, కె.కె ప్రభావం కూడా నాపై ఉంది. ఇంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? తాతగారు పాడేవారట. మా బాబాయ్ కూడా మ్యూజికల్ నైట్స్‌లో పాడేవారు. వారి పోలికే వచ్చిందేమో! సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది? ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లోని నా పాట మిక్కీ జె.మేయర్‌గారికి నచ్చిందట. వెంటనే... టెన్త్‌క్లాస్’ సినిమాకు నాతో పాడించారు. అలా సింగర్‌ని అయ్యా. మ్యూజిక్ డెరైక్షన్ చేయాలనే ఆలోచనేమైనా ఉందా? ప్రస్తుతానికి లేదు. అయితే... ఓ ఆల్బమ్ మాత్రం చేస్తా. ఎవరైనా ఆల్బమ్ చేయడానికి ముందుకొస్తే సరే. లేకపోతే నా సొంత ఖర్చుతోనే ఆల్బమ్ చేస్తా. మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు కదా! ఇప్పటివరకూ ఎన్ని దేశాల్లో పాడారు? ‘సూపర్‌సింగర్’ కార్యక్రమం నాకు ఎక్కడలేని గుర్తింపును తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మ్యూజికల్ షోస్ ఇచ్చానంటే దానికి ‘సూపర్‌సింగర్’ కార్యక్రమమే కారణం. ఇప్పటివరకూ అమెరికా, దుబాయ్, మస్కట్, మలేసియా, సింగపూర్... తదితర ప్రదేశాల్లో షోలు చేశాను. గాయకునిగా మీ లక్ష్యం? బాలీవుడ్లో పాడాలి. ఇళయరాజా, రెహమాన్‌లతో పనిచేయాలని ఉంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకుంటూనే ఉన్నాను. మ్యూజిక్‌లో డిప్లమా చేశాను. ప్రస్తుతం రామాచారి వద్ద లైట్ మ్యూజిక్, విజర్సు బాలసుబ్రమణ్యంగారి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నా. అసలు మీ స్వస్థలం ఏది? నేను పూర్తి హైదరాబాదీని. ఇక్కడే బీటెక్ చేశాను. మరి పెళ్లెప్పుడు? ఆ పనిలోనే ఉన్నా. త్వరలోనే చెబుతా. ప్రేమ వివాహమా? అవును. ఎవరా అమ్మాయి. ఆమె సింగరేనా? కాదు..అసలు నా ప్రొఫెషన్‌తో ఆమెకు సంబంధం లేదు. -
‘మగధీర’ దెబ్బకు చెయ్యి మడత పడింది!
పావలా ఇస్తే బిందెలు మోసిన బాహుబలి... ఎన్నోసార్లు మృత్యువుని ముద్దాడి వచ్చిన మగధీర... ఆకలి చేసిన మరమ్మత్తులతో రాటుదేలిన రోబో... కష్టాల్ని కూడా ఇష్టంగా తీసుకునే డార్లింగ్... పీటర్ హెయిన్ గురించి ఇంకా ఏం చెప్పాలి? ప్రతి క్షణం ఓ పోరాటం.. ప్రతి మలుపు ఓ పోరాటంపాణాలకు తెగించి మృత్యువుతో పోరాడడమే పీటర్ జీవితం! ఫైట్‌మాస్టర్ అంటే తనను తక్కువ చేసినట్టే! అతని సాహసం... అంకితభావం... మనుషుల పట్ల ఆరాటం... ఇవన్నీ తెలుసుకుంటే... అతను ఓ పోరాటయోధుడని ఎవరైనా ఇట్టే ఒప్పుకుంటారు. ఊహించని మలుపులతో సాగుతున్న ఆ జీవితం వెంట పీటర్ హెయిన్ మాటల్లోనే పయనిద్దాం... రండి... చెన్నయ్‌లోని వడపళనిలో మాదో చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంట్లోనే అమ్మా, నాన్న, నానమ్మ, నేను, అక్క, చెల్లి... ఇంతమందిమి ఉండేవాళ్లం. మా నాన్న పేరు పెరుమాళ్. ఊరు తమిళనాడు. అమ్మది వియత్నామ్. నేను పుట్టి, పెరిగింది మాత్రం చెన్నయ్‌లోనే. రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున.. ఇలా స్టార్ హీరోల సినిమాలకు నాన్న ‘స్టంట్ మేన్’గా పనిచేసేవారు. షూటింగ్ ఉంటే డబ్బులొచ్చేవి. అది కూడా మా కుటుంబానికి సరిపడేంత వచ్చేవి కాదు. పైగా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే. అమ్మ బ్యూటీషియన్‌గా చేసేది. ఆమె నెల జీతం 300 రూపాయలు. జీవితమే నా పాఠశాల! చాలామందిలా నా బాల్యం పూలబాట కాదు. మంచి బట్టలుండేవి కాదు. ఆకలి బాధైతే ఎప్పుడూ ఉండేదే. ఒక్కోసారైతే నూకలతో చేసిన గంజి మాత్రమే తాగేవాళ్లం. ఆదివారం వస్తే, రెండే రెండు గుడ్లు వండేవాళ్లు. తలా ఓ ముక్క తినేవాళ్లం. కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితుల్లో నన్ను బడికి ఎలా పంపించగలుగుతారు? అలా నాకు పదేళ్లు వచ్చేశాయ్. కానీ, జీవితమే నాకు బోలెడన్ని పాఠాలు నేర్పించింది. చదవడం, రాయడం అన్నీ నాకు నేనుగా నేర్చుకున్నాను. చదివించకపోయినా, ‘బతకడం ఎలాగో’ నేర్పించిన మా అమ్మా నాన్న నా దృష్టిలో దేవుళ్లు. చిన్నప్పుడు నాకేదో ఆపరేషన్ జరిగింది. మా ఇంటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి 8 కిలోమీటర్లు. అప్పట్లో బస్సు టిక్కెట్కయ్యే 60 పైసలు కూడా మా దగ్గరుండేవి కాదు. దాంతో, ఉదయాన్నే ఇంటి దగ్గర నీళ్లు తాగేసి, ఎనిమిది కిలోమీటర్లూ నడుచుకుంటూ వెళ్లి, చెకప్ చేయించుకుని వచ్చేవాణ్ణి. పావలా కోసం బిందెడు నీళ్ళు మోసేవాణ్ణి! మా ఇంటి పక్కన ఓ టీ షాప్ ఉండేది. ఒక రోజు ‘రెండు బిందెలు నీళ్లు తెచ్చిపెడతావా?’ అని అడిగాడు టీ కొట్టు యజమాని. అప్పుడు నా దగ్గర పావలా కూడా లేదు. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ఎవరెవరికి నీళ్లు కావాలో వాళ్ల దగ్గర బిందెకు పావలా చొప్పున తీసుకుని, నీళ్లు మోసుకెళ్లడం మొదలుపెట్టాను. సైకిల్ మీద నాలుగైదు బిందెలు పెట్టుకుని మెల్లిగా నెట్టుకుంటూ వెళ్లేవాణ్ణి. బతుకు తెరువు కోసం నీళ్లు మోయడంతో పాటు సర్వర్‌గా, మెకానిక్‌గా, వెల్డర్‌గా, టైలర్‌గా, వంట మనిషికి సాయం చేసే కుర్రాడిగా... ఇలా రకరకాల పనులతో బిజీగా ఉండేవాణ్ణి. చైనీస్ లుక్కే వరమైంది! మరోవైపు మా నాన్న దగ్గర మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకునేవాణ్ణి. అప్పుడప్పుడూ మా నాన్నగారి స్టూడెంట్స్‌కి ఫైట్స్ నేర్పించేవాణ్ణి. అదృష్టం కొద్దీ ఓ సినిమాకి చైనా వాడిలా కనిపించే స్టంట్ మేన్ కావాల్సి వస్తే, నన్ను తీసుకెళ్లారు. నేను చేసిన ఫైట్స్‌కి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో స్టంట్ మేన్‌గా యూనియన్‌లో సభ్యత్వ కార్డ్ తీసుకున్నాను. సినిమాల్లోకి వచ్చిన ఏడాదికే కనల్ కణ్ణన్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ ఫైట్ మాస్టర్‌గా పని చేయడం మొదలుపెట్టాను. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే. ‘మురారి’తో ఫైట్ మాస్టర్నై, తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలెన్నో చేశా. అంగ వికలాంగురాల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా! సినిమాలు చేయడం మొదలుపెట్టాక నాకు వేరే జీవితం ఉంటుందనే విషయాన్నే మర్చిపోయా. అప్పటికి షూటింగ్లో చాలాసార్లు ప్రమాదాలకు గురయ్యా. ఓ రోజు నాన్న నన్ను పిలిచి, ‘ఇప్పటికే చాలాసార్లు ఎముకలు విరగ్గొట్టుకున్నావ్. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే నీకు నలభై వచ్చేటప్పటికి పిల్లలు చిన్నవాళ్లవుతారు. నీకు జరగకూడనిది ఏదైనా జరిగితే, వాళ్లేమవుతారు’ అన్నారు. దాంతో, పెళ్లి చేసుకోవడానికి ఓకే కానీ.. అంటూ ఓ కండిషన్ పెట్టా. అందంగా ఉన్న అమ్మాయిలనూ, డబ్బున్నవాళ్లనూ ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. అందుకే, అంగ వైకల్యం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ, మా నాన్న గారు నా నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారు. కనీసం పేదింటి అమ్మాయినైనా పెళ్లాడతా అని చెప్పా. నన్ను కూడా ప్రేమిస్తారా? ఈ ప్రపంచంలో అందంగా ఉన్నవాళ్లని ఓ రకంగా, నాలా అందవిహీనంగా ఉన్నవాళ్లని మరో రకంగా చూస్తారు. ఇక, నన్నెవరు ప్రేమిస్తారు? ‘కావ్య తలైవన్’ అనే తమిళ సినిమా కోసం స్టంట్ మేన్‌గా చేస్తున్నప్పుడు ఓ వ్యక్తితో పరిచయం అయింది. ఓ సారి మా ఇంటికి తీసుకెళితే, తనకో చెల్లెలుందని తెలిసి, మా అమ్మ ఆరా తీసింది. వాళ్లూ మా లాంటివాళ్లే. వాళ్ళ నాన్న భారతీయుడు. వృత్తి రీత్యా వియత్నామ్ వెళ్లినప్పుడు అక్కడి అమ్మాయిని ఆయన ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నయ్‌లో స్థిరపడ్డారు. సాదాసీదా కుటుంబం. అందుకని వాళ్లతో సంబంధం కలుపుకుందామని అమ్మ అంటే, ఓకే అన్నా. వాళ్లు తమిళనాడులోని కారైక్కాల్‌లో ఉండేవాళ్లు. చెన్నయ్ నుంచి 390 కిలోమీటర్ల దూరం. నా ఫ్రెండ్‌ని తీసుకుని మోటార్‌బైక్‌లో ఆ ఊరెళ్లాను. దేవుడు ఇద్దరు దేవతలనిచ్చాడు! అప్పటికి తెల్లవారుజామున ఐదున్నర గంటలైంది. చిన్న గుడిసెలో నుంచి ఆ అమ్మాయి బయటికొచ్చి వాకిలి ఊడ్చి, అందంగా ముగ్గులేసింది. ఇంటిని సరిగ్గా చూసుకోగలదనే నమ్మకం కుదిరి, జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్నా. ఆమె పేరు పార్వతి. చాలా మంచిది. ఆ దేవుడు నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఇద్దరు దేవతలను ఈ భూలోకానికి పంపించాడేమో. ఒకరు మా అమ్మ.. మరొకరు నా శ్రీమతి. నా భార్యకు నేను తాజ్‌మహల్ కట్టించకపోయినా ఫర్వాలేదు.. నాలా ఆస్పత్రికి నడిచి వెళ్లే స్థితి మాత్రం తనకు, మా పిల్లలకు రాకూడదని, ఆర్థికంగా నేనో స్థాయికి వచ్చాకే పెళ్లి చేసుకున్నా. జాకీచాన్ వీరాభిమానిని! యాక్షన్ సన్నివేశాలను జాకీచాన్ చేసే తీరు నాకు చాలా ఇష్టం. ఓ రకంగా నేను ఆయనకు వీరాభిమానిననొచ్చు. కానీ ఆయనను అనుకరించడానికి యత్నించను. నేను ఆదర్శంగా తీసుకునేది కరాటే వీరుడు బ్రూస్లీనే. నేను ఆయనకు ఏకలవ్య శిష్యుణ్ణి. బ్రూస్లీ ఫైట్స్ చూసి చాలా నేర్చుకున్నా. బాత్రూమ్లో తనివి తీరి ఏడ్చా! శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా రూపొందిన ‘ముదల్వన్’ (తెలుగులో ‘ఒకే ఒక్కడు’) సినిమాకి నేను స్టంట్ మేన్‌ని. అప్పటికి నాకు పెళ్లయి ఓ రెండేళ్లు అవుతుందేమో! ఆ సినిమా కోసం ఒంటి మీద నూలు పోగు లేకుండా వీపుకు జెల్ రాసుకుని, పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని పై నుంచి కిందకు దూకే సీన్ తీయాలి. చాలా రిస్క్. ధైర్యం చేశాను. తీశాం కానీ, తృప్తికరంగా అనిపించలేదు. ‘మళ్లీ తీద్దాం సార్’ అని శంకర్ గారితో, ఫైట్‌మాస్టర్ కనల్ కణ్ణన్గారితో అన్నా. రిస్క్ కాబట్టి, ‘నీకేమైనా పిచ్చా’ అన్నారు. నాకు కూడూ గుడ్డా ఇచ్చిన వృత్తికి న్యాయం చేయాలంటే మళ్లీ తీయాల్సిందేనని పట్టుబట్టా. మర్నాడు తెల్లవారుజామున 2 గంటలకు ఆ సీన్ ప్లాన్ చేశాం. తీరా ముందు రోజు రాత్రి 12 గంటలకు ఇంటికెళ్లాను. నా భార్యను చూస్తే ఏడుపు ఆగలేదు. కానీ, తన ముందు ఏడిస్తే, కంగారుపడుతుందని దిగమింగుకున్నా. కాఫీ కావాలనడిగి, తను అటెళ్లగానే మా ఆరు నెలల బాబును గుండెలకు హత్తుకున్నా. బాత్రూమ్లోకెళ్లి, షవర్ ఓపెన్ చేసుకుని, తనివి తీరా ఏడ్చా. బయటికొచ్చిన తర్వాత నా కళ్లు చూసి, ‘ఏంట’ని నా భార్య అడిగితే, సబ్బు నురుగ పడిందన్నాను. ఇంట్లోనే హెల్మెట్ పెట్టుకున్నా! అర్ధరాత్రి రెండింటికి షూటింగైతే, ఇంట్లో ఉన్న ఆ రెండు గంటలూ నా మనసు మనసులో లేదు. రెడీ అయ్యి ఇంటి నుంచి బయటికొస్తుంటే ఏడుపొచ్చేసింది. అది కనిపించకూడదని ఇంట్లోనే హెల్మెట్ పెట్టేసుకున్నా. మా ఆవిడ విచిత్రంగా చూసింది. బయటకు అడుగుపెట్టేటప్పుడు, ‘దేవుడా... నేను బతికితే ఓకే. ఒకవేళ ఏదైనా జరిగితే నా భార్యను, బిడ్డను నా అంతగా ప్రేమించే ఓ తోడునివ్వు. నేనిప్పటివరకు అన్నీ మంచి పనులే చేశాను కాబట్టి, స్వర్గానికి పంపించు. పిల్లల బాధ్యతలు తీరిన తర్వాత నా భార్యను నా వద్దకు పంపించు’ అని వేడుకున్నాను. లొకేషన్‌కి వెళ్లిన తర్వాత నా భార్యకు ఫోన్ చేసి, ‘షూటింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ వెళతా. అక్కడికెళ్లిన తర్వాత కాల్ చేస్తా. లేకపోతే నా నుంచి కాల్ రాదు. నువ్వే చెయ్యాలి’ అని చెప్పా. దానర్థం నాకు మాత్రమే తెలుసు. ఇక ప్రాణాలకు తెగించకూడదనుకున్నా! షూటింగ్‌కి రెడీ అయి... గుండె దిటవు చేసుకుని మేడ పెకైక్కా. ఒంటి మీద బట్టలు తీసి, వీపుకు జెల్ రాయించుకుని, పెట్రోల్ పొయ్యమన్నాను. నిప్పంటించగానే కిందకు ఒక బాక్సులోకి దూకాలన్నమాట. దూకాను... ఆ పెట్టెలో నుంచి నన్ను తీసి, మంటలార్పడానికి బెడ్‌షీట్‌తో నా వీపు మీద రుద్దారు. దాంతో చర్మం ఊడొచ్చింది. కానీ, బతికాం కదా అని సంబరపడిపోయా. ఆ తరువాత పాన్‌కేక్‌తో వీపు మీద మేకప్ చేశాక, మరో షాట్ కోసం అలాగే మంటలతో కిందే పరిగెత్తా. ఏదైనా రిస్కే కదా! అయినా చేశా. ఆ రోజుకు నా పారితోషికం ఎంతో తెలుసా? మూడు వేలు. అందులో కొంత యూనియన్‌కి వెళ్లిపోతుంది. ఏమైనా.. ప్రాణాలను పణంగా పెట్టకూడదనీ, లేనిపోని వాగ్దానాలు చేయకూడదనీ ఆ రోజు నిర్ణయించుకున్నా. ‘మగధీర’ దెబ్బకు చెయ్యి మడతపడిపోయింది! ఇలా మరణం అంచుల దాకా వెళ్లొచ్చిన సంఘటనలు ఇంకా ఉన్నాయి. ‘మగధీర’లో బైక్‌తో పోటీ సన్నివేశం తీసేటప్పుడు పెద్ద ప్రమాదం జరిగింది. బ్యాలెన్స్ తప్పడంతో పడ్డాను. గడ్డం దగ్గర బాగా దెబ్బ తగిలింది. చెయ్యి వెనక్కి మడతపడిపోయింది. ఎముక అటూ ఇటూ అవడంతో చెయ్యి ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తే, వెనక్కి వెళ్లేది. ఆస్పత్రికి వెళ్లేవరకు నా మనసు మనసులో లేదు. అంతకుముందు రెండు, మూడుసార్లు వెన్నెముకకు దెబ్బ తగిలింది. దాంతో ఆస్పత్రికి వెళ్లగానే, ‘నా వెన్నెముక బాగానే ఉంది కదా. ముందు అది చూడండి. ఆ తర్వాత చికిత్స చేయొచ్చు’ అన్నా. డాక్టర్లు స్కానింగ్ తీసి, బాగానే ఉందన్నాక, ఊపిరి పీల్చుకున్నాను. స్నానం చేస్తుంటే పక్షవాతంతో కుప్పకూలా! పెద్ద పెద్ద ప్రమాదాలు ఎన్ని జరిగినా వెనకడుగు వేయలేదు. ఒకసారైతే ఓ షూటింగ్లో దెబ్బ తగిలింది. నేనేం పట్టించుకోలేదు. ఇంటికి రాగానే స్నానం చేద్దామని, షవర్ కింద నిలబడ్డా. తల మీద నీళ్లు పడగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయా. ఒక కాలు, చెయ్యి పని చేయలేదు. పక్షవాతం వచ్చింది. మరో కాలితో శరీరాన్ని ఈడ్చుకుంటూ ఎలాగోలా బయటికొచ్చాను. డాక్టర్లు లాభం లేదన్నారు. అన్నం తినిపించడం, స్నానం చేయించడం అంతా మా ఆవిడే. ఇక జీవితం అంతేనేమో అనుకున్నా. రెండు, మూడుసార్లు నడవడానికి ప్రయత్నించి, కిందపడేసరికి పళ్లు ఊడాయి. అలా 18 రోజులు విశ్వప్రయత్నాలు చేశాక కానీ, కాలూ చెయ్యి స్వాధీనంలోకి రాలేదు. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. దేవుడే నన్ను కాపాడాడనుకున్నా. నేనంతే.. అదో టైప్! ఇవాళ కొంతమంది దర్శకుల కన్నా నా పారితోషికం ఎక్కువే. అంత మాత్రాన నా ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయనుకుంటే పొరపాటే. పావలా కోసం పని చేసినవాణ్ణి. చెత్త నుంచి పైకొచ్చినవాణ్ణి. ఇవాళ చేతిలో రూపాయి లేకపోయినా బతకగలను. నాదో చిత్రమైన శైలి. ఒక్కోసారి 30 రూపాయల భోజనం తింటా. కొన్నిసార్లు అందుకు భిన్నంగా విమానంలో వియత్నామ్ వెళ్లిపోయి, భోజనం కోసం రెండు, మూడు లక్షలు ఖర్చు చేస్తా. కంపోజ్ చేసే ఫైట్స్లానే నేనూ కొత్తగా, విచిత్రంగా కనిపించాలనుకుంటా. అందుకే, జుట్టుకు రకరకాల రంగులు వేసుకుంటుంటా. ఒకసారి రింగుల జుట్టు, మరోసారి పొడవాటి జుట్టు... ఇలా స్టయిల్ మార్చేస్తుంటా. సంపాదనలో పావు భాగం వృద్ధులకు, పిల్లలకు..! ఇవాళ నేనో లక్ష రూపాయలు సంపాదిస్తే, అందులో పావు వంతు వృద్ధాశ్రమాలకూ, అనాథాశ్రమాలకూ ఇచ్చేస్తా. వృద్ధాశ్రమానికి ఇవ్వడానికి కారణం మా నాన్నమ్మ. నాకు పదమూడేళ్లప్పుడు ఆమె చనిపోయింది. మూడేళ్లు పక్షవాతంతో బాధపడింది. తనకు స్నానం చేయించేవాణ్ణి. అన్నం తినిపించేవాణ్ణి. నాన్నమ్మ పక్కన ఎవరో ఒకళ్లు ఉంటే మంచిదనిపించి, ఆ మూడేళ్లు నేను పెద్దగా బయటకు వెళ్లేవాణ్ణి కాదు. మా అమ్మా నాన్నల కన్నా నాకు నాన్నమ్మే ఎక్కువ. తనలాంటివాళ్లు వృద్ధాశ్రమాల్లో ఉంటారు కాబట్టే, విరాళం ఇస్తుంటాను. అలాగే, చిన్నప్పుడు ఎన్నో బాధలు పడ్డప్పటికీ, అమ్మానాన్న, అక్కాచెల్లెళ్ల ప్రేమ నాకు లభించింది. ఇక, వాళ్లు కూడా లేనివాళ్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో? అందుకే అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తుంటా. లక్ష సంపాదించినప్పుడు నా అవసరాలకు 80 వేలు కావాలనుకోండి.. అప్పుడు కూడా 75 వేలే ఉంచుకుని, 25 వేలు ఆశ్రమాలకు ఇచ్చేస్తా. తదుపరి పారితోషికంలో ఆ 5 వేలు తీసుకుంటా. ఇవాళ అందరూ నన్ను ‘స్టార్ ఫైట్ మాస్టర్’ అని అంటూ ఉంటారు. కానీ, నిజం చెప్పాలంటే మా నాన్న గారు నా కన్నా గొప్ప. నేనీ స్థాయిలో ఫైట్స్ చేస్తున్నానంటే, నాకు శిక్షణనిచ్చిన మా నాన్న ఏ స్థాయిలో చేసి ఉండేవారో ఊహించవచ్చు. మంచి అవకాశాలొచ్చాయి కాబట్టి నేను నిలదొక్కుకున్నా. ఇలాంటి అవకాశాలు వచ్చి ఉంటే మా నాన్న గారు ‘తిరుగులేని ఫైట్ మాస్టర్’ అనిపించుకుని ఉండేవారు. మా పిల్లలు ఫైట్స్ మానేయమంటారు! నాకు ఓ బాబు, పాప. ప్రస్తుతం బాబు ప్లస్ టూ, పాప ఆరో తరగతి చదువుతున్నారు. సినిమాలు, కుటుంబం మినహా నాకు మరో యావ లేదు. నాది రిస్కీ లైఫ్. ఏ క్షణాన ఏం జరుగుతుందో నాకే తెలియదు కాబట్టి, నా పేరు మీద ఆస్తులు కూడా ఉంచుకోను. అన్నీ నా భార్య పేరు మీదే పెట్టేశా. షూటింగ్లో నాకు బాగా దెబ్బలు తగిలినప్పుడు నా భార్య, పిల్లలు నన్ను తాకడానికి కూడా చాలా భయపడతారు. నాకు నొప్పి కలుగుతుందేమోనని వారి భయం. కానీ, ఆ సమయంలో వాళ్లు ముగ్గురూ నా బుగ్గ మీద ఇచ్చే ముద్దు... కాసేపు నా నొప్పిని మాయం చేసేస్తుంది. అందుకే అంటాను... ముద్దు విలువ నొప్పి కన్నా ఎక్కువ అని! ‘మా డాడీ గొప్ప ఫైట్‌మాస్టర్’ అని మా పిల్లలు గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ, షూటింగ్లో నాకయ్యే గాయాలు చూసి, పిల్లలు ‘డాడీ.. ఫైట్స్ మానేయవా..’ అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు. మా అబ్బాయి పెద్దయిన తర్వాత ఫైట్ మాస్టర్‌గా చేస్తానంటే నేనొప్పుకోను. వాస్తవానికి యాక్షన్ అనేది నాకు తగిన వృత్తి కాదు. బతకడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఈ రంగంలోకి వచ్చాను. కానీ, నా బిడ్డలకు ఆ అవసరం లేదు. వాళ్లకి నేను మంచి జీవితమిచ్చా. (ఒకింత ఉద్వేగానికి గురవుతూ.....) నేను ఎన్ని కష్టాలైనా అనుభవించగలను కానీ, నా బిడ్డల కష్టాలు చూసి, తట్టుకునేంత ఆత్మస్థయిర్యం మాత్రం నాకు లేదు. - డి.జి. భవాని మేమూ మనుషులమే! ఫైటర్లూ మనుషులే అని కొంతమంది దర్శక, నిర్మాతలు అనుకోరు. ప్రమాదభరితమైన ఫైట్లను హీరోలకు బదులుగా ఫెటర్లే చేస్తుంటారు. అలాంటి సమయంలో ఫైటర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా దర్శక, నిర్మాతలు సమయం ఇవ్వరు. స్టార్లకేమో మామూలుగా కూడా ఎలాంటి నిబంధనలూ ఉండవు. వాళ్లు మేకప్ చేసుకునేవరకు ఆగుతారు. కాఫీలు, టీలు తాగడానికి కోరినంత టైమ్ ఇస్తారు. కానీ, ఒక జీవితం క్షేమంగా ఉండటం కోసం మాకు మాత్రం టైమ్ ఇవ్వరు. నాకిలాంటివి బోలెడన్ని ఎదురయ్యాయి. అందుకే, నా అసిస్టెంట్ల విషయంలో అలా జరగకుండా చూసుకుంటా. ఎంత సమయమైనా సరే జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతే షాట్ తీద్దామని చెబుతా. ఆ 24 గంటలు నేనెవరో నాకే తెలియదు! నేను స్టంట్ మేన్‌గా చేస్తున్న రోజులవి. ఓ షూటింగ్లో వేగంగా వెళుతున్న కారులో నుంచి అమాంతంగా దూకాలి. కానీ, నేను దూకిన చోట రాయి ఉండటంతో అది నా తలకు తగిలింది. అయితే పెద్దగా నొప్పి లేకపోవడంతో పట్టించుకోలేదు. కాసేపు బాగానే ఉన్నాను. కానీ, ఆ తర్వాత యూనిట్ సభ్యులతో ‘నేనెక్కడున్నాను’ అని అడగడంతో షాకయ్యారట. నా బైక్ దగ్గరే నిలబడి ‘నా బండి ఎక్కడుంది?’ అని అడగడంతో ఏదో తేడా జరిగిందని గ్రహించారట. ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి అడ్రసడిగితే.. ఏవేవో పేర్లు చెప్పానట. ఇంటికెళ్లిన తర్వాత కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడటంతో అమ్మకు భయమేసి హాస్పటల్‌కి తీసుకెళ్లిందట. అప్పుడు మెదడులో ఓ చోట రక్తం గడ్డ కట్టుకుపోయిందని చెప్పి, డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత నేను మామూలు మనిషిని అయ్యానని అమ్మ చెప్పింది. ఆ 24 గంటలు నేనెవరో నాకే తెలియదు. -
బెంగాలీ ‘మగధీర’!
తెలుగులో ఘనవిజయం సాధించిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్య హిందీ పరిశ్రమ వారి దృష్టి మాత్రం మన సినిమాల మీదే ఉంది. పోకిరి, విక్రమార్కుడు, రెడీ, కిక్.. ఇలా ఇటీవలి కాలంలో హిందీలో రీమేక్ అయిన తెలుగు సినిమాల జాబితా చాలానే ఉంది. ఒక్క హిందీ మాత్రమే కాకుండా ఉత్తరాదిన బెంగాలీ పరిశ్రమ దృష్టి కూడా టాలీవుడ్‌పై ఉన్నట్లుంది. ఎందుకంటే, రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మగధీర’ బెంగాలీ భాషలో రీమేక్ అవుతోంది. దేవ్, మిమి చక్రబర్తి జంటగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘రాజ్ చక్రబర్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం దేవ్ గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. అలాగే సిక్స్ ప్యాక్‌లో కనిపించబోతున్నారు. తెలుగు పరిశ్రమను ‘టాలీవుడ్’ అంటామనే విషయం తెలిసిందే. బెంగాలీ పరిశ్రమను కూడా అదే పేరుతో పిలుస్తారు. దేవ్‌కి ‘కింగ్ ఆఫ్ టాలీవుడ్’ అనే పేరుంది. అక్కడ అత్యధిక పారితోషికం తీసుకునే హీరో దేవ్ అని సమాచారం. -
మగధీర కామెడీ స్పూఫ్
-
కళా దర్శకుడు రవీందర్‌కు అరుదైన పురస్కారం
సినీ పరిశ్రమలో కళాదర్శకునిగా రవీందర్ స్థానం ప్రత్యేకం. ఛత్రపతి, మగధీర, మర్యాదరామన్న, ఈగ, రాజన్న, జులాయి చిత్రాలకు కళా దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలందుకున్నారాయన. కళాదర్శకునిగా ఇప్పటికి మూడుసార్లు నంది పురస్కారాలు అందుకున్న రవీందర్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి మెరవనుంది. ‘ఈగ’ చిత్రం కోసం రవీందర్ వేసిన విలన్ హౌస్ సెట్, మైక్రో ఆర్ట్ వర్క్‌కు గాను బ్రెజిల్ చలనచిత్రోత్సవంలో ‘ఉత్తమ కళా దర్శకుడు’ పురస్కారానికి రవీందర్ ఎంపికయ్యారు. ఈ చలనచిత్రోత్సవంలో పురస్కారం అందుకోబోతున్న తొలి తెలుగు సినీ సాంకేతిక నిపుణుడు రవీందరే కావడం విశేషం. పవన్‌కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రానిక్కూడా రవీందరే కళా దర్శకుడు. పలు బాలీవుడ్ చిత్రాలక్కూడా పనిచేస్తున్నారాయన.