నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా ప్రమోషన్స్ చాలా స్సీడ్‌గానే జరుగుతున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చందు మొండేటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ కోసం సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారో చెప్పారు.
అమ్మాయిలకు వైట్ స్కిన్ ఉంటే సరిపోదు..
వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘తండేల్’ అని అల్లు అరవింద్ అన్నారు. లవ్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి యాక్షన్ కూడా ఇందులో ఉంటుంది. తండేల్ రాజు పాత్రలో నాగచైతన్య అద్భుతమైన నటన చూస్తారని ఆయన అన్నారు. ఇదే సమయంలో సాయి పల్లవి గురించి ఆయన ఇలా అన్నారు. 'తండేల్‌లో సాయి పల్లవి ఎంపిక నాదే.. కమర్షియల్‌గా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. బుజ్జితల్లి పాత్ర కోసం ముంబైకి వెళ్లి హీరోయిన్‌ను తీసుకురాలేదు.
అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిల స్కిన్ వైట్‌గా ఉండొచ్చు కానీ, ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనేది నా అభిప్రాయం. కథలో ఈ పాత్ర చుట్టూ చాలా భావోద్వేగాలు ఉంటాయి. సినిమా చూశాక సాయి పల్లవి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ పాత్ర సాయి పల్లవి అయితే చాలా నిజాయతీగా నటించగలదని అనుకున్నాను. అందరి అంచనాలకు మించి ఆమె వంద శాతం సినిమాకు న్యాయం చేసింది. ఆమెలోని టాలెంట్ అనంతం.' అని చెప్పవచ్చన్నారు.
అదీ.. నా అల్లుడిపై ప్రేమ
రామ్ చరణ్‌తో పాటు గీతా ఆర్ట్స్‌కు మగధీర సినిమా చాలా ప్రత్యేకం. ఈ సినిమాను చరణ్‌తో చేయాలని రాజమౌళినే ఎందుకు కలిశారని అల్లు అరవింద్‌ను బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. నా అల్లుడు (రామ్ చరణ్) మొదటి సినిమా చిరుత యావరేజ్‌గా రన్ అయింది. అలాంటి సమయంలో అతని తర్వాతి సినిమా చేసే ఛాన్స్ నాదే. చరణ్‌కు మంచి హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే మంచి దర్శకుడిని సంప్రదించాలని ముందే అనుకున్నాను. చరణ్ సినిమా కోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు రెడీగా ఉన్నాను. అలాంటి సమయంలో రాజమౌళిని సంప్రదించాను. అలా మగధీర రావడానికి కారణం అయింది. అలా నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చాను. అది తనపై నాకున్న ప్రేమ' అంటూ అరవింద్ పేర్కొన్నారు.
గతంలో కూడా మగధీర గురించి అల్లు అరవింద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం అనుకున్నదానికంటే 80 శాతం ఖర్చు అధికమైందని ఆయన అన్నారు. మగధీర కోసం తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పెట్టానని ఆయన అన్నారు. అయితే, ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్‌తో సంబంధం లేకుండా ఆయనే సొంతంగా విడుదల చేశారు. మూవీ విడుదలయ్యాక దానికి మూడింతలు వచ్చిందని ఆయనే అన్నారు. ఒక్కోసారి రిస్క్ చేసి పొగొట్టుకున్న సందర్భాలూ కూడా ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment