
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. రామ్‌చరణ్ (Ram Charan)ను చులకన చేసి మాట్లాడలేదని, తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేస్తున్నారని వాపోయాడు. సోమవారం జరిగిన తండేల్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ మధ్య తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో నేను రామ్‌చరణ్ స్థాయి తగ్గించానని ట్రోల్ చేశారు. కానీ నేను దిల్ రాజుగారి పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాను.
ఏకైక మేనల్లుడు
దిల్ రాజు ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్‌కమ్ ట్యాక్సులు అన్నీ అనుభవించారన్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా అనలేదు. అయినా దానికి కొందరు మెగా అభిమానులు ఫీలైపోయి నన్ను ట్రోల్ చేశారు. చరణ్ నాకున్న ఏకైక మేనల్లుడు. తను నాకు కొడుకులాంటోడు. నేను చరణ్‌కు ఏకైక మేనమామను. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఉద్దేశపూర్వకంగా నేను ఏదీ అనలేదు. మీ మనోభావాలు దెబ్బతినుంటే క్షమించండి. ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేయండి అని అల్లు అరవింద్ కోరాడు.
(చదవండి: వాలంటైన్స్ వీక్.. ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు రిలీజ్)
ఇంతకీ ఏం జరిగిందంటే?
అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ తండేల్ (Thandel Movie). ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఓ ఈవెంట్‌లో తన మేనల్లుడు రామ్‌చరణ్ తొలి సినిమా చిరుత సరిగ్గా ఆడలేదని, బిలో యావరేజ్ అని పేర్కొన్నాడు. అందుకే రెండో సినిమాతో హిట్ ఇవ్వాలని మగధీర తీశానన్నాడు. ఈ మూవీతో నష్టపోతానేమోనని భయపడ్డానని, కానీ అది బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయిందన్నాడు. అలాగే దిల్ రాజును స్టేజీపైకి ఆహ్వానిస్తూ.. ఆయన వారం రోజుల్లోనే కష్టనష్టాలన్నీ చూశారన్నాడు. గేమ్ ఛేంజర్ వైఫల్యాన్ని అల్లు అరవింద్ తన మాటల్లో ఎత్తిచూపుతున్నాడని, చరణ్‌ను కించపరుస్తున్నాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్లు అరవింద్‌పై ట్రోలింగ్
అలాగే చిరుత యావరేజ్ కంటే కూడా తక్కువే ఆడిందన్న మాటను మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఈ సినిమా సక్సెస్ అయితే ఫ్లాప్ అంటాడేంటని మండిపడ్డారు. దీంతో అరవింద్‌పై విరుచుకుపడుతూ ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ గురించి తండేల్ ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్‌కు ప్రశ్న ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ.. ట్రోలింగ్ తన దృష్టికి వచ్చిందని, గమనిస్తున్నానన్నాడు. కానీ దీనిపై కామెంట్ చేయనంటూ తెలివిగా సమాధానం దాటవేశాడు. దీంతో అల్లు అరవింద్ ఉద్దేశపూర్వకంగా రామ్‌చరణ్‌ను, చిరుత సినిమాను చులకన చేస్తూ మాట్లాడారని వివాదం ఊపందుకుంది. తాజాగా అరవింద్.. చరణ్ తన కొడుకులాంటివాడంటూ వివరణ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment