
‘మగధీర’ను జీవితాంతం గుర్తుంచుకుంటా!
చిన్నప్పుడు సరదాగా కొన్ని ఆటలు ఆడుకుంటాం. అలా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా బోల్డన్ని ఆటలు ఆడుకున్నారు. వాటిలో మళ్లీ మళ్లీ ఆడుకున్న ఆట ఒకటి ఉందట. అదేంటంటే.. నెత్తికి టోపీ పెట్టుకుని, చేత్తో బెత్తం పట్టుకుని, తనను తాను ఓ పోరాట యోధుడిలా ఊహించుకుని, రాజసం ఉట్టిపడేలా బుజ్జి షాహిద్ నడిచేవాడట. సినిమాల్లోకొచ్చాక పోరాట యోధుడి పాత్ర వస్తే, చేయాలని చిన్నప్పుడే కలలు కనేవాడట.
కానీ, హీరో అయిన ఈ పన్నెండేళ్లల్లో షాహిద్‌కి ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు ‘మగధీర’ రూపంలో ఆ కల నెరవేరుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. ఇందులో గుర్రమెక్కి స్వారీ చేస్తూ, పోరాట యోధుడిగా నటించడం ఆనందంగా ఉందనీ, చిన్నప్పుడు ఇష్టపడి ఆడుకున్న ఆటలోని పాత్రను చేయడం థ్రిల్‌గా ఉందనీ, ఆ కల నెరవేర్చిన ‘మగధీర’ జీవితాంతం గుర్తుండిపోతుందనీ షాహిద్ అంటున్నారు.