Bigg Boss 2 Telugu Elimination: Nutan Naidu is 2nd Person Eliminated from Bigg Boss House | బిగ్ బాస్ ఎలిమినేషన్ - Sakshi
Sakshi News home page

Published Mon, Jun 25 2018 1:12 AM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Common Man Nutan Naidu Eliminated Bigg Boss 2   - Sakshi

నూతన్‌ నాయుడు

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌-2 సీజన్‌లో మరో సామాన్యుడు ఎలిమినేట్‌ అయ్యాడు. గత వారం కామన్‌ మ్యాన్‌ కేటగిరిలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మోడల్‌ సంజనా నిష్క్రమించిన విషయం తెలిసిందే. హౌస్‌ ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఆమె ఎలిమినేషన్‌ను ప్రేక్షకులు సైతం తప్పుబట్టారు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో హౌస్‌లోకి ప్రవేశించిన హీరోయిన్‌ నందిని రాయ్‌ కోసమే తనను తప్పించారని సంజనా సైతం బయటకు వచ్చిన అనంతరం ఆరోపించారు. అయితే ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో సైతం కామన్‌ మ్యాన్‌ నూతన నాయుడే ఎలిమినేట్‌ కావడం బిగ్‌బాస్‌ స్క్రిప్ట్‌ అనే సందేహం ప్రేక్షకులకు కలిగింది. అయితే ఇలా అనుకుంటారని ముందే గ్రహించిన నాని ఈ విషయంలో బిగ్‌బాస్‌ తప్పు ఏమి లేదని వస్తూ.. వస్తూనే ఏడుగురు చేపలంటూ ఓ పిట్టకథతో క్లారిటీ ఇచ్చాడు. ఈ ఎపిసోడ్‌లో ఫుల్‌ ఎనర్జటిక్‌గా నాని అలరించాడు. శనివారం కాస్త సీరియస్‌గా షో కొనసాగగా.. ఈ ఎపిసోడ్‌ మాత్రం పూర్తి ఫన్నీగా సాగింది. తనదైన కామెడీ టైమింగ్‌తో నాని హోస్ట్‌గా మరింత పరిపక్వత కనబర్చాడు.  

ఓ ఆటాడుకున్న నాని..
‘మంచోడికి మూడింది’ అనే ఫన్ని టాస్క్‌తో హౌస్‌లో కంటెస్టెంట్‌లతో నాని ఓ ఆట ఆడుకున్నాడు. తొలుత కంటెస్టెంట్‌లను హౌస్‌లోని ఇష్టమైన వారి పేర్లు కార్డుపై రాసి వారికి మార్కులు వేయమన్నాడు. అనంతరం ఒక్కోక్కరి కార్డుపై పేర్లను చదువుతూ.. వారికి ఫన్నీ టాస్క్‌లను శిక్షలుగా విధించాడు. అయితే ఎక్కువగా దీప్తిని తమకు ఇష్టమైన వ్యక్తిగా పేర్కొన్నారు. గణేష్‌, శ్యామల, నందిని రాయ్‌లు దీప్తిని తమకు ఇష్టమైన వ్యక్తిగా తెలిపారు. అయితే దీప్తికి దీంతో వరుసగా టాస్క్‌లు వచ్చాయి. తొలుత గణేశ్‌తో కలిసి డ్యాన్స్‌, అనంతరం ఉస్మానియా బిస్కెట్స్‌ తినడం, నిల్చొని పద్మాసనం వేయడం, శ్యామలాను తిట్టడం వంటి టాస్క్‌లు చేయాల్సి వచ్చింది. కౌశల్‌, నూతన నాయుడు 20కు 18 మార్కులు వేయగా.. అతనికి 18 చపాతీలు చేసే టాస్క్‌ వచ్చింది. నూతన నాయుడు కౌశల్‌కు 20 మార్కులు వేయగా 20 స్వీట్స్‌ తినే టాస్క్‌ వచ్చింది.

బాను శ్రీ, పిట్ట అని దీప్తి సునైనాకు 18 మార్కులు.. ఆమె బానుశ్రీకి 19 మార్కులు వేశారు. అయితే తొలుత సునైనాకు గుంజీలు తీసే టాస్క్‌ రాగా.. ఇద్దరు ఒకరి చెవులు ఒకరు పట్టుకుని తీశారు. అనంతరం పచ్చి నిమ్మరసం తాగే టాస్క్‌ రాగా ఇద్దరు షేర్‌ చేసుకున్నారు. అమిత్‌ ర్యాప్‌ సింగర్‌ రోల్‌రిడాకు 18 మార్కులు వేయగా.. అతను కప్పగంతుల టాస్క్‌తో ఫ్రాగ్‌ రిడాగా మారిపోయాడు. గీతా మాధురి శ్యామలకు 17 మార్కులు వేయడంతో కూరలో వేసే మిరప బజ్జీలు తినే టాస్క్‌ వచ్చింది. రోల్‌రిడా భానుకు 10 మార్కులు వేయడంతో నాని మిగిలిన నిమ్మరసాన్ని మళ్లీ తాగించాడు. ఈ దెబ్బకు నీ గొంతు సెట్‌ అవుద్దని తనదైన టైమింగ్‌తో చమత్కరించాడు. 

తేజస్వీ అమిత్‌కు 18 మార్కులు వేయగా.. ఆమెను ఎక్కించుకుని 18 పుషప్స్‌ తీసే టాస్క్‌ వచ్చింది. సామ్రాట్‌ తనీష్‌కు 10 మార్కులు వేయడంతో వంగుడు దుంకుడు టాస్క్‌ వచ్చింది. తనీష్‌ తేజస్వీని 18 మార్కులు వేయడంతో పచ్చి గుడ్లు తాగే టాస్క్‌ రాగా..  హౌస్‌లో గ్రూప్‌ మెయింటేన్‌ చేసిన తేజస్వీనితో పాటు తనీష్‌, సామ్రాట్‌లను తలో 6 గుడ్లు తాగమని నాని చెప్పాడు. ఇక హౌస్‌లో తొలి రోజు నుంచి విభిన్నంగా ఉంటున్న బాబు గోగినేని ఈ గేమ్‌ను సైతం స్మార్ట్‌గా ఆడాడు. తనకిష్టమైన పేర్లలో నూతన నాయుడిని సూచించి 20కు సున్నా మార్కులు వేశాడు. దీనికి ఈ గేమ్‌ తేడాగా ఉందని గ్రహించే ఇలా చేశానని గొగినేని వివరణ ఇచ్చాడు. దీంతో నూతన నాయుడు టాస్క్‌ నుంచి తప్పించుకున్నాడు. కిరీటి దామరాజు బాబు గోగినేనికి 20 మార్కులు వేయగా.. 20 ముద్దులు పెట్టాలనే టాస్క్‌ వచ్చింది. దీనికి ఆయన కిరిటీ చేతుల మీద ముద్దులు పెట్టాడు.

ఈ అవకాశం మళ్లీరాదు.. 
కొన్ని కోట్ల మంది చూస్తున్న ఈ షోలో మీ మీద మీరే నమ్మకం కోల్పోయి ప్రవర్తించడం ఎంత వరకు సమంజసమని నాని కంటెస్టెంట్‌లను, ముఖ్యంగా కౌశల్‌ను నిలదీశాడు. అలాంటప్పుడు హౌస్‌లోకి ఎందుకు వచ్చారని, కేవలం విజయం కోసం హౌస్‌లో కొనసాగడం కాదని, ఎవరికి దక్కని ప్రేక్షకాదరణ పొందుతారని తెలిపాడు. తాను ఫలితం గురించి ఆశించకుండా ప్రతి సినిమాకు 100 శాతం ప్రయత్నిస్తానని, మీరు కూడా అలా చేయాలని గట్టిగా చెప్పాడు. ఒక్క ఎపిసోడ్‌ ఎంతో మార్చేస్తుందని, ఫలితం మొత్తం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశాడు. 

ఒక్క సీన్‌..
కౌశల్‌ ఎమోషన్‌తో ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యారని, దాంతో ఓట్లన్నీ అతనికి వెళ్లడంతో నూతన నాయుడు ఎలిమినేట్‌ అయ్యారని, ఇదే బటర్‌ ఫ్లై ఎఫెక్ట్‌ అంటూ నాని వివరణ ఇచ్చాడు. కౌశల్‌ దీప్తిసునైనా ఎత్తుకోవడం ఏమిటి.. కంటెస్టెంట్‌లంతా తనని తప్పుబట్టడం ఏమిటీ.. కిరటీ రచ్చ చేయడం ఏమిటీ.. ప్రేక్షకులంతా కనెక్టయి ఓట్లు వేయడం ఏమిటి ఇదంతా ఓ బటర్‌ ఫ్లై ఎఫెక్ట్‌ అంటూ పిట్ట కథకు ముడిపెడుతూ పేర్కొన్నాడు.

నాయడు బిగ్‌ బాంబ్‌..
ఎలిమినేషన్‌తో హౌస్‌ బయటకు వచ్చిన నూతన నాయుడు.. హౌస్‌లోని తనకిష్టమైన కౌశల్‌, దీప్తిలకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆపదలో అండగా నిలిచారని, ఆకలితో ఉన్నప్పుడు, నిరాశ చెందినప్పుడు ఉత్సాహాన్ని ఇచ్చారని, ఈ ఇద్దరికి మంచి జరగాలని కోరుకున్నాడు. ఈ కామెంట్స్‌కు నాని ఫిదా అయ్యాడు. వెంటనే అతన్ని కౌగిలించుకున్నాడు. నాయుడు వెళ్తూ.. వెళ్తూ హౌస్‌లో వంట గది పాత్రలు, ప్లేట్స్‌ కడిగే బిగ్‌ బాంబ్‌ను తన స్నేహితుడు కౌశల్‌పైనే వేశాడు. ఇది తన మంచి కోరే ఇలా చేశానని, ఇప్పుడు అతను ఆ పని మీద నిమగ్నమై ఉంటాడని నాయుడు వివరణ ఇచ్చాడు. ఇక ఈ ఎపిసోడ్‌ ఆటలు, జోక్స్‌ ఎలిమినేషన్‌ ఎమోషన్‌తో ప్రేక్షకులను కనువిందు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement